Boarding schools
-
వారంలోగా ప్రాథమిక జాబితా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి ప్రాథమిక జాబితా సిద్ధమైంది. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను ఇప్పటికే విడుదల చేసిన గురుకుల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) తాజాగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) కేటగిరీల వారీగా ప్రాథమిక జాబితాను వారంలోగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. జాబితాను 1:2 ప్రకారం ప్రకటించనుంది. ఇప్పటికే అభ్యర్థుల మార్కుల జాబితాను బోర్డు ప్రకటించినప్పటికీ అసెంబ్లీ రద్దు, ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ కాస్త ఆలస్యం చేసింది. తాజాగా నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు వేగిరం చేసింది. ఈక్రమంలో మార్కుల జాబితాను వడపోసిన యంత్రాంగం..ఒక పోస్టుకు ఇద్దరు అభ్యర్థులను గుర్తిస్తూ జాబితాను తయారు చేసింది. జాబితా వెల్లడించిన తర్వాత అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం ఉద్యోగాలకు నియమితులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం తుది జాబితా వెల్లడించేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందని, ఎంపిక ప్రక్రియ అంతా ఈనెలాఖరులోగా పూర్తవుతుందని తెలుస్తోంది. -
గురుకుల ఉద్యోగాలకు సిలబస్ ఖరారు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) వడివడిగా అడుగులు వేస్తోంది. బోర్డు ఏర్పాటై పక్షం రోజులు గడవకముందే నోటిఫికేషన్ల విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాల్లో దాదాపు 5 వేల ఖాళీలను గుర్తించింది. వీటికి సంబంధించి రోస్టర్ వివరాలను సమర్పించాలని ఆయా సొసైటీలకు ఆదేశాలు జారీ చేసిన బోర్డు.. ఇప్పటికే వాటిని సేకరించింది. గురుకుల పోస్టుల భర్తీలో కీలకమైన సిలబస్, పరీక్షా విధానం ఏలా ఉండాలనే అంశంపై తుది నిర్ణయానికి వచ్చింది. గతంలో టీఎస్పీఎస్సీ అమలు చేసిన సిలబస్‌ను తాజా పరీక్షలకూ వర్తింపజేయనుంది. అదేవిధంగా డిగ్రీకాలేజీల్లో లెక్చరర్ల నియామకం మినహా మిగతా ప్రక్రియంతా టీఎస్పీఎస్సీ అనుసరించిన వ్యూహాన్నే గురుకుల బోర్డు అనుసరిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను బోర్డు ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. వీటికి ఒకట్రెండు రోజుల్లో ఆమోదం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 15 కల్లా నోటిఫికేషన్..! గురుకుల పాఠశాలల్లో ఖాళీలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. రోస్టర్ పాయింట్లతోపాటు పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో ఉండటంతో నియామక ఏర్పాట్లలో బోర్డు తలమునకలైంది. ఈ నేపథ్యంలో సిలబస్, పరీక్ష విధానాన్ని సైతం పక్కాగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. అన్నీ సకాలంలో పూర్తయితే వచ్చే నెల రెండో వారంలో నోటిఫికేషన్ జారీ చేసేలా ప్రణాళికలు రూపొందించుకుంది. -
2019లో మరో 119 గురుకులాలు: జోగు రామన్న
హైదరాబాద్: వచ్చే ఏడాది మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు నీట్, ఐఐటీలో ప్రత్యేక శిక్షణ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితారాజేంద్ర హాజరయ్యారు. గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు 2 డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు. గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల్లో పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా నీట్, ఐఐటీ శిక్షణ తరగతులు ప్రారంభిం చామన్నారు. దీనిలో భాగంగా 19 గురుకులాలకు చెందిన 3,779 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 386 మందిని ఎంపిక చేశామని, వారికి ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను నగదు పురస్కారంతో సత్కరించారు. -
‘గురుకుల’ దరఖాస్తులు వాయిదా
సీఎం ఆదేశాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తుల స్వీకరణను తాత్కాలికంగా వాయిదా వేసి నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గురువారం ప్రకటిం చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉన్నా.. నిబంధనల్లో మార్పుల నిమిత్తం వాయిదా వేసినట్లు తెలిపింది. ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్న విషయాన్ని తెలియజేస్తామని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలపై కసరత్తు గురుకుల పోస్టుల పరీక్ష రాసేందుకు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధనను, బోధన అనుభవం నిబంధనను తొలగించాలని.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 50% మార్కులతోనే దరఖాస్తులను స్వీకరించాలని సీఎం గురుకుల విద్యాలయాల సంస్థలను ఆదేశించారు. దీంతో సంక్షేమ శాఖలు, గురుకుల విద్యాలయాల సంస్థలు గురువారం హుటాహుటిన సమావే శమై... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శ కాల ప్రకారం కొత్త నిబంధనల రూప కల్పనపై కసరత్తు చేశాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో అధికారులు చర్చించారు. పీఈటీ పోస్టుల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు అవకాశం కల్పించడం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారికి అవకాశం కల్పించడం, మూడేళ్ల బోధన అనుభవం, డిగ్రీ, పీజీల్లో 60శాతం మార్కులుండాలన్న నిబంధన లను తొలగించేలా చర్యలు చేపట్టారు. టీఎస్ పీఎస్సీ కొత్త నిబంధనలను శుక్రవారం పరిశీలించనుంది. వివరణలు అవసరమైతే తీసుకుని.. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించే అవకాశముంది. లేకపోతే సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం!
సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు - కొత్త నిబంధనలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టీకరణ - ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: కొత్త నిబంధనలతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పాఠాలు చెప్పే పరిస్థితులు లేవని, తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అందులో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ‘మాకు వీఆర్ఎస్ ఇచ్చి ఇళ్లకైనా పంపండి... లేదా వేరే ప్రభుత్వ విభాగాల్లోకైనా పంపించండి’ అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి బెన్హర్ మహేశ్ దత్ ఎక్కాను కోరారు. ఈ గురుకులాల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ‘న్యూ క్వాలిటీ పాలిసీ-2016’ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ‘సెమినార్’లకు హాజర వ్వాలని విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెమినార్లలో ఉపాధ్యాయుల బోధనా తీరు, ఇతర అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. అయితే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 1 నుంచి మొదలైన సెమినార్లను బహిష్కరించారు. 13న హైదరాబాద్‌లో మహా ధర్నా, 14 నుంచి గురుకులాలను మూసేసి నిరవధిక సమ్మె జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కా శనివారం గురుకుల ఉపాధ్యాయ జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. చర్చలను బహిష్కరించిన జేఏసీ నాయకులు ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల కోసం వెళ్లిన జేఏసీ నాయకులు కె. వెంకటరెడ్డి, కె. అర్జున, కె. రవీందర్‌రెడ్డి, కె. నరేందర్ రెడ్డి, కె. యాదయ్య, జె. రామలక్ష్మణ్, పరంధాములు, శ్రీరాం శ్రీనివాస్ తదితరులు సంస్థలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరంకుశ. అణచివేత ధోరణుల మధ్య గురుకుల విద్యాలయాలలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తే బెదిరింపులు వస్తున్నాయని, పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల కమిటీల పేర్లతో ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఎక్కాకు వివరించారు. కాగా ఎక్కాతో జేఏసీ నాయకులు సమావేశమైన సమయంలో గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ కూడా అక్కడే ఉండగా, తాము చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేశారు. సీఎం జోక్యం చేసుకోవాలి: జేఏసీ నాయకులు గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కోరారు. అందుకే ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. -
గురుకుల పాఠశాలల్లో ఎన్క్యూపీ
కల్లూరు: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచేందుకుగాను న్యూ క్వాలిటీ పాలసీ(ఎన్క్యూపీ) అమలు చేయనున్నట్టు గురుకుల పాఠశాలల రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.పుల్లయ్య తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక గురుకుల పాఠశాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ పాలసీ అమలులో భాగంగా షెడ్యూల్ ప్రకారం అన్ని జిల్లాల్లో సబ్జెక్టులవారీగా సెమినార్లు నిర్వహిస్తామని, ఉపాధ్యాయులకు ప్రాజెక్టులు ఉంటాయని చెప్పారు. దీనికి గ్రేడ్స్ ఇస్తామన్నారు. గ్రేడ్ పాయింట్లు సరిగారాని ఉపాధ్యాయులకు మళ్లీ ట్రైనింగ్ ఇస్తామన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకే ఈ విధానాన్ని రూపొందించినట్టు చెప్పారు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా గురుకుల పాఠశాలల్లో విద్యాబోధన చేయడమే లక్ష్యమని అన్నారు. సమావేశంలో ఎంఈఓ కాకర్ల రంగారావు; కల్లూరు, మధిర ప్రిన్సిపాల్స్ ప్రేమారాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఇంగ్లిష్‌లో ఇరగదీశారు!
♦ తెలుగు మీడియం కంటే అధిక ఉత్తీర్ణత ♦ తెలుగులో 81.75%..ఆంగ్ల మాధ్యమంలో 89.30% సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోలిస్తే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. పదో తరగతిలో మొత్తంగా 85.63 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రం 89.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంలో 81.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలకు హాజరైతే 2,11,281 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి మాత్రం పరీక్షలకు 2,82,682 మంది హాజరు కాగా.. వారిలో 2,52,433 మంది (89.30) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,44,448 మంది హాజరు కాగా 1,79,221 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఉర్దూ మీడియంలో గతేడాది 11,713 మంది హాజరు కాగా 7,034 మంది (60.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య తగ్గినా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అదే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరగడం గమనార్హం.