గ్రూప్–2లో 17 ప్రశ్నలు తొలగింపు
- మరో 14 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు
- వెబ్‌సైట్‌లో రివైజ్డ్ ‘కీ’లు.. ఆందోళనలో అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా 1,032 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. పరీక్ష ‘కీ’లలో పలు ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల ఆప్షన్లు సరైనవి కావంటూ కొందరు అభ్యర్థులు చాలెంజ్ చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ 4 పేపర్లలో తప్పుడు ఆప్షన్లు ఉన్న, సరైన సమాధానాలు లేని 17 ప్రశ్నలను తొలగించింది. మరో 14 ప్రశ్నలకు రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలు సరైనవిగా జవాబుల ఆప్షన్లలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్డ్ ‘కీ’లను వెబ్‌సైట్లో పెట్టింది.గ్రూప్–2 పరీక్షల్లో ఇంత భారీ సంఖ్యలో తప్పులు దొర్లడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిపుణుల కమిటీ పరిశీలనలో..
గతేడాది నవంబర్ 11, 13 తేదీల్లో గ్రూప్–2 రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిం దే. టీఎస్‌పీఎస్సీ వాటి ప్రాథమిక ‘కీ’లను డిసెంబర్ 2న వెబ్‌సైట్‌లో పెట్టింది. వాటిపై అదేనెల 5 నుంచి 14 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిశీలించిన అనంతరం జనవరి 11న తుది ‘కీ’ని వెబ్‌సైట్లో పెట్టింది. కానీ ఇందులోనూ భారీగా తప్పులున్నట్లు గుర్తించిన కొందరు అభ్యర్థులు.. తుది ‘కీ’లను చాలెంజ్ చేశారు.
వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ... 17 ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొర్లాయని, మరో 14 ప్రశ్నలకు సంబంధించి 2, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సరైన సమాధానాలు ఉన్నాయని తేల్చింది. దీంతో తప్పులు దొర్లిన 17 ప్రశ్నలను తొలగించింది. రెండు, అంతకంటే ఎక్కువ సమాధానాలున్న 14 ప్రశ్నల్లో సరైన సమాధానాల్లో దేనిని గుర్తించినా మార్కులు ఇస్తామని ప్రకటించింది. ఈ మార్పులతో కూడిన రివైజ్డ్ ఫైనల్ ‘కీ’లను వెబ్‌సైట్లో పెట్టింది. ఇక వీటిపై భవిష్యత్తులో ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని పేర్కొంది.