ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తాజా పీఆర్సీలో రాష్ట్రంలో 2017 టీఆర్‌టీ ద్వారా కొత్తగా నియమితులైన టీచర్లకు భారీ నష్టం వాటిల్లనుంది. కిందిస్థాయి పోస్టు లో ఉండి, ఎస్‌ఏ పోస్టులకు ఎంపికైన టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లనుండగా, నియామకాల్లో జాప్యం కారణంగా కొత్త పీఆర్‌సీ ద్వారా లభించాల్సిన ప్రయోజనాలు ఎక్కు వ మందికి దక్కకుండాపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా 8,792 మంది టీచర్లకు నష్టం వాటిల్లనుండటంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొందరికి పే ప్రొటెక్షన్ లేక నష్టం
రాష్ట్రంలో 2017 టీఆర్‌టీ ద్వారా ప్రభుత్వం 1,941 ఎస్‌ఏ పోస్టులను భర్తీ చేసింది. అందులో దాదాపు వెయ్యి పోస్టులకు ప్రస్తుతం స్కూళ్లలో ఎస్‌జీటీలుగా, భాషా పండితులుగా (ఎల్‌పీ) పని చేస్తున్నవారే ఎంపికయ్యారు. మిగతా పోస్టుల్లో కొత్తవారు ఎంపికయ్యారు. ఇలా ఎస్‌ఏ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరికి పలు కారణాలతో 2019లో నియామక పత్రాలు అందజేయగా, మరికొందరికి 2020లో నియామక పత్రాలు అందజేశారు. ఇంకొందరికైతే 15 రోజుల కిందటే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. వారిలో 95 శాతం మంది పంచాయతీరాజ్ టీచర్లే ఉన్నారు.
అయితే వారికి ఇప్పుడు కొత్త పీఆర్‌సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలోని కనీస మూల వేతనంతోనే వేతనాలను చెల్లించనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఏదేని ఉన్నత స్థాయి పోస్టుకు ఎంపికైనప్పుడు వారికి అంతకుముందు ఉద్యోగంలో వచ్చిన వేతనాన్ని కాపాడుతూ (పే ప్రొటెక్షన్ ఇస్తూ) ఉత్తర్వులిచ్చి కొత్త వేతనం ఖరారు చేస్తారు. అంతకుముందు వచ్చిన కనీస మూల వేతనానికి పీఆర్‌సీ అమలుతేదీ నాటికి ఉన్న డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త పోస్టులో కనీస మూల వేతనాన్ని ఖరారు చేస్తారు.
కానీ ఇప్పుడు నియమితులైన పంచాయతీరాజ్ టీచర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. వాస్తవానికి 2013 డిసెంబర్ తరువాత ప్రభుత్వం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, సర్వీస్ మొత్తం లెక్కిస్తే నష్టం లక్షల్లో ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
నియామకాల్లో ఆలస్యంతో ఎక్కువ మందికి...
2017 టీఆర్‌టీ ద్వారా ఎస్జీటీ, ఎల్‌పీ, ఎస్‌ఏ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ), ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ)గా నియమితులైన 7,792 మంది టీచర్లకు తాజా పీఆర్సీలో ప్రకటించిన వేతన స్థిరీకరణలో కీలకమైన 30 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ అందని దుస్థితి ఏర్పడింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన 2017 టీఆర్‌టీ నియామకాలను 2019 నుంచి 2021 వరకు సాగదీయడమే ఇందుకు కారణం. తాజా పీఆర్సీ ఇప్పుడు ప్రకటించినా 2018 జూలై 1 నుంచే అమల్లోకి రానుంది. కాబట్టి అప్పటివరకు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రమే 30 శాతం ఫిట్‌మెంట్ ప్రయోజనం కలుగుతుంది. ఆ తర్వాత నియామకమైన వారికి నియమితులైన రోజు నుంచి లెక్కించి తాజా పీఆర్సీలో మినిమమ్ బేసిక్‌తో వేతనం ఖరారు చేసి, కరెస్పాండింగ్ పేస్కేల్ ఇస్తారు.
ఒకవేళ వారు అంతకుముందే నియమితులై ఉంటే వారికి అప్పుడు ఉన్న ఇంక్రిమెంట్‌తో కూడిన మూల వేతనంపై 30.392 శాతం డీఏ, 30 శాతం ఫిట్‌మెంట్ వచ్చేది. కానీ వారు 2018 జూలై 1 నాటికి నియమితులు కాలేదు కాబట్టి ఇప్పుడు వారికి 30 శాతం ఫిట్‌మెంట్ వర్తించదు. పైగా ఇప్పుడు రూపొందించిన మాస్టర్ స్కేల్ ప్రస్తుతం ఉన్న 30 శాతం ఫిట్‌మెంట్‌తో కాకుండా 15 శాతం ఫిట్‌మెంట్‌తోనే రూపొందించినందున వారికి రెండు రకాలుగా కలిపి నెలకు ఐదారు వేల రూపాయల నష్టం వాటిల్లుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ–2017) ద్వారా నియమితులైన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ)కు తాజా పీఆర్సీతో ఇప్పుడు రూ.31,040 కనీస మూల వేతనం రానుంది. అదే టీచర్ 2018 జూలై 1కి ముందు నియమితులై ఉంటే పాత స్కేల్‌పై 30 శాతం ఫిట్‌మెంట్ కలసి రూ.34,690 కనీస మూల వేతనం వచ్చేది. అలాగే అదే టీఆర్‌టీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా (ఎస్‌ఏ) నియమితులైన వారికి ఇప్పుడు రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. ఈ టీచర్ కూడా ముందే నియమితులై ఉంటే 30 శాతం ఫిట్‌మెంట్ కలసి రూ.47,240 వచ్చేది. 2017 టీఆర్‌టీ అయినప్పటికీ నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల ఫిట్‌మెంట్ వర్తించకపోవడంతో ఒక్కో టీచర్ నెలకు నాలుగైదు వేలు నష్టపోనున్నారు.
ఒక అభ్యర్థి 2008లో ఎస్‌జీటీగా ఎంపికయ్యారు. 2018 జూలై 1నాటికి ఆయన కనీస మూల వేతనం రూ. 31,460. ఆయన 2017 టీఆర్‌టీ ద్వారా ఎస్‌ఏగా ఎంపికయ్యారు. ఆయనకు ఇప్పుడు ఎస్‌ఏ పోస్టులో రూ.42,300 కనీస మూల వేతనం రానుంది. అయితే పే ప్రొటెక్షన్ ఉంటే 2018 జూలై 1 నాటికి ఉన్న కనీస మూల వేతనంపై 30.392 కరువు భత్యం (డీఏ), 30 శాతం ఫిట్‌మెంట్ కలిపి రూ.51,320 కనీస మూల వేతనంగా వచ్చేది. అది లేకపోవడం వల్ల ఇంక్రిమెంటు కలుపుకొని నెలకు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లనుంది.
న్యాయం చేయాల్సిందే
టీఆర్‌టీ–2017లో భాగంగా రాత పరీక్ష, ఇతరత్రా నియామకాల ప్రక్రియ 2018 జూలై 1 నాటికి పూర్తయ్యింది. అయితే పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఆలస్యం అయ్యింది. అందువల్ల వారికి 30 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేసి న్యాయం చేయాలి. అలాగే పైస్థాయి పోస్టులకు ఎంపికైన టీచర్ల కోసం పే ప్రొటెక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలి. లేకపోతే వారు తీవ్రంగా నష్టపోతారు.
– మానేటి ప్రతాప్‌రెడ్డి,టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు
చదవండి: ఉచిత నీటి పథకానికి తిప్పలెన్నో..
Comments
Please login to add a commentAdd a comment