అజ్మీర్‌ దర్గాపై కొత్త వివాదం | Petition claims Shiva temple under Ajmer Dargah | Sakshi
Sakshi News home page

అజ్మీర్‌ దర్గాపై కొత్త వివాదం

Published Fri, Nov 29 2024 4:57 AM | Last Updated on Fri, Nov 29 2024 4:57 AM

Petition claims Shiva temple under Ajmer Dargah

శివాలయం కూల్చేసి దర్గా నిర్మించారు 

అక్కడ హిందువులు పూజలు చేసుకొనే అవకాశం కల్పించాలి  

స్థానిక సివిల్‌ కోర్టులో పిటిషన్‌

అజ్మీర్‌ దర్గా కమిటీ, మైనార్టీ వ్యవహారాల శాఖ, ఏఎస్‌ఐకి కోర్టు నోటీసులు  

పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశం  

అజ్మీర్‌/న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్‌ దర్గాపై కొత్త వివాదం మొదలైంది. ప్రస్తుతం దర్గా ఉన్న స్థలంలో గతంలో శివాలయం ఉండేదని పేర్కొంటూ కొందరు స్థానిక సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ దాఖలు చేశారు. శివాలయాన్ని కూల్చివేసి, సూఫీ సాధువు ఖ్వాజా మొయినుద్దీన్‌ చిష్తీ పేరిట దర్గా నిర్మించారని వారు పేర్కొన్నారు. దర్గా ప్రాంగణాన్ని దేవాలయంగా గుర్తించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందించింది.

 పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ బుధవారం అజ్మీర్‌ దర్గా కమిటీకి, మైనార్టీ వ్యవహారాల శాఖకు, భారత పురావస్తు సర్వే విభాగానికి(ఏఎస్‌ఐ)కి నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ పట్టణంలో షాహీ జామా మసీదు సర్వే వ్యవహారంలో ఘర్షణ జరిగి నలుగు మృతిచెందిన కొన్ని రోజులకే అజ్మీర్‌ దర్గాపై కోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అజ్మీర్‌ సైతం మత ఘర్షణలకు కేంద్రంగా మారుతుందా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  

సమాజంలో అలజడి సృష్టించడానికే పిటిషన్‌  
ఇదిలా ఉండగా, అజ్మీర్‌ దర్గా వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. మతాల పేరిట చిచ్చురేపి, సమాజంలో అలజడి సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ పిటిషన్‌ దాఖలు చేశారని అజ్మీర్‌ దర్గాను పర్యవేక్షించే అంజుమన్‌ సయీద్‌ జద్గాన్‌ కార్యదర్శి సయీద్‌ సర్వర్‌చిïÙ్త ఆరోపించారు. మతాలవారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మత సామరస్యానికి, లౌకికవాదానికి ప్రతీక అయిన అజ్మీర్‌ దర్గా మైనార్టీ వ్యవహారాల శాఖ పరిధిలోకి వస్తుందని, దీంతో ఏఎస్‌ఐకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.   

ఏమిటీ వివాదం?: అజ్మీర్‌ దర్గాను సంకట్‌ మోచన్‌ మహాదేవ్‌ ఆలయంగా ప్రకటించాలని కోరుతూ సెప్టెంబర్‌ నెలలో అజ్మీర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అక్కడ పూజలు చేసుకొనే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింన తర్వాత తదుపరి విచారణను కోర్టు డిసెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది. అజ్మీర్‌ దర్గాకు ఏదైనా రిజి్రస్టేషన్‌ ఉంటే వెంటనే రద్దు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా డిమాండ్‌ చేశారు. ఏఎస్‌ఐ ద్వారా అక్కడ సర్వే చేపట్టాలని, దర్గా ప్రాంగణంలో పూజలు చేసుకొనే హక్కు హిందువులకు కల్పించాలని పేర్కొన్నారు. దర్గా ఉన్నచోట శివాలయం ఉండేదని, హరవిలాస్‌ సర్దా రాసిన పుస్తకంలో ఈ విషయం ప్రస్తావించారని గుర్తుచేశారు.  

సర్వే చేస్తే నష్టమేంటి? గిరిరాజ్‌ సింగ్‌  
అజ్మీర్‌ దర్గాలో సర్వే చేయాలని కోర్టు ఉత్తర్వు ఇచ్చింందని, సర్వే చేస్తే వచ్చిన సమస్య ఏమిటి? కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రశ్నించారు. మొఘల్‌ రాజులు మన దేశంపైకి దండెత్తి వచ్చారని, ఇక్కడి ఆలయాన్ని కూల్చేశా రని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చే స్తోందని విమర్శించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ 1947లోనే ఈ బుజ్జగింపు రాజకీయాలు ఆపేసి ఉంటే ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు.  

దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు: ఒవైసీ  
అజ్మీర్‌ దర్గా 800 ఏళ్లుగా ఉందని ఐఎంఐ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఉర్స్‌ సందర్భంగా ప్రధానమంత్రి అక్కడ చాదర్‌ సమరి్పంచడం సంప్రదాయంగా వస్తోందని, ఇప్పటిదాకా పనిచేసిన ప్రధానులంతా ఈ సంప్రదాయం పాటించారని వెల్లడించారు. దేశాన్ని అస్థిరపర్చడానికి కుట్రలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారాలతో దేశానికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం–1991 ప్రకారం 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను యథాతథంగా కొనసాగించాలని, వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని ఒవైసీ తేల్చిచెప్పారు.  

దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం: కపిల్‌ సిబల్‌  
అజ్మీర్‌ దర్గా విషయంలో రగడ జరుగుతుండడం బాధాకరమని ఎంపీ కపిల్‌ సిబల్‌ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం? ఇదంతా ఎందుకు? అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అని నిలదీశారు. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాకపోవడంతో కొందరు వ్యక్తులు ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకొని, గొడవలు సృష్టిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మొహిబుల్లా నద్వీ ఆరోపించారు. సివిల్‌ కోర్టు ఉత్తర్వును పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు సజ్జాద్‌గనీ లోన్‌ తప్పుపపట్టారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement