
హైదరాబాద్: వచ్చే ఏడాది మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు నీట్, ఐఐటీలో ప్రత్యేక శిక్షణ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితారాజేంద్ర హాజరయ్యారు.
గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు 2 డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు. గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల్లో పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా నీట్, ఐఐటీ శిక్షణ తరగతులు ప్రారంభిం చామన్నారు. దీనిలో భాగంగా 19 గురుకులాలకు చెందిన 3,779 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 386 మందిని ఎంపిక చేశామని, వారికి ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను నగదు పురస్కారంతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment