TSPSP
-
ఆ దరఖాస్తును స్వీకరించండి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో చదివినందున తనకు టీఆర్టీ నిబంధనల ప్రకారం తెలంగాణలో స్థానికత ఉంటుందని కర్నూలు జిల్లాకు చెందిన ఒక నిరుద్యోగి చేసిన వాదనను హైకోర్టు ఆమోదించింది. 5వ తరగతి నుంచి టెన్త్ వరకూ మహబూబ్‌నగర్ జిల్లాలో చదివానని, అయితే తాను కర్నూలు జిల్లా వాసినని చెప్పి ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం చేసుకున్న దరఖాస్తును ఆమోదించలేదంటూ కర్నూలు మండలం రెమట గ్రామస్తుడు ఎం.రంగస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారించారు. ఉద్యోగ ప్రకటన ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతిలోపు నాలుగేళ్లు వరుసగా ఒకే జిల్లాలో చదివి ఉంటే స్థానికత వర్తింపజేస్తామన్న నిబంధన మేరకు పిటిషనర్ దరఖాస్తును స్వీకరించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. దరఖాస్తుల ఆన్లైన్ స్వీకరణ గడువు ముగిసినప్పటికీ లిఖితపూర్వక హామీతో దరఖాస్తు తీసుకుని ఆమోదించాలని, అభ్యర్థికి హాల్‌టికెట్ కూడా జారీ చేసి పరీక్షకు అనుమతించాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించారు. -
గురుకుల పోస్టుల స్క్రీనింగ్ టెస్టు వాయిదా
బోనాల నేపథ్యంలో ఈ నెల 30కి వాయిదా పడిన పరీక్ష సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లోని వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 16న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ పరీక్షను (స్క్రీనింగ్ టెస్టు) టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. బోనాల పండుగ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్లు, జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు జూలై 16న జరగాల్సిన పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు గురుకులాల్లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీఈటీ), ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. ఆ పరీక్షలు ఈనెల 31 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
2,118 పోస్టుల భర్తీకి గ్రహణం!
వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంపై ఆరోపణలు - గత ఏడాది జూలైలో పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి - ఇప్పటికీ పూర్తి ఇండెంట్లు ఇవ్వని వైద్య ఆరోగ్య శాఖ - టీఎస్పీఎస్సీ ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోని అధికారులు - వైద్య ఆరోగ్యశాఖ తీరుపై చీఫ్ సెక్రటరీకి టీఎస్పీఎస్సీ నివేదిక! సాక్షి, హైదరాబాద్: అధికారుల అలసత్వం నిరుద్యోగులపాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసి ఏడాది కావ స్తోంది. అయితే ఇంతవరకు పోస్టుల వారీగా సమ గ్రంగా ఇండెంట్లు, రోస్టర్ పాయింట్లు ఇవ్వడంలో వైద్య ఆరోగ్య శాఖ అలసత్వం కారణంగా అవి భర్తీకాకుండా ఉండిపోయాయి. రూల్ ఆఫ్ రిజ ర్వేషన్, రోస్టర్ పాయింట్లు ఇస్తే తప్ప నోటిఫికే షన్లను జారీ చేసే అవకాశం లేదు. టీఎస్పీఎస్సీ ఎన్ని సార్లు వైద్య ఆరోగ్య శాఖను అడిగినా ఇండెంట్లు ఇవ్వక పోవడంతో వాటి భర్తీ ముం దుకు సాగడం లేదు. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ జాప్యం చేస్తోందంటూ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రచారంపై టీఎస్పీఎస్సీ స్పందించింది. పోస్టుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతోందన్న అంశంపై జూన్ 29న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ సమగ్ర నివేదికను అందజేసినట్లు తెలిసింది. గత ఏడాది ఉత్తర్వులు జారీ అయినా.. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 2,118 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గతేడాది జూలై 13న ఉత్తర్వులు (జీవో 89) జారీ చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేయాలని అందులో స్పష్టం చేశారు. ఆయా పోస్టులకు సంబంధిం చిన లోకల్ కేడర్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలు, అర్హతలతో కూడిన ఇండెంట్లు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. అయితే వాటిని ఇంతవరకు వైద్య ఆరోగ్యశాఖ సమగ్రంగా ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న 2,118 పోస్టుల్లో నుంచి 228 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 7 డెంటల్ సర్జన్ పోస్టు లను తొలగిస్తున్నట్లు పేర్కొం ది. కానీ ఈ విషయాన్ని అధికా రికంగా చెప్పడం లేదు. ఆ పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివరాలను ఇవ్వకుండా, కావాలనే వాటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేకుండా చేస్తోందనే ఆరోపణలు ఉన్నా యి. ఇదిలా ఉండగా ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారి కోసమే నోటిఫికేషన్‌ను ఆపు తోందన్న వాదనలూ ఉన్నా యి. అయితే వారికి 30 శాతం వెయిటేజీ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ సిద్ధమైనా, అసలు రాత పరీక్ష లేకుండా వారికి ఆ పోస్టులను ఇవ్వాలన్న తలంపుతో జాప్యం చేస్తోందన్న ఆరోప ణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 1,844కు పైగా పారామెడికల్ పోస్టులు ఖాళీ... రాష్ట్ర వ్యాప్తంగా 1,844 పైగా పారా మెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఆప్తాల్మిక్ ఆఫీసర్ పోస్టులు 2, రేడియోగ్రాఫర్స్ 35, స్టాఫ్ నర్సు పోస్టులు 1,200, ల్యాబ్æ టెక్నీషియన్ పోస్టులు 200, ఫార్మసిస్టు పోస్టులు 238, ఏఎన్ఎంలు 150, ఫిజియోథెరపిస్టు 6, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. పోస్టుల భర్తీలో ఆలస్యంపై సీఎం ఆగ్రహం.. వైద్య పోస్టుల భర్తీ వ్యవహారంలో జరుగుతున్న జాప్యం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాదాపు ఏడాది కిందట భర్తీకి ఉత్తర్వులు ఇస్తే ఇంతవరకు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. నోటిఫికేషన్ల జారీలో ఆలస్యానికి గల కారణాలను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని సీఎం అడిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ గత నెల 29వ తేదీన ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు అందజేసినట్లు తెలిసింది. వివాదం లేని పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు! ఎలాంటి వివాదంలేని 274 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు ఇటీవల అందాయని సీఎస్‌కు అందజేసిన నివేదికలో వాణిప్రసాద్ పేర్కొన్నట్లు తెలిసింది. వాటితోపాటు మరో 215 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు, వివరణలు వచ్చాయని, వాటికి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. -
నెలాఖర్లో గ్రూప్–2 ఫలితాలు!
- జూన్ తొలి, రెండో వారంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - జూలైలో ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం - వచ్చే నెలలోనే గ్రూప్–1 ఇంటర్వ్యూలు - ఆ తర్వాత గురుకుల టీచర్ల పరీక్షలు సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్–2 ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీ కసరత్తు వేగవంతం చేసింది. పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్ వారీగా, అర్హతల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అర్హుల జాబితాలను సిద్ధం చేస్తోంది. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ నెలాఖరులోగానే ఫలితాలు విడుదల చేసి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రకటించాలని శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయానికి వచ్చింది. లేదంటే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఫలితాలు ప్రకటించాలని భావిస్తోంది. మొత్తంగా జూన్ మొదటి లేదా రెండో వారంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేలా టీఎస్పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వచ్చే నెలంతా బిజీ బిజీ.. గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌తోపాటు 2011 గ్రూప్–1 ఇంటర్వ్యూలను కూడా జూన్‌లోనే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ ఇటీవలే సంతకం చేశారు. దీంతో పంచాయతీరాజ్ విభాగంలో సృష్టించే సూపర్ న్యూమరరీ పోస్టులపై ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ఉత్తర్వులు రాగానే రోస్టర్ పాయింట్ల ఆధారంగా మెరిట్ జాబితాలను ప్రకటించి... జూన్‌లోనే ఇంటర్వూ్యలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు జూన్‌లోనే గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులకు జూలైలో ఇంటర్వ్యూను నిర్వహించనుంది. ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన ప్రక్రియ రెండు నోటిఫికేషన్ల ద్వారా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నోటిఫికేషన్లో 439 పోస్టు లను ఇవ్వగా.. మరిన్ని పోస్టులు ఇవ్వాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మరో 593 పోస్టులతో 2016 సెప్టెంబర్ 1న మరో నోటిఫికేషన్ ఇచ్చారు. వాటికి గతేడాది నవంబర్లోనే రాత పరీక్షలు నిర్వహించినా.. పలువురు అభ్యర్థులు కొన్ని అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించడంతో ఫలితాల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే కోర్టు గత నెల 24న టీఎస్పీఎస్సీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ ఫలితాల ప్రక్రియను చేపట్టింది. -
గ్రూప్–2లో 17 ప్రశ్నలు తొలగింపు
- మరో 14 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు - వెబ్సైట్లో రివైజ్డ్ ‘కీ’లు.. ఆందోళనలో అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. పరీక్ష ‘కీ’లలో పలు ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆప్షన్లు సరైనవి కావంటూ కొందరు అభ్యర్థులు చాలెంజ్ చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్పీఎస్సీ 4 పేపర్లలో తప్పుడు ఆప్షన్లు ఉన్న, సరైన సమాధానాలు లేని 17 ప్రశ్నలను తొలగించింది. మరో 14 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా జవాబుల ఆప్షన్లలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్డ్ ‘కీ’లను వెబ్సైట్లో పెట్టింది.గ్రూప్–2 పరీక్షల్లో ఇంత భారీ సంఖ్యలో తప్పులు దొర్లడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల కమిటీ పరిశీలనలో.. గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్–2 రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిం దే. టీఎస్పీఎస్సీ వాటి ప్రాథమిక ‘కీ’లను డిసెంబర్ 2న వెబ్సైట్లో పెట్టింది. వాటిపై అదేనెల 5 నుంచి 14 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిశీలించిన అనంతరం జనవరి 11న తుది ‘కీ’ని వెబ్సైట్లో పెట్టింది. కానీ ఇందులోనూ భారీగా తప్పులున్నట్లు గుర్తించిన కొందరు అభ్యర్థులు.. తుది ‘కీ’లను చాలెంజ్ చేశారు. వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ... 17 ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొర్లాయని, మరో 14 ప్రశ్నలకు సంబంధించి 2, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సరైన సమాధానాలు ఉన్నాయని తేల్చింది. దీంతో తప్పులు దొర్లిన 17 ప్రశ్నలను తొలగించింది. రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలున్న 14 ప్రశ్నల్లో సరైన సమాధానాల్లో దేనిని గుర్తించినా మార్కులు ఇస్తామని ప్రకటించింది. ఈ మార్పులతో కూడిన రివైజ్డ్ ఫైనల్ ‘కీ’లను వెబ్సైట్లో పెట్టింది. ఇక వీటిపై భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొంది.