
సరదాగా రోజుని ప్రారంభించిన ఆ నవ జంట.. విషాదకరరీతిలో తమ జీవితాలకు ముగింపు పలికింది.
ఢిల్లీ: సరదాగా రోజుని ప్రారంభించిన ఆ కొత్తజంట.. విషాదకరరీతిలో తమ జీవితాలకు ముగింపు పలికింది. 24 గంటల వ్యవధిలో భర్త కన్నుమూయగా.. భర్త మృతదేహాన్ని చూసి భరించలేని ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. దేశరాజధాని పరిధిలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన వివరాల్లోకి వెళ్తే..
అభిషేక్ అహ్లూవాలీ-అంజలికి నవంబర్ 30వ తేదీన వివాహం జరిగింది. ఘజియాబాద్‌లో ఉంటున్న ఈ జంట.. సోమవారం ఢిల్లీ జూ సందర్శనకు వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన కాసేపటికే ఛాతీలో నొప్పి ఉందంటూ అభిషేక్ అంజలితో చెప్పాడు. ఆందోళనతో అంజలి అతని స్నేహితులకు వెంటనే సమాచారం ఇచ్చింది. వాళ్లు అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సఫ్దార్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే అభిషేక్ కన్నుమూశాడని.. అతని మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.
పోస్ట్‌మార్టం తర్వాత అభిషేక్ మృతదేహాన్ని రాత్రి 9గం. సమయంలో ఆ జంట ఉంటున్న ఫ్లాట్‌కు తరలించారు. అందరూ శోకసంద్రంలో మునిగిపోగా.. అంజలి మాత్రం అక్కడి నుంచి బయటకు వెళ్లింది. బంధువులు అప్రమత్తమై ఆమెను అడ్డుకునేలోపే.. ఏడో అంతస్తుకు చేరి అక్కడి నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన అంజలిని వైశాలి ఏరియాలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసింది. 24 గంటల వ్యవధిలో.. అభిషేక్ అంజలి దంపతుల మృతి చెందడంతో ఇరుకుటుంబాల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.