
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో చదివినందున తనకు టీఆర్‌టీ నిబంధనల ప్రకారం తెలంగాణలో స్థానికత ఉంటుందని కర్నూలు జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగి చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది. 5వ తరగతి నుంచి టెన్త్ వరకూ మహబూబ్‌నగర్ జిల్లాలో చదివానని, అయితే తాను కర్నూలు జిల్లా వాసినని చెప్పి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) కోసం చేసుకున్న దరఖాస్తును ఆమోదించలేదంటూ కర్నూలు మండలం రెమట గ్రామస్తుడు ఎం.రంగస్వామి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యాన్ని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఉద్యోగ ప్రకటన ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతిలోపు నాలుగేళ్లు వరుసగా ఒకే జిల్లాలో చదివి ఉంటే స్థానికత వర్తింపజేస్తామన్న నిబంధన మేరకు పిటిషనర్ దరఖాస్తును స్వీకరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దరఖాస్తుల ఆన్‌లైన్ స్వీకరణ గడువు ముగిసినప్పటికీ లిఖితపూర్వక హామీతో దరఖాస్తు తీసుకుని ఆమోదించాలని, అభ్యర్థికి హాల్‌టికెట్ కూడా జారీ చేసి పరీక్షకు అనుమతించాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు.