సాక్షి, హైదరాబాద్ : సర్కారీ కొలువుల భర్తీలో నిబంధనలు మాయమయ్యాయి. మైనారిటీ సంక్షేమ శాఖ లో ఇటీవల భర్తీ చేసిన ఉర్దూ అధికారి (గ్రేడ్–2) పోస్టుల నియామకంలో రిజర్వేషన్లు అటకెక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా అందుకు భిన్నంగా మైనార్టీ సంక్షేమ శాఖ నియామకాలు పూర్తిచేసింది. భర్తీ చేసిన 60 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ కేటగిరీ అభ్యర్థులే లేరు.
మొత్తం 60 పోస్టులు
జిల్లా కలెక్టరేట్‌లు, జీఏడీ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ, పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయా ల్లో పని చేసేందుకు ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల ను సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం 50% పోస్టులు రిజర్వేషన్ల పద్ధతిలో, మిగతావి మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి. అందులో 30% దివ్యాంగులకూ అవకాశం ఇవ్వాలి. కానీ ఉర్దూ గ్రేడ్–2 కేటగిరీలో 60 పోస్టులుండగా 80% పోస్టులు ఓపెన్‌లో సర్దుబాటు చేశారు. మిగతా 20% పోస్టుల్లో మెజారిటీ సంఖ్యను బీసీ–ఈ కేటగిరీతో భర్తీ చేశారు.
క్యారీ ఫార్వర్డ్ లేకుండానే
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు లేకుంటే వాటిని క్యారీఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారు. ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. 60 పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం చొప్పున 9 పోస్టులు, ఎస్టీలకు 6 శాతం చొప్పున 4 పోస్టులు కేటాయించాలి. కానీ అభ్యర్థులు లేరని ఎస్సీ, ఎస్టీల పోస్టులను ఇతర అభ్యర్థులతో మైనార్టీ సంక్షేమ శాఖ భర్తీ చేసింది.
ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి!
ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకే జాబితాను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ చేపట్టిన ఈ భర్తీకి సంబంధించి ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఉర్దూ అకాడమీ వెబ్‌సైట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ప్రదర్శించింది.
కేటగిరీ పోస్టులు
ఓసీ 9
బీసీ–బీ 7
బీసీ–సీ 1
బీసీ–డీ 1
బీసీ–ఈ 42
కేటగిరీల వారీగా నియమితులైన అభ్యర్థుల వివరాలు
ఓపెన్ కేటగిరీ జనరల్ కోటాలో 29 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఏడుగురు ఓసీ అభ్యర్థులు, 22 మంది బీసీ–ఈ అభ్యర్థులు.
ఓపెన్ కేటగిరీ వుమెన్ కోటాలో 19 పోస్టులు భర్తీ చేశారు. వీరిలో ఒకరు ఓసీ, 17 మంది బీసీ–ఈ, ఒకరు బీసీ–బీ.
బీసీ–బీ జనరల్ కేటగిరీలో ముగ్గురు, వుమెన్ కేటగిరీలో ఇద్దరు చొప్పున నియమితులయ్యారు.
బీసీ–సీ జనరల్, బీసీ–డీ జనరల్, బీసీ–ఈ జనరల్, బీసీ–ఈ వుమెన్ కేటగిరీల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఎంపికయ్యారు.
దివ్యాంగుల కేటగిరీలో 3 పోస్టులు భర్తీ చేయ గా ఇందులో అంధుల కోటాలో ఒకరు (బీసీ–బీ), బధిరుల కోటాలో ఒకరు(ఓసీ), ఆర్థో కోటాలో ఒకరు (బీసీ–ఈ) చొప్పున నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment