సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వోద్యోగుల కేటాయింపునకు సంబంధించి కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి. రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇప్పటివరకూ సంస్థ ఉద్యోగుల విభజనపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ఆర్టీసీకి సంయుక్త లేఖ అందింది.
కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని... ఆర్టీసీ కార్పొరేషన్ అయినందున వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అందులో పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీలకు ఉద్యోగుల కేటాయింపు కోసం సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బోర్డు ఈ మేరకు కసరత్తు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కసరత్తు ప్రారంభించిన ఆర్టీసీ: సీఎస్‌ల లేఖ నేపథ్యంలో ఆర్టీసీ ఆగమేఘాల మీద కసరత్తు ప్రారంభించింది. కార్మిక, ఉద్యోగ సంఘాలు, అధికారులతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీ భేటీ అయింది. ఉద్యోగులు, కార్మికుల కేటాయింపునకు సంబంధించి వారి వాదనలను నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి.
ఆంధ్రా సిబ్బంది తెలంగాణలో పనిచేయటానికి అంగీకరించబోమని కొందరు, ఒకవేళ ఎవరైనా పనిచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే డిప్యూటేషన్ పద్ధతిలోనే కొనసాగించాలని మరికొందరు సూచించారు. ప్రస్తుతం ఎక్కడున్నవారిని అక్కడే కొనసాగించాలని ఆంధ్రా సిబ్బంది కోరారు. దీంతో ఈ వ్యవహారం ఆర్టీసీలో కొత్త గందరగోళానికి కారణమవుతోంది. అయితే కార్మికుల అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఓ నివేదికలా రూపొందించి.. ఆర్టీసీ బోర్డు ముందు పెట్టనున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు.
చివరికి ఆ మార్గదర్శకాలే..!: ఆర్టీసీ ఆస్తుల విభజనకు సంబంధించి కూడా గతంలో ఇరు ప్రాంతాల వారు పట్టువీడవకపోవటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరికి కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలనే వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ యాజమాన్యం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మరికొద్దిరోజులు పరిస్థితిని పరిశీలించి రెండు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించాలని ఆర్టీసీ ఎండీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ మార్గదర్శకాలు ఆర్టీసీకి వర్తించవు!
Published Thu, Nov 13 2014 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM
Advertisement