మైనర్లకు ‘ఇంజెక్షన్‌’ ఇస్తున్నదెవరు? | 11 trafficked minors, given sex hormone injections, rescued | Sakshi
Sakshi News home page

మైనర్లకు ‘ఇంజెక్షన్‌’ ఇస్తున్నదెవరు?

Published Thu, Aug 2 2018 2:40 AM | Last Updated on Thu, Aug 2 2018 10:53 AM

11 trafficked minors, given sex hormone injections, rescued - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వృత్తి నివారణకు రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బలవంతంగా.., బతుకుదెరువు కోసం.. ఇలా పలు రకాల్లో జరుగుతున్న వ్యభిచార వృత్తికి అడ్డుకట్ట వేయడానికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి. ఈ వృత్తి కోసం బాలికల అక్రమ రవాణాను ఎంచుకున్నారన్న విషయం బయటపడటంతో పోలీసు యంత్రాంగం కంగుతింది. ప్రస్తుతం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంపై పోలీసులు దృష్టిపెట్టారు.

కాగా, యాదగిరిగుట్టలో తరచూ పోలీసులు కార్డన్‌ సెర్చ్, ఇతరత్రా తనిఖీలు చేస్తున్నా ఇలాంటి అమానుష సంఘటన వెలుగు చూడటం నిఘా సంస్థల వైఫల్యమేనని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం పట్టుబడిన వ్యక్తి ద్వారా బాలికల అక్రమ రవాణా విషయం వెలుగు చూసినప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకపోవడం వల్లే అది కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న దందాను అరికట్టడానికి ఇప్పటికే పలువురిపై పీడీయాక్ట్‌ నమోదు చేశారు. అయినా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండటం వెనుక గల వైఫల్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

అసలు ఆ డాక్టర్‌ ఎవరు?
పలు ప్రాంతాల నుంచి సుమారు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలను యాదగిరిగుట్ట పట్టణానికి తీసుకువస్తున్నారు. వీరిని త్వరగా వ్యభిచార వృత్తిలో దింపడానికోసం నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ముందుగా ఇతరులకు అనుమానం రాకుండా స్థానికంగా బాలికలను చదివించి, వారికి 12 సంవత్సరాలు రాగానే శరీర పెరుగుదలకు ఇంజెక్షన్‌లు ఇస్తున్న విషయాన్ని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ వెల్లడించారు.

కాగా, వ్యభిచార గృహాలతో సంబంధం పెట్టుకున్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు రూ.20 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని 12 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లలకు ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడంవల్ల చిన్న వయసులో ఉన్న పిల్లలు యుక్తవయసు ఉన్న అమ్మాయిల్లా కనిపించడంతో పాటు వారి శరీర ఎదుగుదలలో కూడా భారీ మార్పులు వస్తాయి. అసలు ఈ ఇంజెక్షన్‌ ఇస్తున్న వైద్యుడు యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తా లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇస్తున్నాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ వైద్యుడిని పట్టుకుని విచారిస్తే ఇప్పటి వరకు ఎంత మందికి ఇంజెక్షన్‌లు ఇచ్చారనేది తేలుతుందని అంటున్నారు.

అసలు సూత్రధారులు ఎవరు?
చిన్నారులను అక్రమంగా తరలిస్తున్నది ఎవరు? అనే అంశం పోలీసులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరుగుతున్న వ్యభిచార నిర్మూలన ఒక్కరోజుతో అంతమయ్యేది కానప్పటికీ నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన శంకర్‌ అనే వ్యక్తికి చిన్నారుల అక్రమ రవాణాతో సంబంధం ఉన్నట్లు 2015లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కేసు నమోదైంది. శంకర్‌తో పాటు కంసాని యాదగిరి అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. యాదగిరి, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట శివారులో వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తుంటాడు.

ఇప్పటివరకు ఇక్కడి ప్రజలకు ఈ విషయం మాత్రమే తెలుసు. కానీ శంకర్‌తో పాటు యాదగిరి సైతం చిన్నారుల అక్రమ రవాణాలో ప్రధాన వ్యక్తి అని తాజా విచారణలో తెలిసింది. ఇదిలా ఉండగా శంకర్‌ గత ఏడాది క్రితమే మరణించగా ఇటీవలనే పీడీ యాక్టు కింద యాదగిరి జైలులో ఉన్నాడు. చిన్నారుల అక్రమ రవాణా గుట్టు తెలియాలంటే యాదగిరిని విచారించాలని పలువురు అంటున్నారు. అంతేకాకుండా చిన్నారిని ఇబ్బందులకు గురిచేసిన కంసాని కల్యాణికి సంబంధించిన ఓ వ్యక్తికి సైతం అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.

మూడున్నర ఏళ్ల క్రితమే చర్యలు తీసుకుని ఉంటే..
మూడున్నర ఏళ్ల క్రితమే సికింద్రాబాద్‌లో నమోదైన కేసు నేపథ్యంలో అక్రమ రవాణా ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దారుణాలు జరిగేవి కాదని వివిధ స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. యాదగిరిగుట్ట కేంద్రంగా సాగుతున్న చిన్నారుల అక్రమ రవాణా వ్యాపారానికి చెక్‌ పెట్టాలంటే వ్యభిచార గృహాల నిర్వాహకులకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని ఆ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.


పోలీసుల అదుపులో ఆర్‌ఎంపీ డాక్టర్‌?
వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల నిర్వాహకులపై రౌడీషీట్‌

సాక్షి, యాదాద్రి: బాలికలు త్వరగా యుక్త వయసులోకి రావడానికి ఈస్ట్రోజన్‌ ఇంజక్షన్లు ఇచ్చాడనే అనుమానంతో యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికలను కొనుగోలు చేసి వ్యభిచార వృత్తిలోకి దించుతున్న నిర్వాహకులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11మంది బాలికలను కాపాడిన నేపథ్యంలో వారికి ఈస్ట్రోజన్‌ ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.

కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్నవారితో సంబంధాలు కలిగి ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకుని నిజానిజాలు తెలుసుకోవడానికి అతడిని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత మంది పిల్లలకు ఇంజక్షన్‌లు ఇచ్చారు, ఈ దారుణం వెనుక ఎవరెవరి హస్తం ఉంది, ఏ మేరకు డబ్బులు చేతులు మారుతాయి.. వంటి పలు అంశాలపై విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పోలీసులు మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  

లాడ్జీలపై నిఘా తీవ్రతరం
యాదగిరిగుట్ట, వడాయిగూడెం, భువనగిరి, బీబీనగర్‌ ప్రాంతాల్లో గల లాడ్జీలు, రిసార్ట్స్‌లపై దాడులు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించిన కొన్ని లాడ్జీలను సీజ్‌ చేయడంతోపాటు నిర్వాహకులపై ఇప్పటికే పీడీయాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైన వారిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇళ్ల మధ్య గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని కూడా గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement