Top Worst Habits and Behaviors That Women Hate in Men - Sakshi
Sakshi News home page

Men's Bad Habits: వాష్‌రూమ్‌ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?

Published Sat, Mar 26 2022 11:20 AM | Last Updated on Sun, Mar 27 2022 8:45 AM

Top Worst Habits And Behaviors That Women Hate in Men  - Sakshi

హైదరాబాద్‌ మూసాపేటలో రెండు రోజుల క్రితం గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం? వాష్‌రూమ్‌ను వాడిన భర్త నీళ్లు కొట్టకపోవడంపై ఆమె విసుక్కుంది. భర్త వాదనకు దిగాడు. అంతే. స్త్రీలకు మగవారి దురలవాట్లు కొన్ని ససేమిరా నచ్చవు. వారు ఆ సంగతి చెప్పినప్పుడు వాటిని మానుకోవడం మగవాళ్ల కనీస సంస్కారం. 
ఎన్ని విధాలుగా చెప్తే మారుతారు మగవారు?  

నాన్నకు అమ్మ చెప్పలేదు. భర్తకు భార్య చెప్పలేదు. తండ్రికి కూతురు చెప్పలేదు. ఒకసారి చెప్పి ఉంటారు. విని ఉండరు. మరోసారి చెప్పి ఉంటారు. లెక్క చేసి ఉండరు. ఇంకోసారి చెప్పడం మానుకుని ఉంటారు. మానుకున్నారు కదా అని అలవాటు కొనసాగిస్తూ ఉంటారు. 

 ఇప్పుడు దీనిని తిరగేద్దాం. 
నాన్నకు స్కూటర్‌ ఉదయాన్నే శుభ్రంగా తుడిచి కనపడకపోతే కోపం వస్తుందనుకుందాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది. ఆయనకు కోపం వస్తుందని తనో పిల్లల చేతో ఆ పని చేయిస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్లే ముందు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే విసుగొస్తుందనుకుందాం. అమ్మ ఎంత అలెర్ట్‌గా ఉంటుంది. నాన్నకు ఫలానా సామ్రాణికడ్డి వాసన పడదనుకుందాం. అప్పుడు అమ్మ ఆ సామ్రాణి కడ్డీలను బయట పారేస్తుంది. నాన్నకు ఇష్టం లేనివి ఇంట్లో ఉండవు. కాని అమ్మకు ఇష్టం లేనివి? 

బాల్యం నుంచి ప్రభావాలు 
అమ్మ ఒక ఇంటి నుంచి వస్తుంది. నాన్న ఒక ఇంటి నుంచి వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక చోట చేరి జీవితం మొదలెడతారు. నాన్నకు ఎలాగైతే బాల్యం నుంచి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయో అమ్మకు కూడా అలాగే ఉంటాయి. కొన్ని తీవ్రమైన ఇష్టాలు అయిష్టాలు ఏర్పడి ఉంటాయి. కాని వాటికి నాన్న విషయంలో చెల్లుబాటయినట్టుగా అమ్మ విషయంలో కాదు. ఆ... ఏముందిలే.. అనే భావన. ఈ భావన ఇంకా ఎంత కాలం. అసలు అమ్మకు, భార్యకు, కుమార్తెకు ఇష్టం లేని అలవాట్లను మగవాళ్లు ఎందుకు కొనసాగించాలి. 
చదవండి: వాష్‌రూమ్‌ వాడి సరిగా నీళ్లు కొట్టరు.. విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. పైగా!

చిన్న చిన్నవే అన్నీ... 
మనుషులు వైముఖ్యం కావడానికి ఎదుటి వారి మీద తీవ్రమైన అసహనం పెంచుకోవడానికి యుద్ధాలు రానక్కర్లేదు. చిన్న చిన్న దురలవాట్లు చాలు. ఉదాహరణకు స్త్రీలు ఇష్టపడని ఈ దిగువ విషయాలు ఎంత మంది పురుషులు ఇళ్ళల్లో కొనసాగిస్తారో గమనించండి. 
►బయట నుంచి రాగానే చెప్పులు కుదురుగ్గా విడవరు. 
►విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. లేదా వాష్‌ ఏరియాలో పడేయరు. లోదుస్తులు బాత్‌రూమ్‌లోనే వదిలేస్తారు. తడి టవల్‌ కుర్చీ మీద ఆరేస్తారు. 
►సిగరెట్‌ డ్రాయింగ్‌రూమ్‌లో తాగి యాష్‌ట్రే క్లీన్‌ చేయకుండా వదిలేస్తారు. 
►ఇయర్‌ బడ్స్‌ వాడి ఇంట్లో ఏదో ఒక మూలకు పడేస్తారు. 
►వాష్‌రూమ్‌ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు. 
►షేవింగ్‌ చేసుకుని ఆ రేజర్‌ సింక్‌ మీదే వదిలిపెడతారు. 
►అన్నం తిని ప్లేట్‌లోని చెత్తను డస్ట్‌బిన్‌లో వేయకుండానే సింక్‌లో పడేస్తారు. 
►పెద్ద పెద్దగా కేకరిస్తూ పండ్లు తోముతారు. 
►నిద్ర లేచాక దుప్పట్లు మడిచిన పాపాన పోరు 
►బాత్‌రూమ్‌లోకి న్యూస్‌పేపర్‌ తీసుకెళ్లి తడి చేసి పట్టుకొస్తారు 
►ఫోన్‌ ఎప్పుడూ చార్జింగ్‌ పెట్టుకోరు, పైపెచ్చు ఇంట్లోవాళ్లు ఛార్జింగ్‌ పెట్టలేదని తిడతారు. 
►గీజర్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్‌ చేయరు. 

►వీటిలోని ఏ ఒక్కటి కొనసాగించినా స్త్రీలకు కష్టం. అలాంటిది ఇవన్నీ కొనసాగించేవారు ఉంటే ఆ స్త్రీలు ఎంత రోత అనుభవించాలి. అయినా సరే వారు భర్తలతో ఇంటి మగవారితో నవ్వుతూ వ్యవహరించాలని ఆశించడం ఏం భావ్యం. 

తప్పు చేస్తూ దబాయింపు 
ఇవన్నీ పురుషులు మానుకోగల అలవాట్లే. ఇంటి స్త్రీల మీద గౌరవం, ప్రేమ ఉంటే వెంటనే మానుకోవాలి కూడా. ఎప్పుడో ఒకసారి బద్దకించవచ్చు. కాని నిత్యం ఇదే పని అంటే అది ఏం సంస్కారం. ఏదో ఒకనాడు భరించలేక స్త్రీలు మందలిస్తే పురుషులు పౌరుషానికి పోయో, అహం కొద్దో, గిల్ట్‌తోటో స్త్రీలపై ఎదురుదాడి చేస్తే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమీ బాగుండవు. వ్యక్తుల బయట ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే సమాజం ఇబ్బంది పడుతుంది. ఇంటి ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే స్త్రీ మాత్రమే ఆ బాధ అనుభవిస్తుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా వినడే’ అని స్త్రీల లోలోపల విరక్తి గూడుకట్టుకోవడం ఏమీ మంచిది కాదు. కనుక మారడం పురుషుల విధి. వారికి నేరుగా చెప్పడం స్త్రీలకు వీలు కాకుంటే ఈ వ్యాసం చూపిస్తే సరి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement