కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం! | We cant teach with the new testaments | Sakshi
Sakshi News home page

కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం!

Published Sun, Sep 4 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం!

కొత్త నిబంధనలతో పాఠాలు చెప్పలేం!

సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు
- కొత్త నిబంధనలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టీకరణ
- ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల బహిష్కరణ
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త నిబంధనలతో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పాఠాలు చెప్పే పరిస్థితులు లేవని, తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని అందులో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ‘మాకు వీఆర్‌ఎస్ ఇచ్చి ఇళ్లకైనా పంపండి... లేదా వేరే ప్రభుత్వ విభాగాల్లోకైనా పంపించండి’ అని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కాను కోరారు. ఈ గురుకులాల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ‘న్యూ క్వాలిటీ పాలిసీ-2016’ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో  ‘సెమినార్’లకు హాజర వ్వాలని విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సెమినార్‌లలో ఉపాధ్యాయుల బోధనా తీరు, ఇతర అంశాలను పరిశీలించి మార్కులు కేటాయిస్తారు. అయితే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 1 నుంచి మొదలైన సెమినార్‌లను బహిష్కరించారు. 13న హైదరాబాద్‌లో మహా ధర్నా, 14 నుంచి గురుకులాలను మూసేసి నిరవధిక సమ్మె జరపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా శనివారం గురుకుల ఉపాధ్యాయ జేఏసీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు.

 చర్చలను బహిష్కరించిన జేఏసీ నాయకులు
 ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో చర్చల కోసం వెళ్లిన జేఏసీ నాయకులు కె. వెంకటరెడ్డి, కె. అర్జున, కె. రవీందర్‌రెడ్డి, కె. నరేందర్ రెడ్డి, కె. యాదయ్య, జె. రామలక్ష్మణ్, పరంధాములు, శ్రీరాం శ్రీనివాస్ తదితరులు సంస్థలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరంకుశ. అణచివేత ధోరణుల మధ్య గురుకుల విద్యాలయాలలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తే బెదిరింపులు వస్తున్నాయని, పేరెంట్స్ కమిటీలు, పూర్వ విద్యార్థుల కమిటీల పేర్లతో ఫోన్లు చేసి వేధిస్తున్నారని ఎక్కాకు వివరించారు. కాగా ఎక్కాతో జేఏసీ నాయకులు సమావేశమైన సమయంలో గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ కూడా అక్కడే ఉండగా, తాము చర్చలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేశారు.

 సీఎం జోక్యం చేసుకోవాలి: జేఏసీ నాయకులు
 గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపాలని ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కోరారు. అందుకే ప్రభుత్వ కార్యదర్శి ఎక్కాతో సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement