► రూ. 3 లక్షలు ఇవ్వాల్సిందే
► ఎస్జీటీ అభ్యర్థిని డిమాండ్ చేసిన డీఈఓ కార్యాలయ ఉద్యోగి
► సంభాషణను రికార్డు చేసిన అభ్యర్థి
► విచారణకు ఆదేశించిన డెరైక్టర్..?
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనుకున్నట్టుగానే నీకు టీచరు ఉద్యోగం వచ్చేలా చేశా. హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయంలోని పని చేస్తున్న సూపరింటెండెంట్ సహకారంతోనే నీకు ఉద్యోగం వచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా రూ. 3 లక్షలు ఇవ్వాలి. ఉద్యోగంలో కూడా చేరేశావు.. ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోతే ఎలా? నాకు మర్యాద పోతోంది. వెంటనే డబ్బులు ఇవ్వాల్సిందేన’ంటూ డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి డీఎస్సీ-14లో ఎస్జీటీగా ఉద్యోగం పొందిన ఓ అభ్యర్థి నుంచి డిమాండ్ చేశారు.
ఇవీ వివరాలు...
కదిరి ప్రాంతానికి చెందిన ఓ నిరుద్యోగ అభ్యర్థి డీఎస్సీ-14 ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగితో పరిచయమైంది. పోస్టు రావడానికి ఖర్చయినా ఫర్వాలేదు ఏదైనా మార్గం ఉంటే చూడాలంటూ అభ్యర్థి సదరు ఉద్యోగిని కోరాడు. తనకు డెరైక్టరేట్ కార్యాలయంలో డీఎస్సీ విభాగంలో పని చేసే ఓ సూపరింటెండెంట్‌తో బాగా పరిచయాలున్నాయని, ఆయన అనుకుంటే నీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పాడు. దీనికి సదరు అభ్యర్థి కూడా అంగీకరించాడు. అయితే పరీక్ష తర్వాత ఫలితాల్లో సదరు అభ్యర్థికి ఉద్యోగం వచ్చింది. అయితే తాను కష్టపడి చదవడం వల్లే ఉద్యోగం సంపాదించానని అభ్యర్థి అంటున్నాడు.
అన్నీ అనుమానాలే..!
డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి నిజంగానే ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు అభ్యర్థిని పాస్ చేయించారా..? లేకపోతే పాస్ అయితే డబ్బులు తీసుకుందాం... లేకపోతే ప్రయత్నించాను కానీ పని కాలేదనీ చెబుతాం అని అనుకున్నాడా అన్న అనుమానాలూ లేకపోలేదు. మరోవైపు అభ్యర్థి కూడా నిజంగా చదివి పాస్ అయ్యాడా..? లేకపోతే సదరు డీఇఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగే ఈ పనిని చేయించాడా అన్న దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.
డీఈఓ అంజయ్య ఏమంటున్నారంటే...
ఇది నాకు సంబంధం లేని అంశం. వాళ్లు వాళ్లు చేసుకుంటే నేనేం చేయాలి చెప్పు. కార్యాలయంలో జరిగితే దాని గురించి మాట్లాడతా.. అని వివరణ ఇచ్చారు. డెరైక్టర్ కార్యాలయం నుంచి ఏమైనా అడిగారా అన్న ప్రశ్నిస్తే దాటవేసే సమాధానం చెప్పారు.
డబ్బు కోసం ఒత్తిడి
ఎస్జీటీ ఉద్యోగం పొందిన అభ్యర్థిని మాత్రం సదరు ఉద్యోగి డబ్బుల కోసం ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అయితే తాను కష్టపడి చదివినందువల్లే ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నా అభ్యర్థి చెబుతున్నా ఆ ఉద్యోగి మాత్రం ససేమిరా అంటున్నాడు. నేను డెరైక్టర్ కార్యాలయంలోని సూపరింటెండెంట్‌తో మాట్లాడి నీకు ఉద్యోగం వచ్చేలా చేశాన’ంటూ ఉద్యోగి చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. ఈ సంభాషణంతా సదరు అభ్యర్థి ఫోన్‌లో రికార్డు చేశాడు. చివరకు నేరుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు ఫోన్ సంభాషణ వినిపించి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
ఉద్యోగమిప్పిస్తే డబ్బులివ్వవా..?
Published Sat, Jun 25 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement
Advertisement