Urdu teacher Recruitment
-
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
‘ఉర్దూ’ ఉద్యోగాలు సర్దేశారు!
సాక్షి, హైదరాబాద్ : సర్కారీ కొలువుల భర్తీలో నిబంధనలు మాయమయ్యాయి. మైనారిటీ సంక్షేమ శాఖ లో ఇటీవల భర్తీ చేసిన ఉర్దూ అధికారి (గ్రేడ్–2) పోస్టుల నియామకంలో రిజర్వేషన్లు అటకెక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా అందుకు భిన్నంగా మైనార్టీ సంక్షేమ శాఖ నియామకాలు పూర్తిచేసింది. భర్తీ చేసిన 60 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ కేటగిరీ అభ్యర్థులే లేరు. మొత్తం 60 పోస్టులు జిల్లా కలెక్టరేట్లు, జీఏడీ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ, పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయా ల్లో పని చేసేందుకు ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల ను సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం 50% పోస్టులు రిజర్వేషన్ల పద్ధతిలో, మిగతావి మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి. అందులో 30% దివ్యాంగులకూ అవకాశం ఇవ్వాలి. కానీ ఉర్దూ గ్రేడ్–2 కేటగిరీలో 60 పోస్టులుండగా 80% పోస్టులు ఓపెన్‌లో సర్దుబాటు చేశారు. మిగతా 20% పోస్టుల్లో మెజారిటీ సంఖ్యను బీసీ–ఈ కేటగిరీతో భర్తీ చేశారు. క్యారీ ఫార్వర్డ్ లేకుండానే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు లేకుంటే వాటిని క్యారీఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారు. ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. 60 పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం చొప్పున 9 పోస్టులు, ఎస్టీలకు 6 శాతం చొప్పున 4 పోస్టులు కేటాయించాలి. కానీ అభ్యర్థులు లేరని ఎస్సీ, ఎస్టీల పోస్టులను ఇతర అభ్యర్థులతో మైనార్టీ సంక్షేమ శాఖ భర్తీ చేసింది. ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి! ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకే జాబితాను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ చేపట్టిన ఈ భర్తీకి సంబంధించి ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఉర్దూ అకాడమీ వెబ్సైట్లో మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ప్రదర్శించింది. కేటగిరీ పోస్టులు ఓసీ 9 బీసీ–బీ 7 బీసీ–సీ 1 బీసీ–డీ 1 బీసీ–ఈ 42 కేటగిరీల వారీగా నియమితులైన అభ్యర్థుల వివరాలు ఓపెన్ కేటగిరీ జనరల్ కోటాలో 29 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఏడుగురు ఓసీ అభ్యర్థులు, 22 మంది బీసీ–ఈ అభ్యర్థులు. ఓపెన్ కేటగిరీ వుమెన్ కోటాలో 19 పోస్టులు భర్తీ చేశారు. వీరిలో ఒకరు ఓసీ, 17 మంది బీసీ–ఈ, ఒకరు బీసీ–బీ. బీసీ–బీ జనరల్ కేటగిరీలో ముగ్గురు, వుమెన్ కేటగిరీలో ఇద్దరు చొప్పున నియమితులయ్యారు. బీసీ–సీ జనరల్, బీసీ–డీ జనరల్, బీసీ–ఈ జనరల్, బీసీ–ఈ వుమెన్ కేటగిరీల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఎంపికయ్యారు. దివ్యాంగుల కేటగిరీలో 3 పోస్టులు భర్తీ చేయ గా ఇందులో అంధుల కోటాలో ఒకరు (బీసీ–బీ), బధిరుల కోటాలో ఒకరు(ఓసీ), ఆర్థో కోటాలో ఒకరు (బీసీ–ఈ) చొప్పున నియమితులయ్యారు. -
ఉర్దూ పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి గంటా
విశాఖపట్నం (గోపాలపట్నం): డీఎస్సీలో ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. నరవలోని జామియా ఇస్తామియా అషఫ్రుల్ ఉలూం మదర్సాలో రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ముస్లింల పిల్లలను విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్న మదర్సా ప్రతినిధులను అభినందించారు. విశాఖలో ముస్లిం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ముస్లింల విద్యాలయాలు, మసీదుల సమస్యల పరిష్కారానికి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10312 టీచర్ పోస్టు భర్తీకి నోటి ఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ఎంపీ ముత్తంశెట్టి మాట్లాడుతూ ఇక్కడ సైన్సుల్యాబ్ ఏర్పాటుకు రూ.3 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఇక్కడి ముస్లిం బోధకులకు మదీనాబాగ్‌లో జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో ఇళ్లు కేటాయిస్తామన్నారు.