ఎన్నికల నిబంధనలు ఔట్‌.. అవినీతికి భలే సోర్సింగ్‌ | Not Followed Rules Sarva Shiksha Abhiyan Recruitment IN Srikakulam | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు ఔట్‌.. అవినీతికి భలే సోర్సింగ్‌

Published Tue, Aug 13 2019 9:02 AM | Last Updated on Fri, Aug 16 2019 1:27 PM

Not Followed Rules Sarva Shiksha Abhiyan Recruitment IN Srikakulam - Sakshi

ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులు.. ప్రైవేటు ఏజెన్సీల ఇష్టారాజ్యాలు.. ఎన్నికల కోడ్‌ సమయంలోనూ గుడ్లు పెట్టిన అవినీతి బాతులు.. నియామక పత్రాలపై అధికారుల సంతకాలు.. గత ప్రభుత్వ పెద్దలు వెళుతూ వెళుతూ చేపట్టిన అడ్డగోలు బాగోతాలకు సజీవ సాక్ష్యాలు.. ప్రస్తుత కలెక్టర్‌ జె.నివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి సహకరించిన వారి ఆట కట్టింది. 37మందిపై వేటు పడింది. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వంలో ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల దందా అంతా కాదు. టీడీపీ నేతల బినామీలు ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలుగా అవతారమెత్తి, వారికి వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది చేతికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకుని ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. నచ్చి నంత రేటు పెట్టి, పోస్టులు భర్తీ చేశారు. దాదా పు ప్రతి శాఖలో ఇదేరకంగా జరిగింది. కొంతవరకు నిబంధనలు అమలు చేసినా చాలావర కు ముడుపులే కొలమానంగా తీసుకుని నియామకాలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉం డగా సర్వశిక్షా అభియాన్‌లో చేపట్టిన నియామకాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.

సర్వశిక్షా అభియాన్‌లో ఏజెన్సీ అడ్డగోలు దందా..
సర్వశిక్షా అభియాన్‌లో గతేడాది 177 నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చింది. ఆ పోస్టులకు అభ్యర్థులను సరఫరా చేసే బాధ్యతను స్కాట్లాంట్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ అనే ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించింది. ఇంకేముంది అప్పట్లో సదరు ఏజెన్సీ చెలరేగిపోయింది. నియామకాల కోసం బేరసారాలు సాగించింది. కొంతవరకు పద్ధతిగా నియామకాలు చేపట్టగా, మరికొన్ని నియామకాల విషయంలో ముడుపులు ప్రామాణికంగా తీసుకుంది. వాస్తవానికైతే, ఆ నియామకాలు జరిగిన విధానంతో జిల్లా అధికారులకు సంబంధం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు నిబంధనల మేరకు ఉన్నారా లేదా అన్నది చూసుకుని ఉన్నతాధికారుల అనుమతితో సర్వశిక్షా అభియాన్‌ అధికారులు జాయిన్‌ చేసుకుంటారు. ఈ విధంగా తొలి విడతగా 140మందిని జాయిన్‌ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండో విడత నియామకాలకొచ్చేసరికి ఉల్లంఘనకు దిగారు.


ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా నియామకాలు..

దాదాపు 37మందిని ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జాయిన్‌ చేసుకున్నారు. వీరి నియామకాల ఉత్తర్వులపై 2019 ఫిబ్రవరి 18 తేదీ కూడా పేర్కొని ఉంది. వారిని జాయిన్‌ చేసుకున్నట్టుగా 2019 మార్చి 18న నియామక ఉత్వర్వులపై ప్రస్తుత పీఓ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. వాస్తవానికైతే,  ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు. అలాంటిది స్కాట్లాండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఇచ్చిన ఉత్తర్వులపై పీఓ సంతకం చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీనికంతటికీ అప్పుడే బదిలీపై వచ్చిన పీఓపై నాటి పాలకుల ఒత్తిడి, ప్రలోభాలే కారణమని తెలుస్తున్నది. అసలు ఈ అడ్డగోలు దందాకు తెరలేచింది గత పీఓ హయాంలోనని స్పష్టమవుతున్నది. ఆయన కాలంలోనే అన్నీ జరిగిపోగా, నియామకాలకు అనుమతి ఇవ్వాల్సివచ్చేసరికి బదిలీపై వెళ్లడంతో ఆ ప్రభావం తర్వాత వచ్చిన పీఓపై పడింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా స్కాట్లాండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఇచ్చిన నియామక ఉత్తర్వులపై సంతకం చేయడం ప్రస్తుత పీఓను బోనులో నిలబెట్టింది.

37 మందిపై వేటు.. 
వాస్తవానికి రెండో విడతగా ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ చేపట్టిన 37 నియామకాలకు సంబంధించి స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్, కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. కానీ వీరి విషయంలో అదేమీ జరగలేదు. ఏకపక్షంగా నియామకాలు చేపట్టేసి, విధుల్లోకి కూడా తీసుకున్నారు. దీంతో వారంతా అనధికారిక వ్యక్తులుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు విడుదల కాలేదు. అసలు అధికారిక అనుమతితో నియామకాలే జరగనప్పుడు వారికి జీతాలు ఎలా వస్తాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం ప్రస్తుత కలెక్టర్‌ జె.నివాస్‌ దృష్టికి వెళ్లింది. జరిగినదంతా పరిశీలించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టడమేంటని, నిబంధనలకు విరుద్ధమని వారందరీ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఇంకేముంది అనుమతి లేని 37మందిపై వేటు పడింది. వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. నియామక ఉత్తర్వులపై సంతకాలు చేశాక, రెండు మూడు నెలలు పనిచేశాక తొలగించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్తామని గగ్గోలు పెడుతున్నారు. 
సర్వశిక్షా అభియాన్‌ను వెంటాడుతున్న ఆరోపణలు.. 
సర్వశిక్షా అభియాన్‌ను నిత్యం ఆరోపణలు వెంటాడుతున్నాయి. నాటి నాన్‌ టీచింగ్‌ నియామకాలతోపాటు ఇటీవల జరిగిన ఇంటర్‌మీడియట్‌ కళాశాలల పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల నియామకాల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో చేతులు మారాయన్నది సర్వసాధారణమైన ఆరోపణ అయిపోయింది. ఇవి ఒకవైపు ఉండగా, మరోవైపు బదిలీల రగడ కూడా ఇబ్బందికరంగా మారింది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేసేశారని విమర్శలొచ్చాయి. స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై శాఖాపరమైన విచారణకు ఉపక్రమించినట్టు తెలిసింది. 

సర్దుబాటు మాత్రమే చేశాను..
ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చాను. అప్పటికే ఉన్నవారిని ఇతరత్రా అవసరాల కోసం సర్దుబాటు చేశాను. అంతే తప్ప ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఇచ్చిన నియామకాలపై నేనెటువంటి సంతకం చేయలేదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు 37మంది నియామకాలను రద్దు చేశాం. 
– బి.శ్రీనివాసరావు,
 సర్వశిక్షా అభియాన్‌ పీఓ

ఎన్నికల కోడ్‌ విరుద్ధ నియామకాల రద్దు.. 
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టారు. ఆ  37 నియామకాలను రద్దు చేశాను. అనుమతి లేకుండానే వారి నియామకాలు చేపట్టారు. తర్వాత జరిగిన నియామకాలపై పరిశీలిస్తాను. 
–జె.నివాస్, కలెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement