సాక్షి, ఆదిలాబాద్ : ఎట్టకేలకు టీఆర్‌టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీఆర్‌టీ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ప్రభుత్వం ఇది వరకే ఫలితాలు విడుదల చేసినా నియామకాలు చేపట్టకపోవడంతో గత కొన్ని రోజులుగా ఎంపికైన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకాలు చేపట్టినా టీఆర్‌టీ నియామకాలు చేపట్టకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
తాజా నిర్ణయం వారికి తీపి కబురును అందించినట్టయింది. అయితే ఇప్పటికే అభ్యర్థుల ఫలితాలను ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది. అయితే కేవలం విద్యాశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆయా ప్రాంతాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వడమే మిగిలి ఉంది. త్వరలోనే పాఠశాలలకు కొత్త పంతుళ్లు రానున్నారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1,582 పోస్టులు
ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ 2017 అక్టోబర్ 21న విడుదల చేశారు. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఫలితాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. గతేడాది చివరి మాసంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే నియామకాలు మాత్రం జరపలేదు. కొంతమంది కోర్టుకు వెళ్లడంతో నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.10 విడుదల చేసింది. కాగా ఈ నియామకాలు ఉమ్మడి జిల్లా పరిధిలో చేపట్టనున్నారు. మొత్తం 1,582 పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో లాంగ్వేజ్ పండితులు 122, ఎస్‌జీటీ పోస్టులు 1314, పీఈటీ పోస్టులు 25, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 118, మూడు ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
తీరనున్న ఇబ్బందులు..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2012లో డీఎస్సీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నియామకాలు చేపట్టడంలో జాప్యం జరిగిన విషయం తెలిసిందే. పరీక్షలు రాసి ఎంపికైన అభ్యర్థులు నియామకాల కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతున్నారు. టీఆర్‌టీ నిర్వహించిన తర్వాత గతేడాది, ఈ ఏడాది కూడా విద్యావలంటీర్లతోనే చదువులను కొనసాగిస్తోంది. అయితే ఎంపికైన అభ్యర్థులు నియామకాలు చేపట్టకపోవడంతో ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
ఎట్టకేలకు శనివారం ప్రభుత్వం నియామకాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామకాలు జరగనున్నాయి. ఇదివరకు జరిగిన డీఎస్సీల్లో విద్యా శాఖాధికారులే సర్టిఫికెట్ల పరిశీలన, రోస్టర్, మెరిట్ జాబితాను ప్రకటించేది. కాని ఈసారి ప్రభుత్వమే ప్రక్రియను పూర్తి చేసింది. కేవలం విద్యాశాఖాధికారులు ఆయా ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యదర్శిగా, సభ్యులుగా జెడ్పీ సీఈఓ, ఉమ్మడి జిల్లా పరిధిలోని డీఈఓలు ఉంటారు.
నియామకాలు పారదర్శకంగా చేపడతాం
టీఆర్‌టీ నియామకాలను పారదర్శకంగా చేపడతాం. దీనికి సంబంధించిన షెడ్యూల్ రాగానే మొదట కేటగిరి–4, తర్వాత 3,2,1 వారీగా పోస్టులు భర్తీ చేస్తాం. బాలికల పాఠశాలలకు మహిళా ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇస్తాం. మొదట ఒక్కరుకూడా ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేస్తాం. ఆ తర్వాత ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతాం. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
– ఎ.రవీందర్‌రెడ్డి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment