టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లు యథావిధిగా జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మొద్దని చెప్పారు. ఈ నెల 24 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డేటా ప్రాసెస్‌లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిబ్బంది(సీజీజీ) చేసిన పొరపాట్ల వల్ల పరీక్ష కేంద్రాల కేటాయింపులో తప్పులు దొర్లాయని, వాటిని మార్చామని చెప్పారు.
రాత పరీక్షలకు (ఆఫ్‌లైన్) సంబంధించి పరీక్ష కేంద్రాల ను ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలోనే కేటాయించామని, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్) పోస్టులకు ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాలను ఎక్కడైనా కేటాయించే అధికారం టీఎస్‌పీఎస్సీకి ఉంటుందని నోటిఫికేషన్‌లో స్పష్టం గా పేర్కొన్నా.. అభ్యర్థులకు అసౌకర్యం కలగకూడదని మార్పులు చేసినట్లు చెప్పారు.
25 నాటి పరీక్షల హాల్‌టికెట్లు నేడు..
కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షలకు హెచ్‌ఎండీఏ సహా కరీంనగర్, వరంగల్, నల్ల గొండ, ఖమ్మం జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని చక్రపాణి తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ అభ్యర్థులకు హైదరాబాద్ తదితర జిల్లాల్లో కేటాయించామని చెప్పారు. కరీంనగర్‌లో ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో కొందరికి ఇతర జిల్లాల్లో కేంద్రాలు కేటాయించామన్నారు. 48 రకాల సబ్జెక్టులు, మీడియం పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని వివరించారు. 24న జరిగే పరీక్షల హాల్‌టికెట్ల జారీని బుధవారం ప్రారంభించామని, 25 నాటి పరీక్షలకు హాల్‌టికెట్లు గురువారం అందుబాటులో ఉంచుతామని, ఇలా మార్చి 4వ తేదీ వరకు జరిగే పరీక్షల హాల్‌టికెట్లను వరుసగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
టీఆర్‌టీ తర్వాత ‘గురుకుల లెక్చరర్’
గురుకుల టీజీటీ పోస్టుల పరీక్ష ఫలితాలు త్వరలోనే ప్రకటిస్తామని చక్రపాణి వెల్లడించారు. పీజీటీ పోస్టులు పొందిన వారు కొందరు టీజీటీ పోస్టుల ఎంపిక జాబితాలోనూ ఉన్నారని, అందులో టీజీటీ పోస్టు వద్దనుకునే వారి అభిప్రాయాలు తీసుకొని తరువాతి మెరిట్ అభ్యర్థుల ఎంపిక చేపట్టామన్నారు. నెల రోజుల్లో పోస్టింగులు ఇస్తామని చెప్పారు. గురుకుల లెక్చరర్ పోస్టుల మెయిన్ పరీక్షలకు 1:15 రేషియోలో సీజీజీ ఎంపిక చేసిన జాబితాలో పొరపాట్లు దొర్లినందున ఈ నెల 19 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశామన్నారు. టీఆర్‌టీ పరీక్షలు పూర్తయ్యాక వాటికి మెయిన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు
టీఎస్‌పీఎస్సీ, పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ హెచ్చరించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న వారిని ఇప్పటికే గుర్తించామని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు. గతంలో నిజామాబాద్‌లోని ఓ కాలేజీలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయకపోయినా అక్కడ పరీక్ష కేంద్రం ఉందని, అక్కడ పరీక్ష రాసిన 150 మందిని ఎంపిక చేశారని తప్పుడు ప్రచారం చేశారని, అలా ప్రచారం చేసిందెవరో గుర్తించామని వివరించారు. టీఎస్‌పీఎస్సీని అభాసుపాలు చేసేలా తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించండి
హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే స్వయంగా లేదా ఫోన్ ద్వారా టీఆర్‌టీ హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు హెల్ప్‌డెస్క్ పని చేస్తుందని చెప్పారు. రెండు రకాల సబ్జెక్టులు మినహా మిగతా 46 రకాల సబ్జెక్టులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తున్నందున మాక్ టెస్టు లింకును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ప్రశ్నకు సరైన జవాబు ఎంపిక చేసుకొని టిక్ చేశాక జవాబు పక్కన ఉండే సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని, అప్పుడే జవాబు రాసినట్లు ధ్రువీకరణ అవుతుందని వివరించారు.
టీఆర్‌టీ పీఈటీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లోనూ ఇవ్వండి
టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)ల్లో పీఈటీ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు తెలుగుతో పాటు ఇంగ్లిష్‌లోనూ ప్రశ్నపత్రం ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. పీఈటీ కోర్సు ఇంగ్లిష్‌లోనే ఉంటుందని, తెలుగులోనే ప్రశ్నపత్రం ఇస్తే అభ్యర్థులు నష్టపోతారంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కె.వెంకటరమణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గతంలో రెండు భాషల్లోనూ పరీక్షను నిర్వహించారని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రమేశ్ హైకోర్టుకు తెలపటంతో న్యాయమూర్తి పైవిధంగా ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment