UPSC Civil Service 2021 Final Results Telugu States Rankers And Their Story - Sakshi
Sakshi News home page

Civil 2021 Rankers In Telugu States: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ

Published Tue, May 31 2022 8:10 AM | Last Updated on Tue, May 31 2022 10:46 AM

Civils Rankers In Telugu States And Their Background - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్‌ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ..

యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్‌ వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్‌ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్‌–1లో మూడో ర్యాంక్‌ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్‌ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్‌ సాధించారు.  

పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్‌  
విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్‌వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్‌ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు.   

సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు 
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్‌ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్‌ తండ్రి సత్యప్రసాద్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన భరద్వాజ్‌ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. 

కందుకూరు కోడలికి 37వ ర్యాంక్‌ 
నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్‌ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు.  

56వ ర్యాంకర్‌ డాక్టర్‌ కిరణ్మయి 
కాకినాడ రూరల్‌ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్‌ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్‌డీఎల్‌)లో సీనియర్‌ టెక్నికల్‌ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్‌ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్‌ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు.  

ఉన్నతోద్యోగాలు వదులుకొని..
62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్‌ఐటీ సూరత్‌కల్‌లో బీటెక్‌ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్‌ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. 

సత్తా చాటిన రైతు బిడ్డ 
2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్‌ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్‌ గుడివాడలో చదివి, ఖరగ్‌పూర్‌ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించారు.  

రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు 
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్‌ పట్నాయక్‌ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్‌ తండ్రి రవికుమార్‌ పట్నాయక్‌ ఎల్‌ఐసీ రూరల్‌ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్‌ పట్నాయక్‌ గౌహతి ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్‌ పట్నాయక్‌ తెలిపారు. 


ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్‌ 
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్‌ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్‌ ఎలక్ట్రికల్‌ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్‌ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్‌ ఏషియన్‌ వర్సిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్‌షిప్‌లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.  

 

ఆన్‌లైన్‌ కోచింగ్‌..154వ ర్యాంక్‌ 
నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు.  

న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్‌ 
పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్‌ 157వ ర్యాంక్‌ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్‌ ఐఐటీ ఇంజనీరింగ్‌ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్‌ తెలిపారు.


మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్‌ 
గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్‌ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ టెక్నాలజీలో బీటెక్‌ ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌  పూర్తి చేశారు. మణిదీప్‌ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. 

తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు.. 
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన షేక్‌ అబ్దుల్‌ రవూఫ్‌ సివిల్స్‌లో 309 ర్యాంక్‌ సాధించారు. రవూఫ్‌ తండ్రి మహ్మద్‌ ఇక్బాల్‌ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్‌ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో సివిల్స్‌ శిక్షణ పొందాను’ అని రవూఫ్‌ పేర్కొన్నారు. 

గంగపుత్రుడికి 350వ ర్యాంక్‌ 
కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్‌ 350వ ర్యాంక్‌ సాధించారు. అశోక్‌ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్‌ ఇంటర్మీడియెట్‌ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్‌ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు.  

రైతు బిడ్డకు 420వ ర్యాంక్‌ 
తెనాలి రూరల్‌ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్‌టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్‌ ఎనర్జీలో ఎంటెక్‌ చేశాడు. జూనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్‌ఎస్‌ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. 


 

ఓఎన్‌జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు 
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్‌ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్‌జీసీ ఎలక్ట్రికల్‌ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్‌ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్‌ కాకినాడ జేఎన్‌టీయూలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్‌జీసీలో ఉద్యోగం సాధించారు. 

సీఎం, గవర్నర్‌ శుభాకాంక్షలు
సివిల్స్‌–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్‌ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 

చదవండి👉సివిల్స్‌ టాపర్‌ శ్రుతీ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement