స్ఫూర్తి
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’
ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.
‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్‌జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...
హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.
తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్‌లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.
‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.
తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.
అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు.
పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.
జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్‌మెట్‌లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్‌జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.
ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.
జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....
సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.
– హుమేరా బేగం
– నాగోజు సత్యనారాయణ,
సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment