కక్ష | Family crime story special | Sakshi
Sakshi News home page

కక్ష

Published Wed, Jul 18 2018 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

Family crime story special - Sakshi

ప్రేమలు కనుమరుగౌతున్నాయి.
అసూయలు కక్షలైపోతున్నాయి.
కుతంత్రాలు కాటికి తీసుకెళ్తున్నాయి.
కుటుంబాలు కల్లోలమౌతున్నాయి.
ప్రేమలు పునఃపరిమళిస్తే
కక్షలు కటకటాలదాకా పోవు.

అతను ఇంటికి లేడు... ఊరికి లేడు... అదృశ్యమయ్యాడు. అతను భార్యకు లేడు.. పిల్లలకు లేడు... అదృశ్యమయ్యాడు. అతను ఉద్యోగానికి లేడు... జీతానికి లేడు... అదృశ్యమయ్యాడు. చావులో ఒక నిర్థారణ ఉంది. మనిషి పోయాడని ఏడ్వొచ్చు. అదృశ్యమైతే ఉన్నట్టా.. లేనట్టా... బతికినట్టా... చచ్చినట్టా.1998. గోదావరి ఖని.‘లెక్కల సారు వచ్చాడా?’ అడిగాడు రాజేష్‌.నైట్‌డ్యూటీకి రెడీ అవుతున్నాడతడు. బొగ్గుబావిలో అతని ఉద్యోగం. ఇప్పుడు వెళితే తెల్లారిన తర్వాత వస్తాడు.‘వస్తాడు లేండి. వస్తే టీ ఇస్తాను’ అంది భార్య రాణి.ఇద్దరికీ కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది. వాడిప్పుడు టెన్త్‌ క్లాస్‌. క్రికెట్‌లో పడి లెక్కల్లో బాగా వెనుకబడ్డాడు. ప్రీ పబ్లిక్‌ పరీక్షల్లో వాడి మార్కులు చూసి స్కూలు మాస్టారినే బతిమిలాడి ట్యూషన్‌ పెట్టించాడు రాజేష్‌. రోజూ ఇంటికొచ్చి లెక్కలు చెప్పాలని అందుకు గౌరవమైన డబ్బు ఇస్తానని ఒప్పంది.స్కూలు మాస్టారు గణేష్‌ సార్‌కి ఇది కొత్తేగాని బ్యాచిలర్‌గా రూముకు వెళ్లి చేసేదేముందని ఒప్పుకున్నాడు.ఇంటి ముందు టీవీఎస్‌ అలికిడి అయ్యింది.‘అదిగో వచ్చినట్టున్నాడు’ అంది రాణి.
గణేష్‌ సార్‌ రాజేష్‌ను చూసి విష్‌ చేసి ట్యూషన్‌ చెప్పడానికి కేటాయించిన ముందు గదిలోకి నడిచాడు. అప్పటి వరకూ టీవీ చూస్తున్న కొడుకు కుమార్‌ కూడా లేచి పుస్తకాలు తీసుకొని గదిలోకి వెళ్లాడు.వాళ్లను సంతృప్తిగా చూసుకొని స్కూటర్‌ తీసుకొని డ్యూటీకి బయలుదేరాడు రాజేష్‌.గణేష్‌ సార్‌కు టీ ఇవ్వడానికి కిచెన్‌లోకి వెళ్లింది రాణి.
 

రెండు నెలలు గడిచాయి. ఒకటో తేదీ వచ్చింది. జీతం తెచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది ఇచ్చాక గణేష్‌ సార్‌కు ఇవ్వాల్సింది కూడా భార్యకు ఇచ్చి ఇచ్చేయమన్నాడు రాజేష్‌.‘అలాగే’ అంది రాణి.ఆ తర్వాత భర్త ఏం చేస్తాడో ఆమెకు తెలుసు. ఒక వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుని రెండు రోజులు ఊరికి వెళ్లి వస్తాడు. ఊళ్లో తల్లి ఉంటుంది. తమ్ముడు, మరదలు ఉంటారు. వాళ్లనుపలకరించి అక్కడే ఓ రెండు రోజులు ఉండి డబ్బులిచ్చి వస్తాడు. ‘ఇవాళ వెళుతున్నారా?’ అడిగింది.‘వెళ్లాలిగా వచ్చేస్తాలే. వాణ్ణి టీవీ చూడనివ్వకు’ అని చెప్పి బయలుదేరాడు.భర్త వెళ్లిన దారిలోనే చూస్తూ నిలుచుంది రాణి.భర్త వీధి చివర కనుమరుగయ్యాడు. అయినా అలాగే నిలుచుంది. ఐదు నిమిషాల తర్వాత గణేష్‌ సార్‌ వస్తూ కనిపించాడు.సంతృప్తిగా కిచెన్‌లోకి నడిచింది.
 

రెండు రోజులు గడిచాయి.రాజేశ్‌ ఇంటికి రాలేదు. నాలుగురోజులు గడిచినా రాలేదు. రాణి కంగారుపడింది. సెల్‌ఫోన్లు లేని రోజులవి. ఐదో రోజు తానే అత్తగారింటికి వెళ్లింది. ‘అదేంటి... ఒక్కరోజే ఉండి పనుందని వెళ్లాడే’ అంది అత్త.రాణి హతాశురాలయ్యింది.  ఈలోపు మరిది రమేశ్‌ వచ్చాడు. జరిగింది తెలుసుకుని ‘కంగారు పడకు వదినా! అన్న కోసం వెదుకుదాం’ అన్నాడు.అంతా కలిసి గోదావరిఖనికి వచ్చారు. రాజేశ్‌ కనిపించడం లేదన్న వార్త వాడ మొత్తం పాకింది. ఇరుగూ పొరుగువారు, మిత్రులు వచ్చి పరామర్శించి వెళుతున్నారు. మరోవైపు పనిచేసే వెళ్లి వాకబు చేశాడు రమేశ్‌. అక్కడా సమాచారం ఏమి చెప్పలేదని వారు చెప్పారు. బావి కాడ కూడా ఎవరికీ ఏమీ తెలియదట’ అని చెప్పాడు ఇంటికొచ్చింది.రాణి, రాజేష్‌ తల్లి ఏడుపు అందుకున్నారు. ‘నా కొడుకు ఏమయ్యాడు దేవుడో’...అందరి సలహా మేరకు పోలీసు కంప్లయింట్‌ ఇచ్చారు.  మిస్సింగ్‌ కేసు నమోదు అయ్యింది.
 

ఎంక్వయిరీ మొదలైంది. రాజేశ్‌ ఎలాంటివాడు?  వైవాహిక జీవితం ఎలా ఉంది?  శత్రువులెవరైనా ఉన్నారా? లేక కావాలని వెళ్లిపోయాడా? అన్న విషయాలపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు పోలీసులు. చాలామందిని ప్రశ్నించినా ఎక్కడా ఎలాంటి క్లూ దొరకలేదు. ప్రభుత్వ ఉద్యోగం, చక్కటి భార్య, చదువుకుంటున్న కొడుకు, సమాజంలో గౌరవం అన్నీ బానే ఉన్నాయి. అలాంటపుడు రాజేశ్‌ ఏమైనట్లు? ఇంతకాలం అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఎస్‌.ఐ.
 

రెండు రోజులు గడిచాయి.చిన్నకొడుకు రమేష్‌తో కలిసి స్టేషన్‌కి వచ్చింది రాజేష్‌ తల్లి.‘సార్‌. మా రాజేశ్‌ నుంచి ఉత్తరం వచ్చింది’ అంటూ పోస్ట్‌ కార్డ్‌ తెచ్చి ఎస్‌.ఐకి చూపించింది. వెనక్కి తిప్పి చూశాడు. కరీంనగర్‌ స్టాంప్‌ ఉంది. ‘నేను బానే ఉన్నాను.. నా గురించి వెతక వద్దు’ అని రాసి ఉంది అందులో.‘ఇది మీ అబ్బాయి రాతేనా’ అడిగాడు.‘మా అబ్బాయి రాతే’ అంది తల్లి.‘మరి ఇంకేటి?’ అన్నాడు.ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి.‘సార్‌... కొడుక్కి ఏదైనా అయితే తల్లి మనసు ఊరికే ఉండదు. కొట్టుకుంటుంది. ఈ ఉత్తరం చూసినా నా మనసు కుదుట పడలేదు. కొట్టుకుంటూనేఉంది. నా కొడుకు బతికి ఉన్నాడని నేననుకోవడం లేదు. చెప్పకుండా ఎటో వెళ్లాల్సిన అవసరం వాడికి లేదు. నాకు మా కోడలి మీదే అనుమానంగా ఉంది. వాడు మాయమయ్యాడన్న బాధ ఆమెలో కొంచెం కూడా లేదు. పైగా మా మనవడికి ట్యూషన్‌ చెప్పేందుకు వచ్చే టీచర్‌తో కలివిడిగా ఉంటోంది.’ అంది.
 

వెంటనే గణేష్‌ సార్‌ మీద నిఘా పెట్టారు పోలీసులు. రాజేష్‌ కనపడకుండా పోయినప్పటి నుంచి అతను ట్యూషన్‌ చెప్పడానికి రావడం లేదు.అతన్ని స్టేషన్‌కి తీసుకొచ్చారు పోలీసులు. చాలాసేపు విచారించారు. ‘తండ్రి కనిపించడం లేదని ఆ కుర్రాడు డిస్ట్రబ్‌ అయి ఉన్నాడు. ఈ గోలలో ట్యూషన్‌ ఎందుకని వెళ్లడం లేదు’ అన్నాడు గణేష్‌ సార్‌.‘రాణితో నీకు ఎలాంటి పరిచయం’ అడిగాడు ఎస్‌.ఐ.‘అయ్యో.ఆమె చాలా మంచిదండీ’ అన్నాడు గణేష్‌.అతను అబద్దం చెబుతున్నట్లుగా ఎస్‌.ఐకి అనిపించలేదు. ‘ఈ విషయం ఎక్కడా చెప్పొద్దు’ అని హెచ్చరించి వదిలేసాడు. కథ మళ్లీ మొదటికొచ్చింది. 
గణేశ్‌ సార్‌ కాదు... రాణి పాత్ర లేదు. మరి, రాజేశ్‌ అదృశ్యం వెనక ఎవరి హస్తం ఉందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న ఎస్‌.ఐకి టేబుల్‌ మీద అమాయకంగా ఉన్న పోస్ట్‌కార్డ్‌ వెక్కిరిసూ కనిపించింది. 
 

ఆ పోస్ట్‌కార్డ్‌ తీసుకొని రంగంలోకి దిగాడు ఎస్‌.ఐ. మొదట ఒక టీమ్‌ను కరీంనగర్‌ పంపాడు. కాని అక్కడ రాజేష్‌ ఉన్నట్టుగా ఎటువంటి ఆనవాలు దొరకలేదు. తర్వాత దానిని తీసుకెళ్లి్ల రాజేశ్‌ పని చేసే గనిలో, సొంతూళ్లో అతని మిత్రులకు చూపించాడు. ‘ఇది రాజేష్‌ రాతే’ అని అందరూ చెప్పారు.మరైతే అతడు ఎలా ఎందుకు అదృశ్యమయ్యాడనేది పెద్ద మిస్టరీగా ఉంది ఎస్‌.ఐకి.ఇక ఒక్క స్నేహితుడు మిగిలాడు.అతడికి లెటర్‌ చూపించాడు ఎస్‌.ఐ. అతడు ఆ అక్షరాలు చూసి ‘ఇవి రాజేష్‌వి కావు’ అన్నాడు.‘ఎలా చెప్పగలవు?’ అన్నాడు ఎస్‌.ఐ.ఒక అక్షరం చూపిస్తూ ‘ఇది రాజేష్‌ ఇలా రాయడు. కాని ఈ లెటర్‌ రాసింది మాత్రం ఈ ఊరి వాళ్లే’ అన్నాడు.
 

రెండు రోజులు పోలీసులు ఎవరి కదలికల మీద నిఘా పెట్టాలో వారి మీద పెట్టారు. మూడో రోజు తెచ్చి లోపల వేశారు. అతడే రమేష్‌. రాజేష్‌ తమ్ముడు.‘చెప్పు ఈ లెటర్‌ ఎందుకు రాసావు?’  ప్రశ్నించాడు ఎస్‌.ఐ.‘ఇది మా అన్న రాసిందే, కావాలంటే కింద సంతకం ఉంటుంది చూసుకోండి’ అన్నాడు రమేష్‌.‘అది నువ్వే రాసావు. అందులో ‘క’ అనే అక్షరం కాస్త డిఫరెంటుగా ఉంది.‘మీ ఊరు మొత్తంలో అలా రాసేది నువ్వొక్కడివే. అది నీ తప్పు కాదు మీకు చదువు నేర్పిన తెలుగు మాస్టారుది. ఆయన కర్ణాటక వ్యక్తి. అతని వద్ద అక్షరాలు దిద్దిన నువ్వు ‘క’ అక్షరాన్ని కన్నడలో రాసినట్లుగా రాస్తావు. కాలక్రమంలో నీ మిత్రులందరూ ఆ అలవాటు మార్చుకున్నా మధ్యలోనే చదువు మానేసిన నువ్వుమాత్రం ఇప్పటికీ అలాగే రాస్తున్నావు’ అన్నాడు ఎస్‌.ఐ.రమేశ్‌ ముఖంలో రంగులు మారాయి.అదే అదనుగా లాగిపెట్టి చెంపకు ఒక్కటి అంటించాడు ఎస్‌.ఐ.ట్రీట్‌మెంట్‌ పనిచేసింది.. నిజం కక్కేసాడు రమేశ్‌.‘ఆ లెటర్‌ రాసింది నేనే.. మా అన్నను చంపింది కూడా నేనే’...విషయాలు ఒక్కొక్కటి చెబుతున్నాడు.. ‘రాజేశ్‌ అంటే నాకు చిన్నప్పటి నుంచి పడేది కాదు. చదువులో వాడెప్పుడూ ఫస్టే. నాకు చదువు రాదని అంతా గేలి చేసేవారు.

ఇంట్లో వాళ్లు కూడా వాడే గ్రేట్‌ అంటూ పొగిడేవారు. పెద్దయ్యాక వాడు సింగరేణిలో ఉద్యోగం సంపాదించాడు. నాకు చదువు అబ్బకపోవడంతో ఊళ్లోనే పొలం పనులు చూసుకునేవాడిని. మా అన్న ఊరికి వచ్చిన ప్రతీసారి ఇంకెప్పుడు బాగుపడతావంటూ తిట్టేవాడు. పైగా వాడు ఊళ్లోకి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు అంతా అతని చుట్టే మూగేవారు. ఇవన్నీ మా అన్న మీద ఈర్ష్య పెరిగేలా చేసాయి. అన్నకు సమాజం ఇస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేక పోయాను. చంపాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు మా అన్న తిరిగి ఊరు నుంచి బయల్దేరినప్పుడు బస్టాపు వద్ద దిగబెడతానని నమ్మబలికాను. మాటలు చెబుతూ గోదావరిఖని దాకా తీసుకెళ్లాను. దారిలో ఓ పాడుపడిన బావి ఉంది. అక్కడ ఎవరూ ఉండరు. అక్కడే అన్నను కత్తితోపొడిచి చంపి, శవానికి రాళ్లుకట్టి బావిలో పడేసాను. నాపై అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డాను.  వదిన మా ఇంటికి వచ్చి అన్న గురించి చెప్పాక నింద వదిన– ట్యూషన్‌ మాస్టారుపై పడేలా  అమ్మకు చాడీలు చెప్పాను. అయినా నేరం బయటపడుతుందని భయమేసి పక్కదోవ పట్టించడానికి కార్డు రాసి కరీంనగర్‌లో పోస్ట్‌ చేసి వచ్చాను. మా అన్న రైటింగ్‌ నా రైటింగ్‌ ఒక్కలాగే ఉంటుంది. కాని క అక్షరం నన్ను పట్టించింది’ అంటూ తల ఒంచుకున్నాడు.మరునాడు ఆ పాడుబడ్డ బావి నుంచి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శవాన్ని బయటికి తీసారు పోలీసులు.కోర్టు రమేష్‌కు యావజ్జీవం వేసింది. సొంత అన్న మీద ద్వేషం పెంచుకుని చేసిన పిచ్చి పని వల్ల ఆ తల్లికి ఇద్దరు కొడుకులు దూరమయ్యారు. రాణికి ఇది కోలుకోని దెబ్బ అయినా భర్త స్థానంలో ఉద్యోగం రావడంతో కొడుకును భర్త ఆశయాలకు తగినట్టుగా తీర్చిదిద్ద గలిగింది. కొడుకును చూసుకుంటూ జీవితం గడుపుతోంది.
– అనిల్‌కుమార్‌ భాషబోయిన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement