మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండటం, జీవన కాలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను దీనికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవన అవసరాల కోసం ఎక్కువగా పొదుపు చేయాల్సిన అవసరం మగవారితో పోలిస్తే మహిళలకే ఉంటుంది. జీవిత భాగస్వామి ఉన్నప్పటికీ ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు జీవిత లక్ష్యాలు, అవసరాల విషయంలో ఓ ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం శ్రేయస్కరమనేది ఆర్థిక నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
మనదేశంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం 20 శాతం మేర ఉంటోందని ‘మాన్‌స్టర్’ శాలరీ ఇండెక్స్ సూచిస్తోంది. మధ్య స్థాయిలో చూస్తే పురుషులు సగటున ఓ గంట పనికి రూ.231 పొందుతుంటే, మహిళలకు లభిస్తున్నది రూ.184.80 మాత్రమే. ఇక అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ అంతరం ఇంకా అధికమవుతోంది. ఏడేళ్ల సీనియారిటీ కలిగిన వారి మధ్య అంతరం 7.8 శాతం అయితే, 11 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న స్త్రీ, పురుషుల మధ్య వేతనం చెల్లింపుల్లో అంతరం 25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను చూసిన తర్వాతయినా మహిళలు తమ అవసరాలపై కొంచెం అధిక శ్రద్ధ వహించక తప్పదు. అందుకే వీరు పురుషులతో పోలిస్తే అదనంగా పొదుపు, మదుపు చేయడం అవసరం.
ఉద్యోగ కాలం కూడా తక్కువే...
పై గణాంకాలను చూస్తే మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అలాగే, మహిళల ఉద్యోగ కాలం కూడా పురుషులతో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పిల్లల సంరక్షణ కోసం మధ్యలో విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సగటున కనీసం ఓ ఏడేళ్ల పాటు వారు ఉద్యోగానికి దూరంగా ఉంటారు. అంటే ఆ కాలంలో వారు పొదుపు, పెట్టుబడులు చేయలేరు. అంతకాలం పాటు సీనియారిటీ కూడా కోల్పోయినట్టుగానే భావించాలి. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరితే వారికొచ్చే వేతనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికొచ్చే ప్రయోజనాల్లోనూ ఆ మేరకు కోత పడుతుంది.
జీవన కాలం.. కాస్త అధికం
పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవన కాలం కొంచెం ఎక్కువ. మహిళల సగటు జీవన కాలం 70 ఏళ్లు, మగవారి సగటు జీవన కాలం 67గా అంచనా. అంటే రిటైర్ అయిన తర్వాత మహిళలకు ఎక్కువ కాలం పాటు జీవన అవసరాలు ఉంటాయి. దాంతో వారికి అధిక నిధులు అవసరం అవుతాయి. కొందరు ఇంకా దీర్ఘకాలం పాటు జీవించొచ్చు. అప్పుడు ఆ అవసరాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వైద్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో నిధుల అవసరం ఎంతో ఉంటుంది.
మరింత పొదుపు చేయాల్సిందే..
మహిళలు మగవారితో పోలిస్తే కనీసం రెట్టింపు పొదుపు చేయాలి. విశ్రాంత జీవనం కోసం వేతనంలో 10 శాతానికి బదులు 20– 25 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయాలనేది ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్దే సూచన. ఒకవేళ ఉద్యోగం వచ్చిన కొత్తలో అవసరాలకు అధికంగా ఖర్చవుతూ పొదుపు చేయలేకపోతుంటే బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడులకు వెళ్లేలా ఈసీఎస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే, ప్రావిడెంట్ ఫండ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. అంటే ఉద్యోగి తన ఈపీఎఫ్ వాటాకు సొంతంగా మరికొంత జోడించడం. దీనివల్ల మీ వేతనం నుంచి ఆటోమేటిగ్గా భవిష్యనిధికి జమ అవుతుంది. దీనిపై ఈపీఎఫ్‌కు సమానంగా వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలు లభించడం అదనపు ఆకర్షణ.
మెరుగ్గా ఇన్వెస్ట్‌మెంట్...
పొదుపు చేయడంతోనే ఆగిపోతే లాభం ఉండదు. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం తక్కువ పొదుపు చేయడం కంటే ప్రమాదమన్నది ఆర్థిక సలహాదారుల మాట. తక్కువ భాగమే డెట్‌లో ఇన్వెస్ట్‌చేసి అధిక భాగాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, దీర్ఘకాలంలో డెట్ కంటే అధిక రాబడులను పొందొచ్చు. ఇంకో విషయం మీ లక్ష్యానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. రిటైర్మెంట్‌కు ఎంత అవసరం అన్నది లెక్కవేసుకోవాలి. ద్రవ్యోల్బణం, పన్ను పరమైన అంశాల ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి.
హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి...
ఇక రిటైర్మెంట్ నిధి కరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వైద్య బీమా పాలసీ ఒకటి. వైద్య ఖర్చుల విషయంలో ద్రవ్యోల్బణం 12–15 శాతంగా ఉంటోంది. వృద్ధాప్యంలో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోతోంది. అందుకని పెద్ద వయసులో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండచ్చు. బీమా పాలసీ ఉంటే విశ్రాంత జీవన అవసరాల కోసం కష్టపడి కూడబెట్టిన నిధులు కరిగిపోకుండా ఉంటాయి.
మెరుగైన వేతనం...
ఇక ఉద్యోగంలో ఎదుగుదల చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అధిక వేతనం కోసం ఉద్యోగం మారడం, ఎదుగుదల లేని సంస్థను వీడటం ద్వారా అధిక ఆర్జనకు బాటలు వేసుకోవచ్చు. ఎక్కువ ఆర్జన ఉంటే పొదుపు, మదుపులకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో కొనసాగడం అవసరమవుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కనీసం 15–20 ఏళ్ల పాటు జీవన కాలం ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment