సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ తర్వాత విద్యాశాఖలో కలవరం మొదలైంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడి ఉన్న ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యా మండలి, పాఠశాల విద్యలో సాంకేతిక భద్రత ఏ మేరకు ఉందనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వాస్తవానికి విద్యా వ్యవస్థలో పరీక్షల దగ్గర్నుంచీ, పాలనపరమైన విధానాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి.
ప్రతి సందర్భంలో ఏదో ఒక సమస్య తలెత్తుతున్నా, దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్లడమే తప్ప ఇప్పటివరకు అందుకు మూల కారణాలను అన్వేషిం చిన దాఖలాల్లేవు. పలు కీలకమైన సందర్భాల్లో సర్వర్లు మొరాయించడమో, ఇతర సాంకేతిక పరమైన సమస్యలు రావడమో జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో బయట వ్యక్తులతో మరమ్మతులు చేయిస్తున్నారు కానీ సొంత సంస్థల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల నియామకంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో తమకూ ఇబ్బంది కలిగించవచ్చనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఎదురైన సవాళ్ళపై అంతర్గత సమీక్ష చేపట్టారు.
పాఠశాల విద్యలో పలుమార్లు సమస్యలు..
రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. టెన్త్ పరీక్షలు రాసే వాళ్లు ఏటా దాదాపు 5 లక్షల మంది వరకు ఉంటారు. టీచర్లు 1.05 లక్షల మంది పని చేస్తున్నారు. ప్రశ్నపత్రాలు, ఉపాధ్యాయుల సర్వీస్ రికార్డులన్నీ ఈ ఫైలింగ్ ద్వారానే భద్రపరుస్తారు. ఇంత ముఖ్యమైన శాఖలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా చూస్తుంటారు.
శాశ్వత ఐటీ నిపుణులంటూ ఎవరూ లేరు. చిన్నచిన్న సమస్యలను కాస్తోకూస్తో కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉన్న విద్యాశాఖ సిబ్బందే పరిష్కరిస్తుంటారు. గోప్యంగా ఉండాల్సిన ఫైళ్ళు, ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీలక పాస్‌వర్డ్స్ అన్నీ ముఖ్యుల పర్యవేక్షణలో ఉంటాయి. అయితే ఫైర్‌వాల్స్, రక్షణ వ్యవస్థ మాత్రం వీళ్ళలో చాలామందికి తెలియదు. గత ఏడాది టెట్ నిర్వహించినప్పుడు అనేక తప్పులు దొర్లాయి.
317 జీవోతో జరిగిన బదిలీల సమయంలోనూ రకరకాల తప్పులు బయటకొచ్చాయి. వీటిని సరిచేయడానికి కొన్ని నెలలు పట్టింది. కీలక సమాచారం భద్రతకు వాడే ఫైర్‌వాల్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసే వ్యక్తుల సమగ్ర సమాచారం కూడా అధికారుల వద్ద లేదు. ఈ నేపథ్యంలో కీలకమైన పాస్‌వర్డ్స్ బయటకెళ్తే సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉన్నత విద్యలోనూ డొల్లే..
దేశ, విదేశాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సరి్టఫికెట్లు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటివి ముద్రించే గ్యాంగ్‌లను పట్టుకున్నారు. అయినా ఇవి ఆగడం లేదు. ఏకంగా వర్సిటీల వెబ్‌సైట్లలోకే హ్యాకర్స్ ప్రవేశించే ప్రయత్నం జరిగిందనే వార్తలూ వచ్చాయి.
కాగా నకిలీ సర్టఫికెట్ల అదుపునకు పోలీసులు, ఉన్నత విద్యా మండలి ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. విద్యార్థులకు సంబంధించిన కొన్నేళ్ళ సరి్టఫికెట్లను ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అయితే ఈ వెబ్‌సైట్ ప్రారంభం సందర్భంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి.. ఇలాంటి వెబ్‌సైట్లకు బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భద్రత ఉండాలని సూచించారు.
ఉన్నత విద్యా మండలిలో కేవలం ఒకే ఒక వ్యక్తి, అదీ అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటికీ కీలక సమాచారం, గోప్యంగా ఉండాల్సిన పాస్ట్‌వర్డ్స్ భద్రతకు మండలిలో గానీ, విశ్వవిద్యాలయాల్లో గానీ సరైన వ్యవస్థ లేదని అధికారులే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment