సాక్షి, ముంబై: నగరంలో మిస్సింగ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. వీరిలో ఎక్కువ శాతం మహిళలే కావడం గమనార్హం. ముఖ్యంగా 16 నుంచి 25 వయస్సు గలవారే నగరంలో ఎక్కువగా తప్పిపోతున్నారని గణాంకాల ద్వారా తేలింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల మేరకు.. 2010 నుంచి 2013 వరకు తప్పిపోయిన వారిలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. తప్పిపోయిన వారిలో 0.34 శాతం మంది మహిళలు, 1.37 శాతం మంది పురుషులు మృతిచెందారని గణాంకాలు చెబుతున్నాయి.
2012లో నమోదైన మిస్సింగ్ కేసుల కంటే 2013లో 23 శాతం అధికంగా నమోదయ్యాయి. మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో (ఎంపీబీ) నుంచి గత నెలలో సామాజిక కార్యకర్త చేతన్ కోటారి ఈ వివరాలను సేకరించారు. కాగా, చాలా మంది యువత తీవ్ర ఒత్తిడికి గురవుతూనో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి పారిపోతున్నారని ఎంపీబీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వసంత్ దోబ్లే తెలిపారు.
మరికొంతమంది మానసిక ఆందోళనకు గురవుతూ, ఇంకొంతమంది ఆర్థికసంక్షోభాన్ని తట్టుకోలేక ఇళ్లు వదిలి పారిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించి పోయి ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే ఉంటున్నాయి. అందులోనూ తల్లిదండ్రులిద్దరూ పనిచేస్తేకాని నగరంలో ఒక మోస్తరు జీవితాలను గడపలేని పరిస్థితి.. దీంతో పిల్లలకు ఇంటిలో మంచీ చెడూ చెప్పేవారు లేక వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని మానసిక వైద్యుడు డాక్టర్ హరీష్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులలో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమన్నారు.
కాగా, మిస్సింగ్ కేసులు నేరాల కిందికి రాకపోవడంతో వీటి విషయాలలో పోలీసులు అశ్రద్ధ వహిస్తున్నారని ఠాణే మాజీ పోలీస్ కమిషనర్ ఎస్.పి.ఎస్.యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు బాంబే హైకోర్టు కూడా పలు మార్గదర్శకాలను సూచించింది. తప్పిపోయిన వారి ఫొటో, పూర్తి వివరాలతో ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారమివ్వాలని, ఆచూకీ చెప్పిన వారికి బహుమతులు అందజేయాలని వాటిలో సూచించింది. అయితే మిస్సింగ్ కేసు కాగానే పోలీసులు స్పందిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చేతన్ కోటారి సూచించారు. కేసును నమోదు చేయడంతోపాటు విచారణలో సైతం పోలీసులు అశ్రద్ధ వహిస్తుండటంతో మిస్సింగ్ కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
ఒత్తిళ్లతోనే ‘మిస్సింగ్’..!
Published Mon, Jun 30 2014 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
Advertisement
Advertisement