
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) వడివడిగా అడుగులు వేస్తోంది. బోర్డు ఏర్పాటై పక్షం రోజులు గడవకముందే నోటిఫికేషన్ల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో దాదాపు 5 వేల ఖాళీలను గుర్తించింది. వీటికి సంబంధించి రోస్టర్ వివరాలను సమర్పించాలని ఆయా సొసైటీలకు ఆదేశాలు జారీ చేసిన బోర్డు.. ఇప్పటికే వాటిని సేకరించింది.
గురుకుల పోస్టుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్షా విధానం ఏలా ఉండాలనే అంశంపై తుది నిర్ణయానికి వచ్చింది. గతంలో టీఎస్‌పీఎస్సీ అమలు చేసిన సిలబస్‌ను తాజా పరీక్షలకూ వర్తింపజేయనుంది. అదేవిధంగా డిగ్రీకాలేజీల్లో లెక్చరర్ల నియామకం మినహా మిగతా ప్రక్రియంతా టీఎస్‌పీఎస్సీ అనుసరించిన వ్యూహాన్నే గురుకుల బోర్డు అనుసరిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను బోర్డు ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. వీటికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
జూన్ 15 కల్లా నోటిఫికేషన్..!
గురుకుల పాఠశాలల్లో ఖాళీలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. రోస్టర్ పాయింట్లతోపాటు పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉండటంతో నియామక ఏర్పాట్లలో బోర్డు తలమునకలైంది. ఈ నేపథ్యంలో సిలబస్, పరీక్ష విధానాన్ని సైతం పక్కాగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. అన్నీ సకాలంలో పూర్తయితే వచ్చే నెల రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment