No rules
-
భవితతో చెలగాటం.. ‘డీఈడీ’ బాగోతం
గత ప్రభుత్వం విద్యను అక్రమాల పుట్టగా మార్చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీనే కాదు, ఉపాధ్యాయ విద్య (డీఈడీ)ని సైతం గందరగోళం చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీని వివాదాలమయం చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యను కూడా వ్యాపారమయం చేసింది. జిల్లాలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) కళాశాలలు డీసెట్–2018 మార్గదర్శకాలకు సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పించి ఇప్పుడు ఏకంగా 1800 మంది విద్యార్థుల భవితవ్యాన్ని ఆందోళనలోకి నెట్టారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్ 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షలకు అవకాశం లేకుండా చేశారు. సాక్షి, ఒంగోలు మెట్రో: ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ ద్వారా జరుగుతుండటంతో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ప్రకాశంలో 139 ప్రవేటు డైట్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు లిక్కర్ కాంట్రాక్టర్లు కావటం గమనార్హం. డీఈడీ రెండేళ్ల టీచర్ ట్రెయినింగ్ కోర్సులో చేరాలంటే ముందుగా డీసెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ద్వారా డీఈడీ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. కానీ, గత ప్రభుత్వం డీసెట్ రాయకుండానే ప్రవేశాలు కల్పించుకోవచ్చనే అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు డీసెట్ రాయకుండానే డీఈడీ ప్రవేశాలను వ్యాపారమయం చేసేశాయి. ఒక్కో సీటుకు 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తూ సీట్లను విక్రయించారు. ఇలా డీసెట్ నిబంధనలు తుంగలో తొక్కి ప్రవేశాలు కల్పించిన విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు జిల్లాలోని డైట్ కళాశాలల అక్రమ ప్రవేశాల మీద నివేదిక ఇవ్వాల్సిందిగా డైట్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. డీసెట్‌తో పని లేకుండానే సీట్ల భర్తీ.. జిల్లాలో మొత్తం 140 ప్రవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మైనంపాడు డైట్ కళాశాల ఒక్కటే ప్రభుత్వ కళాశాల. మిగిలిన 139 కళాశాలలు ప్రవేటువే కాగా, ఉపాధ్యాయ విద్య పెద్ద ఎత్తున బిజినెస్‌గా మార్చటంలో జిల్లాలోని పలు యాజమాన్యాలు కాకలు తీరాయి. 2015లో విడుదల చేసిన జీవో నంబర్ 30 ప్రకారం డీసెట్ పరీక్ష ద్వారానే ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. డీసెట్ కన్వీనర్ కోటా ద్వారా 80 శాతం 20 శాతం మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, డీసెట్‌తో సంబంధం లేకుండానే ఏకంగా అన్ని సీట్లూ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకుని సొమ్ము చేసుకోవటం, ఆనక విద్యార్థులతో కేసులు వేయించి అనుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా మారిపోయింది. ఈ విధంగా 2017 విద్యా సంవత్సరంలో జరిగింది కనుక 2018 విద్యా సంవత్సరంలతో కూడా డీసెట్ అర్హత లేకుండానే యాజమాన్యాలు ఇదేవిధంగా ప్రవేశాలు కల్పించారు. ఇలా ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీల్లో 200 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. మిగిలిన కళాశాలల్లో 50 మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని కాలేజీల నుంచి డీసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం 1800 మంది వరకు విద్యార్థులు డీసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించారు. వీరి ద్వారా యాజమాన్యాలు కోర్టులో కేసు వేయించాయి. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. వారంలోపు నివేదిక పంపిస్తాం.. నిబంధనలు పాటించకుండా ప్రవేశాలు కల్పించిన కాలేజీల వివరాలు సేకరిస్తున్నాం. ఏయే కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు భర్తీ చేశారో తెలుసుకుని సంపూర్ణ నివేదికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తాం. – వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మైనంపాడు డైట్ కళాశాల -
కూతురిపై ప్రేమతో... ఆమె పోస్టే విరుద్ధం..
వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూచున్నా... విందు భోజనం అన్నది సామెత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని... అవకాశాన్ని ఆసరాగా మలచుకుని... నిబంధనలు పక్కన పెట్టి... ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ వ్యవహరించిన జిల్లా పూర్వ వైద్యారోగ్యశాఖాధికారి ఇప్పుడు విచారణను ఎదుర్కొనాల్సి వస్తోంది. అర్హతలేకుండా అడ్డగోలుగా డిప్యుటేషన్ వేసి... సొంత కూతురినే స్థాయికి మించి అందలాన్ని ఎక్కించి... ఇప్పుడు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. మొదటినుంచీ విమర్శలకు తావిచ్చిన ఈ వ్యవహారం తాజాగా మళ్లీ చర్చనీయాంశమైంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిగా గతంలో పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి గిరిజన ప్రాంత పీహెచ్సీ అయిన తోణాంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న తన కుమార్తెను తీసుకువచ్చి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించారు. కుమార్తెపై ఉన్న ప్రేమతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా ఆమె తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు అప్పట్లోలోనే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను నివ్వెరపోయేలా చేశాయి. అప్పట్లో ఆమె వ్యవహరించిన విధానంపై తాజాగా విచారణ మొదలైంది. అన్ని డిప్యూటేషన్లూ రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కొనసాగుతున్నాయి. అందులోనూ గిరిజన ప్రాంతం నుంచి విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేసిన డిప్యుటేషన్ కూడ ఇంకా రద్దు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఆమె పోస్టే విరుద్ధం.. పూర్వ డీఎంహెచ్ఓ పోస్టును గత తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టింది. సివిల్ సర్జన్ స్పెషలిస్టును డీఎంహెచ్‌ఓగా నియమించాలి. కాని డిప్యూటీ సివిల్సర్జన్కు డీఎంహెచ్ఓ పోస్టు ను కట్టబెట్టారు. సివిల్ సర్జన్ స్పెషలిస్టులున్నప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం నియామకం చేపట్టింది. ఇటీవల ఆమెను పాత స్థానంలోకి పంపించి, విజయనగరం జిల్లాకు వేరే అధికారిణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. జిల్లా ఇన్చార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పనిచేసిన డాక్టర్ విజయలక్ష్మి ఇష్టానుసారంగా వ్యవహరించి, పలు అవకతవకలకు పాల్పడ్డారని మెడికల్ హెల్త్, ఎంప్లాయిస్ యూనియన్ నేతలు, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు హెల్త్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 29 వ తేదిన విచారణ జరగనుంది. ఉద్యోగ నియామకాలతో పాటు, డిప్యూటేషన్లు, ఫర్నిచర్ కొనుగోలు, కరపత్రాల ముద్రణ వంటి అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఆక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. పీహెచ్సీ నుంచి ఎంహెచ్‌ఓగా... సాలూరు మండలం తోణాం పీహెచ్సీ వైద్యురాలిగా ఉన్న తన కుమార్తె ప్రణీతను డిప్యూటేషన్‌పై విజయనగరం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వేశారు. ఈ వ్యవహారం అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చింది. అయినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి హోదాలో ఉన్న ఆమెను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయలేదు. నిబంధనల ప్రకారం గిరిజన ప్రాంతంలో ఉన్న వైద్యులను మైదాన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయకూడదు. అవసరం అనుకుంటే మైదాన ప్రాంతంలో ఉన్నవారినే గిరిజన ప్రాంతానికి డిప్యూటేషన్ వేయవచ్చు. కాని అవేవీ విజయలక్ష్మి పట్టించుకోలేదు. మరో విషయం ఏంటంటే... నిజానికి ప్రణీత తొలుత తాత్కాలిక ఉద్యోగినిగానే వైద్యారోగ్యశాఖలో ప్రవేశించారు. అనతి కాలంలోనే తల్లి అండతో తన ఉద్యోగాన్ని పదిలం చేసుకున్నారు. తోణాం పీహెచ్‌సీకి ఇన్చార్జ్ వైద్యులే దిక్కు.. 24 గంటలూ పనిచేయాల్సిన తోణాం పీహెచ్‌సీకి ఇప్పుడు ఇన్చార్జ్ వైద్యుడే దిక్కుయ్యారు. ఒక వైద్యురాలు ప్రసూతి సెలవులో వెళ్లారు. అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌గా వచ్చిన ప్రణీత ఇంకా మున్సిపాలిటీలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం మాట పెడచెవిన.. గిరిజన ప్రాంతాల్లో వైద్యులుగా, ఫార్మసిస్టులుగా, ల్యాబ్ టెక్నీషియన్లుగా ఏళ్లతరబడి దాదాపు 50 మంది వరకు పనిచేస్తున్నారు. మైదాన ప్రాంతాలకు రావడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. నిబంధనలు అంగీకరించక అక్కడే పనిచేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారే తలుచుకోవడంతో అసాధ్యం కాస్తా సుసాధ్యం అయ్యింది. కుమార్తె మైదాన ప్రాంతానికి చేరింది. మరోవైపు డిప్యూటేషన్లు అన్నీ రద్దు చేయమని ప్రభుత్వం చెప్పినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన్ పరిషత్తుల్లో ఇంకా డిప్యూటేషన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం కొందరు అధికారులు తమ స్వార్ధం కోసం పెడచెవిన పెడుతున్నారు. విచారణ చేపడతాం.. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న విషయం తెలియదు. నేను వచ్చి కొద్ది రోజులే అయ్యింది. ఫైల్ తెప్పించుకుని విచారణ చేస్తాం. డిప్యూటేషన్ పైనే కొనసాగుతున్నట్లయితే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, విజయనగరం -
ఎన్నికల నిబంధనలు ఔట్.. అవినీతికి భలే సోర్సింగ్
ఔట్ సోర్సింగ్ పోస్టులు.. ప్రైవేటు ఏజెన్సీల ఇష్టారాజ్యాలు.. ఎన్నికల కోడ్ సమయంలోనూ గుడ్లు పెట్టిన అవినీతి బాతులు.. నియామక పత్రాలపై అధికారుల సంతకాలు.. గత ప్రభుత్వ పెద్దలు వెళుతూ వెళుతూ చేపట్టిన అడ్డగోలు బాగోతాలకు సజీవ సాక్ష్యాలు.. ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారికి సహకరించిన వారి ఆట కట్టింది. 37మందిపై వేటు పడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దందా అంతా కాదు. టీడీపీ నేతల బినామీలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలుగా అవతారమెత్తి, వారికి వివిధ శాఖల్లో ఉన్న పోస్టులను తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది చేతికొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులను పట్టుకుని ఇష్టారీతిన నియామకాలు చేపట్టారు. నచ్చి నంత రేటు పెట్టి, పోస్టులు భర్తీ చేశారు. దాదా పు ప్రతి శాఖలో ఇదేరకంగా జరిగింది. కొంతవరకు నిబంధనలు అమలు చేసినా చాలావర కు ముడుపులే కొలమానంగా తీసుకుని నియామకాలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉం డగా సర్వశిక్షా అభియాన్‌లో చేపట్టిన నియామకాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. సర్వశిక్షా అభియాన్‌లో ఏజెన్సీ అడ్డగోలు దందా.. సర్వశిక్షా అభియాన్‌లో గతేడాది 177 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ పోస్టులకు అభ్యర్థులను సరఫరా చేసే బాధ్యతను స్కాట్లాంట్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించింది. ఇంకేముంది అప్పట్లో సదరు ఏజెన్సీ చెలరేగిపోయింది. నియామకాల కోసం బేరసారాలు సాగించింది. కొంతవరకు పద్ధతిగా నియామకాలు చేపట్టగా, మరికొన్ని నియామకాల విషయంలో ముడుపులు ప్రామాణికంగా తీసుకుంది. వాస్తవానికైతే, ఆ నియామకాలు జరిగిన విధానంతో జిల్లా అధికారులకు సంబంధం లేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక చేసిన అభ్యర్థులు నిబంధనల మేరకు ఉన్నారా లేదా అన్నది చూసుకుని ఉన్నతాధికారుల అనుమతితో సర్వశిక్షా అభియాన్ అధికారులు జాయిన్ చేసుకుంటారు. ఈ విధంగా తొలి విడతగా 140మందిని జాయిన్ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెండో విడత నియామకాలకొచ్చేసరికి ఉల్లంఘనకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు.. దాదాపు 37మందిని ఎమ్మెల్సీ, సాధారణ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జాయిన్ చేసుకున్నారు. వీరి నియామకాల ఉత్తర్వులపై 2019 ఫిబ్రవరి 18 తేదీ కూడా పేర్కొని ఉంది. వారిని జాయిన్ చేసుకున్నట్టుగా 2019 మార్చి 18న నియామక ఉత్వర్వులపై ప్రస్తుత పీఓ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. వాస్తవానికైతే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎటువంటి నియామకాలు చేపట్టకూడదు. అలాంటిది స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన ఉత్తర్వులపై పీఓ సంతకం చేయడం అనుమానాలకు తావిచ్చింది. దీనికంతటికీ అప్పుడే బదిలీపై వచ్చిన పీఓపై నాటి పాలకుల ఒత్తిడి, ప్రలోభాలే కారణమని తెలుస్తున్నది. అసలు ఈ అడ్డగోలు దందాకు తెరలేచింది గత పీఓ హయాంలోనని స్పష్టమవుతున్నది. ఆయన కాలంలోనే అన్నీ జరిగిపోగా, నియామకాలకు అనుమతి ఇవ్వాల్సివచ్చేసరికి బదిలీపై వెళ్లడంతో ఆ ప్రభావం తర్వాత వచ్చిన పీఓపై పడింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్కాట్లాండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇచ్చిన నియామక ఉత్తర్వులపై సంతకం చేయడం ప్రస్తుత పీఓను బోనులో నిలబెట్టింది. 37 మందిపై వేటు.. వాస్తవానికి రెండో విడతగా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ చేపట్టిన 37 నియామకాలకు సంబంధించి స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. కానీ వీరి విషయంలో అదేమీ జరగలేదు. ఏకపక్షంగా నియామకాలు చేపట్టేసి, విధుల్లోకి కూడా తీసుకున్నారు. దీంతో వారంతా అనధికారిక వ్యక్తులుగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు విడుదల కాలేదు. అసలు అధికారిక అనుమతితో నియామకాలే జరగనప్పుడు వారికి జీతాలు ఎలా వస్తాయన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం ప్రస్తుత కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వెళ్లింది. జరిగినదంతా పరిశీలించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టడమేంటని, నిబంధనలకు విరుద్ధమని వారందరీ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఇంకేముంది అనుమతి లేని 37మందిపై వేటు పడింది. వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. నియామక ఉత్తర్వులపై సంతకాలు చేశాక, రెండు మూడు నెలలు పనిచేశాక తొలగించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ కోర్టుకెళ్తామని గగ్గోలు పెడుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌ను వెంటాడుతున్న ఆరోపణలు.. సర్వశిక్షా అభియాన్‌ను నిత్యం ఆరోపణలు వెంటాడుతున్నాయి. నాటి నాన్ టీచింగ్ నియామకాలతోపాటు ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ కళాశాలల పార్ట్‌టైమ్ ఉద్యోగాల నియామకాల విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల్లో చేతులు మారాయన్నది సర్వసాధారణమైన ఆరోపణ అయిపోయింది. ఇవి ఒకవైపు ఉండగా, మరోవైపు బదిలీల రగడ కూడా ఇబ్బందికరంగా మారింది. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండానే ఇష్టమొచ్చినట్టు బదిలీలు చేసేశారని విమర్శలొచ్చాయి. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీనిపై శాఖాపరమైన విచారణకు ఉపక్రమించినట్టు తెలిసింది. సర్దుబాటు మాత్రమే చేశాను.. ఎన్నికలకు ముందు జిల్లాకు వచ్చాను. అప్పటికే ఉన్నవారిని ఇతరత్రా అవసరాల కోసం సర్దుబాటు చేశాను. అంతే తప్ప ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ఇచ్చిన నియామకాలపై నేనెటువంటి సంతకం చేయలేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు 37మంది నియామకాలను రద్దు చేశాం. – బి.శ్రీనివాసరావు, సర్వశిక్షా అభియాన్ పీఓ ఎన్నికల కోడ్ విరుద్ధ నియామకాల రద్దు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామకాలు చేపట్టారు. ఆ 37 నియామకాలను రద్దు చేశాను. అనుమతి లేకుండానే వారి నియామకాలు చేపట్టారు. తర్వాత జరిగిన నియామకాలపై పరిశీలిస్తాను. –జె.నివాస్, కలెక్టర్ -
‘ఉర్దూ’ ఉద్యోగాలు సర్దేశారు!
సాక్షి, హైదరాబాద్ : సర్కారీ కొలువుల భర్తీలో నిబంధనలు మాయమయ్యాయి. మైనారిటీ సంక్షేమ శాఖ లో ఇటీవల భర్తీ చేసిన ఉర్దూ అధికారి (గ్రేడ్–2) పోస్టుల నియామకంలో రిజర్వేషన్లు అటకెక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా అందుకు భిన్నంగా మైనార్టీ సంక్షేమ శాఖ నియామకాలు పూర్తిచేసింది. భర్తీ చేసిన 60 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ కేటగిరీ అభ్యర్థులే లేరు. మొత్తం 60 పోస్టులు జిల్లా కలెక్టరేట్లు, జీఏడీ, మైనారిటీ సంక్షేమ శాఖ, ఉర్దూ అకాడమీ, పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయా ల్లో పని చేసేందుకు ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల ను సర్కారు మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టింది. నిబంధనల ప్రకారం 50% పోస్టులు రిజర్వేషన్ల పద్ధతిలో, మిగతావి మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయాలి. అందులో 30% దివ్యాంగులకూ అవకాశం ఇవ్వాలి. కానీ ఉర్దూ గ్రేడ్–2 కేటగిరీలో 60 పోస్టులుండగా 80% పోస్టులు ఓపెన్‌లో సర్దుబాటు చేశారు. మిగతా 20% పోస్టుల్లో మెజారిటీ సంఖ్యను బీసీ–ఈ కేటగిరీతో భర్తీ చేశారు. క్యారీ ఫార్వర్డ్ లేకుండానే ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులు లేకుంటే వాటిని క్యారీఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తారు. ఉర్దూ అధికారి గ్రేడ్–2 పోస్టుల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పోస్టులను జనరల్ కేటగిరీకి మార్చుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. 60 పోస్టుల్లో ఎస్సీలకు 15 శాతం చొప్పున 9 పోస్టులు, ఎస్టీలకు 6 శాతం చొప్పున 4 పోస్టులు కేటాయించాలి. కానీ అభ్యర్థులు లేరని ఎస్సీ, ఎస్టీల పోస్టులను ఇతర అభ్యర్థులతో మైనార్టీ సంక్షేమ శాఖ భర్తీ చేసింది. ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి! ఓ మాజీ ఐపీఎస్ అధికారి ఒత్తిడి మేరకు అధికారులు ఇలా ఏకపక్షంగా చర్యలు తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకే జాబితాను గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తూ చేపట్టిన ఈ భర్తీకి సంబంధించి ఉర్దూ అకాడమీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలతో ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఉర్దూ అకాడమీ వెబ్సైట్లో మైనారిటీ సంక్షేమ శాఖ తాజాగా ప్రదర్శించింది. కేటగిరీ పోస్టులు ఓసీ 9 బీసీ–బీ 7 బీసీ–సీ 1 బీసీ–డీ 1 బీసీ–ఈ 42 కేటగిరీల వారీగా నియమితులైన అభ్యర్థుల వివరాలు ఓపెన్ కేటగిరీ జనరల్ కోటాలో 29 పోస్టులు భర్తీ చేశారు. ఇందులో ఏడుగురు ఓసీ అభ్యర్థులు, 22 మంది బీసీ–ఈ అభ్యర్థులు. ఓపెన్ కేటగిరీ వుమెన్ కోటాలో 19 పోస్టులు భర్తీ చేశారు. వీరిలో ఒకరు ఓసీ, 17 మంది బీసీ–ఈ, ఒకరు బీసీ–బీ. బీసీ–బీ జనరల్ కేటగిరీలో ముగ్గురు, వుమెన్ కేటగిరీలో ఇద్దరు చొప్పున నియమితులయ్యారు. బీసీ–సీ జనరల్, బీసీ–డీ జనరల్, బీసీ–ఈ జనరల్, బీసీ–ఈ వుమెన్ కేటగిరీల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు ఎంపికయ్యారు. దివ్యాంగుల కేటగిరీలో 3 పోస్టులు భర్తీ చేయ గా ఇందులో అంధుల కోటాలో ఒకరు (బీసీ–బీ), బధిరుల కోటాలో ఒకరు(ఓసీ), ఆర్థో కోటాలో ఒకరు (బీసీ–ఈ) చొప్పున నియమితులయ్యారు. -
ఆ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వోద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటివరకూ సంస్థ ఉద్యోగుల విభజనపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ఆర్టీసీకి సంయుక్త లేఖ అందింది. కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని... ఆర్టీసీ కార్పొరేషన్ అయినందున వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు ఉద్యోగుల కేటాయింపు కోసం సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బోర్డు ఈ మేరకు కసరత్తు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కసరత్తు ప్రారంభించిన ఆర్టీసీ: సీఎస్ల లేఖ నేపథ్యంలో ఆర్టీసీ ఆగమేఘాల మీద కసరత్తు ప్రారంభించింది. కార్మిక, ఉద్యోగ సంఘాలు, అధికారులతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీ భేటీ అయింది. ఉద్యోగులు, కార్మికుల కేటాయింపునకు సంబంధించి వారి వాదనలను నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి. ఆంధ్రా సిబ్బంది తెలంగాణలో పనిచేయటానికి అంగీకరించబోమని కొందరు, ఒకవేళ ఎవరైనా పనిచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే డిప్యూటేషన్ పద్ధతిలోనే కొనసాగించాలని మరికొందరు సూచించారు. ప్రస్తుతం ఎక్కడున్నవారిని అక్కడే కొనసాగించాలని ఆంధ్రా సిబ్బంది కోరారు. దీంతో ఈ వ్యవహారం ఆర్టీసీలో కొత్త గందరగోళానికి కారణమవుతోంది. అయితే కార్మికుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఓ నివేదికలా రూపొందించి.. ఆర్టీసీ బోర్డు ముందు పెట్టనున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. చివరికి ఆ మార్గదర్శకాలే..!: ఆర్టీసీ ఆస్తుల విభజనకు సంబంధించి కూడా గతంలో ఇరు ప్రాంతాల వారు పట్టువీడవకపోవటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరికి కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలనే వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరికొద్దిరోజులు పరిస్థితిని పరిశీలించి రెండు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించాలని ఆర్టీసీ ఎండీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.