సాక్షి, హైదరాబాద్: అస్థిరమైన జీవనశైలి, హార్మోన్ల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా అన్ని ప్రధాన రాష్ట్రాల్లోనూ మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ గుండెపోటుతో మరణిస్తున్నారు. గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 284 మంది గుండెపోటుతో మరణించగా.. ఇందులో 257 మంది పురుషులు కాగా.. 27 మంది స్త్రీలున్నారు. ఆంధప్రదేశ్‌లో 176 మంది మృత్యువాత పడగా.. 162 మంది మగవాళ్లు, 14 మంది ఆడవారున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇండియా (ఏడీఎస్‌ఐ)–2022 నివేదికలో బహిర్గతమైంది.
గుండెపోట్లు ఎందుకంటే..
గుండె జబ్బులకు ప్రధాన కారణం జన్యు సంబంధమైనవే. బలహీన గుండె కండరాలు ఉంటే హార్ట్ ఎటాక్‌లకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మహిళలకు మెనోపాజ్ దశ వరకు శరీరంలో హార్మోన్లు భద్రత కల్పింస్తాయి. కానీ, పురుషులకు అలా ఉండదు కాబట్టి యుక్త వయసులో కూడా మగవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ.అతిగా మాంసం వినియోగం, కొవ్వు, జంక్ ఫుడ్ వంటి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక, మానసిక ఒత్తిడి, అస్థిరమైన జీవనశైలి వల్ల గుండెపోటు వస్తుంటుంది.
గుండె ఆగుతున్న వారిలో యువకులే ఎక్కువ
గతేడాది దేశంలో 32,410 మంది గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించగా.. ఇందులో 28,005 మంది పురుషులు, 4,405 మంది మహిళలు ఉన్నారని. 2021లో 28,413 మంది హార్ట్ ఎటాక్‌తో మృత్యువాత పడ్డారు. అంటే ఏడాదిలో 12.5 శాతం పెరిగింది. గతేడాది 289 మంది మైనర్లకు హార్ట్ ఎటాక్ రాగా.. ఇందులో 185 మంది బాలురు, 104 మంది బాలికలున్నారు.
18 నుంచి 45 ఏళ్ల 12,759 మంది యువత గుండెపోటుకు గురికాగా.. 11,210 మంది పురుషులు, 1,549 మంది స్త్రీలు, 45–60 ఏళ్ల వయసు ఉన్న 12,290 మంది గుండె పోటుతో మరణించగా.. మగవాళ్లు 10,854 మంది, సమహిళలు 1,436 మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్ల పైబడిన వాళ్లు 7,069 మంది మరణించగా.. 5,756 మంది పురుషులు, 1,313 మంది మహిళలున్నారు.
ఏం చేయాలంటే...
► సాధ్యమైనంత వరకు మానసిక, పని ఒత్తిడిని తగ్గించుకోవాలి.
► ఉదయం, సాయంత్రం వ్యాయామం తప్పనిసరి.
► స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే ప్రాంతంలో ప్రతి రోజు కొంత సమయం గడపాలి.
► ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం నిత్యం యోగా, ధ్యానం వంటివి చేయాలి.
► 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి.
► స్వీయ సంతృప్తి అత్యవసరం. లేనిపోని ఆర్భాటాలకు, డాబులకు పోయి మానసిక ఒత్తిడి తెచ్చుకోకూడదు. డాక్టర్ ఏజీకే గోఖలే గుండె శస్త్ర చికిత్స నిపుణులు, అపోలో ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment