sgt job
-
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
విధుల్లోకి 2,788 మంది టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో (టీఆర్టీ–2017) భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) నియామక ప్రక్రియ మంగళవారం రాత్రి వరకు పూర్తయింది. ఏజెన్సీ మినహా మైదాన ప్రాంతాల్లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ నియామకపత్రాలు అందజేసింది. మొత్తంగా మైదాన ప్రాంతంలో 3,127 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 2,822 పోస్టులకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇటీవల ఎంపికైన అభ్యర్థుల జాబితాలను జిల్లాల వారీగా విద్యా శాఖకు టీఎస్పీఎస్సీ అందజేసింది. దీంతో విద్యాశాఖ నియామకాల కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ కౌన్సెలింగ్‌కు 2,788 అభ్యర్థులు హాజరుకాగా, వారందరికీ మంగళవారం పోస్టింగ్ ఆర్డర్లను జిల్లా అధికారులు అందజేశారు. పోస్టింగ్ ఆర్డర్లను పొందినవారు బుధవారం సంబంధిత పాఠశాలల్లో హెడ్మాస్టర్లకు రిపోర్ట్ చేసి విధుల్లో చేరనున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకాని 34 మందికి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్టర్‌పోస్ట్ ద్వారా డీఈవోలు పంపించనున్నారు. -
ఒక పోస్టుకు 62 మంది పోటీ
ఆరిలోవ(విశాఖ తూర్పు): జిల్లాలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో విశాఖ జిల్లాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల అభ్యర్థులు కూడా ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. విశాఖ జిల్లాలో సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్లు, ల్యాంగ్వేజి పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్ విభాగాలలో మొత్తం 764 ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు గడువు ఈ నెల 18 సాయంత్రంతో ముగిసింది. ఆ సమయానికి జిల్లాలో అన్ని ఖాళీలకు 52,933 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల మధ్య పోటీ తీవ్ర నెలకొంది. మొత్తం పోస్టులకు వచ్చిన దరఖాస్తులను బట్టి ఒక ఉద్యోగానికి 69 మంది చొప్పున పోటీ పడుతున్నారు. సెకండరీ గ్రేడ్‌లో ఒక ఉద్యోగానికి 62 మంది, స్కూల్ అసిస్టెంట్‌లో ఒక ఉద్యోగానికి 133 మంది, భాషా పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్‌లలో ఒక ఉద్యోగానికి 149 మంది చొప్పున పోటీ నెలకొంది. ప్రభుత్వం 2014 తర్వాత నాలుగేళ్ల పాటు డీఎస్సీ నియామకాలు జరపకపోవడంతో ఇంత తీవ్రమైన పోటీ ఏర్పడిందని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రతి ఏడాది ఉపాధ్యాయ నియామకాలు జరిపి ఉంటే ఇంత తీవ్రమైన పోటీ ఉండేది కాదని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఖాళీలు.. దరఖాస్తులు ♦ జిల్లాలో ఎస్జీటీ 639 ఖాళీలుండగా వాటి కోసం 39,631 మంది దరఖాస్తులు చేశారు. ♦ ఎస్ఏలు(స్కూల్ అసిస్టెంట్లు) 54 ఖాళీలుండగా వాటి కోసం 6,122 మంది దరఖాస్తులు చేశారు. ♦ భాషా పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్, క్రాఫ్ట్ పోస్టులు 48 ఖాళీలుండగా.. వాటి కోసం 7,180 దరఖాస్తులు వచ్చాయి. -
ఉద్యోగమిప్పిస్తే డబ్బులివ్వవా..?
► రూ. 3 లక్షలు ఇవ్వాల్సిందే ► ఎస్జీటీ అభ్యర్థిని డిమాండ్ చేసిన డీఈఓ కార్యాలయ ఉద్యోగి ► సంభాషణను రికార్డు చేసిన అభ్యర్థి ► విచారణకు ఆదేశించిన డెరైక్టర్..? అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనుకున్నట్టుగానే నీకు టీచరు ఉద్యోగం వచ్చేలా చేశా. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయంలోని పని చేస్తున్న సూపరింటెండెంట్ సహకారంతోనే నీకు ఉద్యోగం వచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా రూ. 3 లక్షలు ఇవ్వాలి. ఉద్యోగంలో కూడా చేరేశావు.. ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా? నాకు మర్యాద పోతోంది. వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందేన’ంటూ డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి డీఎస్సీ-14లో ఎస్జీటీగా ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నుంచి డిమాండ్ చేశారు. ఇవీ వివరాలు... కదిరి ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి డీఎస్సీ-14 ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగితో పరిచయమైంది. పోస్టు రావడానికి ఖర్చయినా ఫర్వాలేదు ఏదైనా మార్గం ఉంటే చూడాలంటూ అభ్యర్థి సదరు ఉద్యోగిని కోరాడు. తనకు డెరైక్టరేట్ కార్యాలయంలో డీఎస్సీ విభాగంలో పని చేసే ఓ సూపరింటెండెంట్‌తో బాగా పరిచయాలున్నాయని, ఆయన అనుకుంటే నీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పాడు. దీనికి సదరు అభ్యర్థి కూడా అంగీకరించాడు. అయితే పరీక్ష తర్వాత ఫలితాల్లో సదరు అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తాను కష్టపడి చదవడం వల్లే ఉద్యోగం సంపాదించానని అభ్యర్థి అంటున్నాడు. అన్నీ అనుమానాలే..! డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి నిజంగానే ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు అభ్యర్థిని పాస్ చేయించారా..? లేకపోతే పాస్ అయితే డబ్బులు తీసుకుందాం... లేకపోతే ప్రయత్నించాను కానీ పని కాలేదనీ చెబుతాం అని అనుకున్నాడా అన్న అనుమానాలూ లేకపోలేదు. మరోవైపు అభ్యర్థి కూడా నిజంగా చదివి పాస్ అయ్యాడా..? లేకపోతే సదరు డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగే ఈ పనిని చేయించాడా అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే... ఇది నాకు సంబంధం లేని అంశం. వాళ్లు వాళ్లు చేసుకుంటే నేనేం చేయాలి చెప్పు. కార్యాలయంలో జరిగితే దాని గురించి మాట్లాడతా.. అని వివరణ ఇచ్చారు. డెరైక్టర్ కార్యాలయం నుంచి ఏమైనా అడిగారా అన్న ప్రశ్నిస్తే దాటవేసే సమాధానం చెప్పారు. డబ్బు కోసం ఒత్తిడి ఎస్జీటీ ఉద్యోగం పొందిన అభ్యర్థిని మాత్రం సదరు ఉద్యోగి డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అయితే తాను కష్టపడి చదివినందువల్లే ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నా అభ్యర్థి చెబుతున్నా ఆ ఉద్యోగి మాత్రం ససేమిరా అంటున్నాడు. నేను డెరైక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్‌తో మాట్లాడి నీకు ఉద్యోగం వచ్చేలా చేశాన’ంటూ ఉద్యోగి చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడించాడు. ఈ సంభాషణంతా సదరు అభ్యర్థి ఫోన్లో రికార్డు చేశాడు. చివరకు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ఫోన్ సంభాషణ వినిపించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.