Government's Focus On The Situation Of Recruitment Agencies - Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్‌ ఘటన.. అప్రమత్తమైన తెలంగాణ సర్కార్‌, ఏ బోర్డు ఎంత భద్రం!

Published Tue, Mar 14 2023 2:17 AM | Last Updated on Tue, Mar 14 2023 4:51 PM

Government's focus on the situation of recruitment agencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో కంప్యూటర్ల నుంచి ప్రశ్నపత్రాల తస్కరణ వ్యవహారంతో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఈ వ్యవహారం ప్రభు­త్వానికి మచ్చగా మారుతుందేమోనన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా వాస్తవ పరిస్థితుల విశ్లేషణకు ఉపక్రమించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఆ మేరకు నియామక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రంలో నాలుగు నియామక సంస్థలున్నాయి. టీఎస్‌పీఎస్సీ, తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ), తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎంఎచ్‌ఎస్‌ఆర్‌బీ)ల ద్వారా ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో వాటి పనితీరును సమీక్షించాలని, ఏ బోర్డు..ఎంత భద్రమో క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం నియామక సంస్థల చైర్మన్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. 

మానవ వనరులపై నిఘా...? 
ప్రస్తుతం చాలా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ పూర్తికాగా, కొన్నింటికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించడంతో తదుపరి దశకు చేరుకున్నాయి. నియామక సంస్థల్లో మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, గోప్యత అనేవి అత్యంత కీలకం. ఆయా అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరిగినా నియామక సంస్థల ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు, ఎన్నో ఆశలతో, కఠోర దీక్షతో సన్నద్ధమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది.

తాజాగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులే కంప్యూటర్లు హ్యాక్‌ చేయడంతో పాటు ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్‌ చేశారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా బోర్డుల్లో మానవ వనరుల పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞానం తీరును సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. బోర్డుల వారీగా ఉద్యోగులు, వారి అర్హతలు, బాధ్యతలు, అధికారాలపై పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించింది.

ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇతర బోర్డుల పరిస్థితిని కూడా సమీక్షించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగిన సూచనలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియామక సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కడ్నుంచి తీసుకుంటున్నాయి? బయటి నుంచి ఈ మేరకు సహకారం తీసుకుంటున్నాయనే కోణంలో ప్రభుత్వం పరిశీలించనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement