సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష(టీఆర్‌టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు ఊరట లభించింది. వారి పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ, 40 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ వర్గాలకు చెందిన డీఈడీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, టీఆర్‌టీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని అధికారులు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. అయితే, టీఆర్‌టీకి దరఖాస్తు చేసుకున్న పలువురి దరఖాస్తులను, డిగ్రీలో కనీస మార్కులు లేవన్న కారణంతో అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది.
Comments
Please login to add a commentAdd a comment