minister jogu ramanna
-
పంద్రాగస్టున బీసీల రాయితీ పథకం ప్రారంభం: మంత్రి
సాక్షి, హైదరాబాద్: బీసీల ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ నెల 15న అమల్లోకి రానున్న ప్రత్యేక రాయితీ పథకం ప్రారంభానికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది లబ్ధిదారులకు రాయితీ పథకం లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేశామన్నారు. నిధులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాతాలో జమ చేసినట్లు తెలి పారు. రుణాల కోసం దళారులను ఆశ్రయించవద్దని ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ, డీఆర్డీవో పీడీలు సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్‌గా ఉన్న కమిటీ ద్వారా ఎంపిక చేస్తుందని చెప్పారు. -
మూడో కూటమిపై సీఎం ప్రకటన హర్షనీయం
ఆదిలాబాద్: దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు అవసరమని, అందుకు ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, బీసీ శాఖమంత్రి జోగురామన్న ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో ఇప్పటికి గ్రామాల్లో కరెంటు, తాగు, సాగునీరు అందకపోవడం శోచనీయమని తెలిపారు. దేశంలో ఎన్నో జీవ నదులున్నా జాతీయ పార్టీలు అధికారంలో ఉండి సద్వినియోగం చేసుకోలేకపోయాయని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని కేసీఆర్ చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధించామని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను సైతం మార్చగల శక్తి కేసీఆర్‌కు ఉందని, సీఎం ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కేసీఆర్ వెంట తాము ఎల్లవేళలా ఉంటామని స్పష్టం చేశారు. -
కోర్టుకు హాజరయిన మంత్రి రామన్న
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని జిల్లా కోర్టుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నేత అరవిందరెడ్డి సోమవారం హాజరయ్యారు. 2012లో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికల కోడ్ ఉల్లంగించారని అప్పటి ఎన్నికల అధికారి గుగ్లోత్ రవినాయక్ కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి ముగ్గురు కోర్టుకు హాజరుకాగా ఏప్రిల్ 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. దీంతోపాటు 2010లో ఎమ్మెల్యేగా ఉన్న జోగు రామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించారని వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేత సంజీవ్‌రెడ్డి పరువు నష్ట దావా కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా జోగు రామన్న కోర్టుకు హాజరు కాగా, ఈ నెల 27కు వాయిదా పడింది. -
గిరిజన జంటలకు సామూహిక పెళ్లిళ్లు
బెజ్జూర్(సిర్పూర్): కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలంలో సోమిని గ్రామ శివారు, ప్రాణహిత నది ఒడ్డున నిర్వహించిన సమ్మక్క–సారలమ్మ జాతరలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో మంగళవారం 58 గిరిజన జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. మంత్రి జోగు రామన్న, ఐటీడీఏ చైర్మన్ లక్కెరావు, ఎమ్మెల్యే సతీమణి రమాదేవిలతో పాటు అరిగెల నాగేశ్వరరావు పెళ్లి పెద్దలుగా హాజరై గిరిజన జంటలను ఆశీర్వదించారు. నూతన వధూవరులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులు మంగళసూత్రాలు, మెట్టెలు అందించారు. ఎమ్మెల్యేతోపాటు మంత్రి నూతన వధూవరులకు గృహోపయోకరణ సామగ్రిని అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేసీఆర్ మంత్రి వర్గంలో ఉండి 58 నూతన జంటలను ఆశీర్వదించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ఈ 58 జంటలే కాకుండా మరో 116 జంటలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు చేయిస్తానన్నారు. త్వరలో సిర్పూర్‌పేపర్ మిల్లును తెరిపించి కార్మికుల కష్టాలను తొలగించేంత వరకు నిద్రపోనన్నారు. కార్యక్రమంలో కోనేరు ట్రస్ట్ అధ్యక్షుడు కోనేరు వంశీ దంపతులు, జెడ్పీటీసీ సభ్యులు కోండ్ర శారద జగ్గాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
2019లో మరో 119 గురుకులాలు: జోగు రామన్న
హైదరాబాద్: వచ్చే ఏడాది మరో 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు నీట్, ఐఐటీలో ప్రత్యేక శిక్షణ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు. పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అనితారాజేంద్ర హాజరయ్యారు. గురుకులాల సంఖ్య పెంచడంతో పాటు కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు 2 డిగ్రీ కళాశాలల ఏర్పాటు చేస్తామన్నారు. గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల్లో పోటీని తట్టుకునేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా నీట్, ఐఐటీ శిక్షణ తరగతులు ప్రారంభిం చామన్నారు. దీనిలో భాగంగా 19 గురుకులాలకు చెందిన 3,779 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి 386 మందిని ఎంపిక చేశామని, వారికి ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు తెలిపారు. గురుకులాలకు పక్కా భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాటు అధ్యాపకులను నగదు పురస్కారంతో సత్కరించారు. -
మంటలు ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీని వినియోగిస్తామని అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలోని ఆయన చాంబర్లో ఎఫ్డీసీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) కార్యక్రమాలను సమీక్షించారు. ఎకో టూరిజంలో ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్‌తో నేరెడిగొమ్మ మండలం పెద్ద మునగాల గ్రామంలో రూ. రెండు కోట్లతో, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో రూ. రెండు కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీసీకి యూకలిప్టస్ అమ్మకాల ద్వారా రూ.123 కోట్లు, వెదురు ద్వారా రూ.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్ కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో పాలపిట్ట సైక్లింగ్ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్డీసీ పూర్తిగా నిరాదరణకు గురైందని, రానున్న రోజుల్లో ఎఫ్డీసీని మరింత బలోపేతం చేస్తామని బండ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమీక్షలో ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ చందన్ మిత్రా సంస్థ పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
బీసీ గురుకుల విద్యార్థులకు ఐఐటీ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని భావించిన అధికారులు ఈమేరకు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించిన యంత్రాంగం 360 మందిని అర్హులుగా గుర్తించింది. ఈ విద్యార్థులను సీఓఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. ఒకటి రెండురోజుల్లో తరగతులు ప్రారంభం సీఓఈని ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన అధికారులు, ఒకట్రెండు రోజుల్లో అక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. 360 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా... ఇందులో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు చెందిన 180 మంది, సెకండియర్ చదువుతున్న 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగంమంది బాలికలున్నారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నిర్వహించే తరగతులతో పాటు అదనపు శిక్షణ కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అ«ధ్యాపకులను సైతం నియమించారు. ఈ కేంద్రాన్ని రెండ్రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. వారాంతంలోగా తరగతులు ప్రారంభించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆదివాసీల డిమాండ్‌పై స్పష్టత ఉంది
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల డిమాండ్‌పై ప్రభుత్వానికి స్పష్టత ఉందని అటవీ, పర్యావరణ, బీసీ సం క్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్‌లో రామన్న మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా హక్కులను అమలు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ, లంబాడీల మధ్య తలెత్తిన వివాదం సున్నితమైందని, ప్రభుత్వం తరఫున సీఎస్, డీజీపీలు ఇరువర్గాలతో చర్చించారని వివరించారు. నాగోబా దర్బార్‌లో ఆదివాసీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ మేడారం జాతర తర్వాత మలి విడత చర్చలు జరిపి, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోందన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు తదితర అంశాలలో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ వి.శోభారాణి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే.. దర్బార్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆదివాసీల నుంచి అర్జీలు స్వీకరించింది. సాధారణంగా దర్బార్‌లో ఆదివాసీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేస్తారు. కానీ, ఈసారి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్‌తో అర్జీలు అందజేయడం గమనార్హం. దర్బార్ వేదికపై నుంచి ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఇదే డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. పోటెత్తిన కేస్లాపూర్ దర్బార్ సందర్భంగా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు తరలివచ్చిన ఆదివాసీలతో కేస్లాపూర్ పోటెత్తింది. పరిసరాల్లో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఈ నెల 16న ప్రారంభమైన నాగోబా జాతర శుక్రవారం దర్బార్తో అధికారికంగా ముగిసింది. మరో రెండు, మూడు రోజులపాటు ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. -
నా మాటలను వక్రీకరించారు
సాక్షి, ఆసిఫాబాద్: ఆదివాసీల ఉద్యమం వెనుక మాజీ మావోయిస్టులు ఉన్నారని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని పేర్కొనారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పిన మాటలను తాను చెబితే కొందరు వక్రీకరించారని అన్నారు. అల్లర్ల వెనుక మావోయిస్టులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తాను కానీ ఎక్కడా అనలేదని తెలిపారు. కావాలనే కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాను డీజీపీ పేర్కొన్న విధంగా అలర్లను అదనుగా తీసుకుని అదృశ్యశక్తులు బలపడతాయనే విషయాన్ని చెప్పానే తప్ప ఆదివాసీ ఉద్యమానికి, మావోయిస్టులకు సంబంధం ఉందని చెప్పలేదని స్పష్టం చేశారు. ఆదివాసీల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిష్కారం చూపుతుందన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఏజెన్సీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సమన్వయంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు విన్నవిస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. -
‘గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్’
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అలాగే గట్టులో బీసీ బాలికల గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం మంత్రి జోగురామన్నను బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయ గౌడ్ కలిశారు. అక్షరాస్యత, ఉపాధి కల్పనలో జిల్లా వెనకబడి ఉన్నందున అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రిని కోరారు. వీటిపై ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
రిమ్స్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ
ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ తీరు సరిగా లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారని, ఇప్పుడు ఆ బాధ తప్పిందన్నారు. ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని, వైద్యసేవలపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనీశ తదితరులున్నారు. -
ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు
బేల(ఆదిలాబాద్): వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతవుతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల బేలతోపాటు మశాల(బి), దహెగాం, మణియార్‌పూర్, గూడ, కాంఘర్‌పూర్, బెదోడ, సాంగిడి గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బేలలోని సబ్ మార్కెట్ యార్డులో జైనథ్ మార్కెట్ కమిటీ నిధులు రూ.1.25 కోట్ల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను సంఘటితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిందని చెప్పారు. రైతు సమితులు దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేసే ప్రక్రియలో భాగంగా భూ ప్రక్షాళన కోసం పనిచేస్తాయని తెలిపారు. వచ్చే ఖరీప్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతులకు వ్యవసాయం కోసం ఆర్థిక చేయూత అందించడానికి ప్రారంభించనున్న పెట్టుబడి పథకానికి పరిశీలన కోసం ఈ సమితులు కీలకంగా పనిచేస్తాయని అన్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆడపడుచులకు ప్రేమతో చీరలు పంపిణీ చేస్తోందని, ఎక్కడో ఒకట్రెండు చీరలు సరిగా లేకపోతే.. ఆ చీరలను కాల్చడం, ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇష్టముంటేనే ఆడపడుచులు ఈ చీరలను తీసుకోవాలని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రావుత్ మనోహర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి ప్రమోద్‌రెడ్డి, నాయకులు మస్కే తేజ్‌రావు, బండి సుదర్శన్, నిపుంగే సంజయ్, జక్కుల మధుకర్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, తన్వీర్‌ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
నేతన్నలను ఆదుకుంటాం
►రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ►జిల్లా పరిషత్‌లో జాతీయ చేనేత దినోత్సవం ఆదిలాబాద్‌అర్బన్: తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడి నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతోపాటు రుణాలు మాఫీ చేసినట్లు చెప్పారు. పాఠశాలలు, వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల యూనిఫారాల కోసం చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో రూ.1,286 కోట్లు కేటాయించడం, కులవృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమల స్థాపనకు రుణాలు, భూములు ఇవ్వడం జరుగుతుందన్నారు. చేనేత వస్త్రాలను ధరించిన పాత రోజులు మళ్లీ పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో చేనేత ఉత్పత్తులు లేకున్నా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. సాంకేతిక పరంగా అభివృద్ధి చెంది పవర్‌లూమ్స్ రావడంతో హ్యాండ్లూమ్స్ కొంత మేరకు తగ్గిందన్నారు. ఇండియా చేనేత ఉత్పత్తులకు ఇతర దేశాల్లో మంచి గీరాకీ ఉందన్నారు. జిల్లా స్థాయిలో చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. హ్యాండ్లూమ్కు మంచి భవిష్యత్ వస్తుందన్నారు. అనంతరం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 32వేల చేనేత కుటుంబాలుండేవని, ప్రస్తుతం 32కుటుంబాలు కూడా లేవన్నారు. అంతకుముందు పద్మశాలీ కుల పెద్దలను సన్మానించారు. -
జయశంకర్ సార్‌కు నివాళి
ఘనంగా 83వ జయంతి ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లోగల జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ జయశంకర్ సార్ చూపిన బాటలో నడవాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గదర్శకునిగా ఉన్న ఆయన స్వరాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిఒక్కరూ ప్రొఫెసర్ ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. ఆదిలాబాద్‌అర్బన్: జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో బానోత్ శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన జయశంకర్ సార్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్, పర్యవేక్షకులు సుశీల, ఇన్చార్జి డీసీఎస్వో తనూజ పాల్గొన్నారు. పోలీస్ క్యాంపు కార్యాలయంలో.. ఆదిలాబాద్: పోలీసు క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎం.శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మ రువలేనిదన్నారు. స్పెషల్‌బ్రాంచ్ ఎస్సైలు అన్వర్ ఉల్‌హఖ్, రామన్న, సీసీ పోతరాజు, ఫింగర్‌ప్రింట్ అధికా రి అశోక్‌కుమార్, సిబ్బంది కృష్ణమూర్తి, ప్రకాశ్‌రెడ్డి, అ బ్దుల్లా, సత్యనారాయణ, షకీల్, వెంకట్ పాల్గొన్నారు. -
బీసీ యువతకు 102 కోట్ల రాయితీ రుణాలు
వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం: మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: బీసీ యువతకు స్వయం ఉపాధి పథకం కింద 2017–18 వార్షిక సంవ త్సరంలో ఇచ్చే రుణాలపై రూ.102 కోట్ల రాయితీ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వారం రోజుల్లో ఆర్థిక శాఖ ఆమోదం లభిస్తుందని, ఈ ప్రక్రియ ముగిసిన వెం టనే క్షేత్ర స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక చేపడ తామన్నారు. గురువారం బీసీ సంక్షేమ భవన్లో ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 119 గురు కుల పాఠశాలలు ప్రారం భిస్తున్నట్లు తెలిపారు. గురుకులాలు అన్ని సౌకర్యా లతో శాశ్వత భవనాల్లో నిర్మించేందుకు స్థలాలను గుర్తించామని, విడతల వారీగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. గతంలో హాస్టల్ విద్యార్థులకు నెలకు 4 సార్లు మాంసాహారాన్ని అందించగా, ప్రస్తుతం 7 సార్లు ఇస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. బీసీ విదేశీ విద్యా నిధి పథకం కింద త్వరలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుందని, అధికారులు సకాలంలో నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్, అదనపు కార్యదర్శి సైదా, కమిషనర్ అరుణ, జేడీలు అలోక్‌కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమమే ప్రభుత్వ ఎజెండా
మంత్రులు అల్లోల, జోగు నాగోబా సన్నిధిలో ప్రజాదర్బార్ ఉట్నూర్: గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా ఆలయాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర దేవదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నలు పేర్కొన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ సన్నిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వారు మాట్లాడుతూ నాగోబా అలయంలో శాశ్వత అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.4 కోట్లు కేటాయించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు జాతర నిర్వహణకు రూ.పది లక్షలు మాత్రమే కేటాయించాయన్నారు. ఉట్నూర్ కేంద్రంగా ఉన్న ఐటీడీఏ ఉమ్మడి జిల్లాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం పని చేస్తోందని, ఐటీడీఏకు త్వరలోనే పూర్తిస్థాయి ప్రాజెక్టు అధికారిని నియమించేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ప్రాంతం జోడేఘాట్ అభివృద్ధికి రూ.25 కోట్లు ఖర్చు చేసిందన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి ఐదు వందల జానాభా ఉన్న గిరిజన తండాలు, గూడాలను పంచాయతీలుగా గుర్తించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజాదర్బార్‌లో ఆదిలాబాద్ ఎంపీ గెడం నాగేశ్, ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం జిల్లా కలెక్టర్లు, జ్యోతి బుద్దప్రకాశ్, ఆర్వీ కర్ణన్, చంపాలాల్, ఆదిలాబాద్ ఏస్పీ శ్రీనివాస్, ట్రైనీ కలెక్టర్ అనురాగ్ జయంతి, రాయి సెంటర్ జిల్లా గౌరవ అధ్యక్షుడు లక్కెరావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్‌రావ్ పాల్గొన్నారు. సతి స్థానంలో పతి నాగోబా ఆలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సతుల స్థానంలో పతులు వేదికపై కూర్చున్నా రు. ప్రజాదర్బార్ సందర్భంగా మంత్రు లు, ఎంపీ, అధికారులు వేదికపై కూర్చున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ను వేదికపై ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆమె హాజరు కాలేదు. కానీ, ఆమె భర్త సత్యనారాయణగౌడ్ వేదికపైకి వచ్చి బోకే అందుకున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు ఆమె భర్త శ్యాంనాయక్ వేదికపై కూర్చున్నారు. -
మంత్రి కుమారుడిపై హత్య కేసు
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కుమారుడిపై హత్య కేసు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతిరెడ్డి హత్య కేసులో మంత్రి కుమారుడు ప్రేమ్‌చంద్ నిందితుడని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా ఇతనితోపాటు అదే గ్రామానికి చెందిన మరో తొమ్మిదిమంది టీఆర్ఎస్ నాయకులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ హత్యపై రెండు రోజులుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ప్రేమ్‌చంద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లపై ముందుకే
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ - వాటి పెంపునకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించండి - తమిళనాడు తరహా వ్యూహం ఖరారు చేయండి - అక్కడికెళ్లి అధ్యయనం చేయండి.. అవసరమైతే నేనూ వస్తా - అధికారులకు సీఎం ఆదేశాలు.. కోర్టు రద్దు చేసేలా ఉండొద్దు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేద ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఎన్నికల హామీ మేరకు ఈ రెండు వర్గాలకు రిజర్లేషన్లు పెంచి తీరుతామని స్పష్టం చేశారు. వారికి రిజర్వేషన్ల పెంపుకు అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాన్ని ఖరారు చేయాల్సిందిగా సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం చర్చలు జరిపారు. బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్‌తో పాటు ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమీషన్ ఛైర్మన్ సుధీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధికంగా ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం సామాజిక, ఆర్ధిక, విద్యాపరమైన వెనుకబాటుతనం అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వెలిబుచ్చారు. ఈ విషయాల్లో వారు ముందడుగు వేయాల్సిన అవసరముందన్నారు. ‘‘సామా జిక అంతరాలు, ఆర్ధిక అసమానతలు, వెనుకబాటుతనం వల్లే యువతలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. వీటిపై గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ప్రాణనష్టం జరిగింది. కొత్త రాష్ట్రంలో ఈ పరిస్థితి మారాలి. పేదరికం అనుభవిస్తున్న బలహీన వర్గాలకు ప్రభుత్వ తోడ్పాటు అందాలి. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. రిజర్వేషన్ల పెంపుకు త్రికరణ శుధ్దితో పని చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల పెంపు కోర్టు వివాదాల్లో చిక్కుకోకుండా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా ప్రక్రియను నిర్వహించాలి’’ అని విస్పష్టంగా సూచించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం అందరికీ ఒకే న్యాయం ఉండాలని, అన్ని రాష్ట్రాలకూ ఒకే చట్టం అమలు కావా లని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘తమిళనాడులో అక్కడి బలహీనవర్గాలకు జనాభాకు అనుగుణంగా 69 శాతం రిజర్వే షన్లు అమలవుతున్నాయి. మిగతా రాష్ట్రా ల్లో మాత్రం 50 శాతం మించకుండా కోర్టు తీర్పులున్నాయి. మన రాష్ట్రంలోనూ రిజర్వే షన్లు పెంచి తీరాలి. ముందుగా ముస్లింలు, ఎస్టీలు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందాలి. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం. తమిళనాడులో అనుసరించాల్సిన వ్యూహం, రిజర్వేషన్లు పెంపు నేపథ్యంపై అధ్యయనానికి అధికారుల బృందం త్వర లో చెన్నై వెళ్లి రావాలి. అవసరమైతే నేను కూడా వెళ్లి సంబంధిత అధికారులు, న్యా య నిపుణులతో చర్చిస్తా. మనం రిజ ర్వేషన్లను పెంచడం, కోర్టు దాన్ని రద్దు చేయడం జరగకూడదు. పెంచిన రిజర్వేష న్లు అమలయ్యేలా మన విధానం ఉండాలి’’ అని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలయిందని, కానీ తెలంగా ణలో ఎస్టీల జనాభా 9 శాతానికి పైగా ఉం దని ఆయన తెలిపారు. రాజ్యాగం ప్రకారం ఎస్టీలకు సైతం జనాభా ఆధారంగా రిజర్వే షన్లు అమలు కావాల్సి ఉందన్నారు. -
త్వరలో అటవీశాఖలో పోస్టుల భర్తీ
హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి జిల్లాలో 1.80 కోట్ల మొక్కలు పెంచేందుకు చర్యలు రివ్యూ సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న ఖమ్మం: త్వరలో అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర అటవీ, వెనుకబడిన తిరుగతుల శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా అటవీశాఖ కార్యాలయంలో అటవీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంలో అధికారుల తమ వంతు బాధ్యతగా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితులున్న ప్రాంతంలో మొక్కల సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. కొత్తగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అటవీశాఖలో రేంజ్ ఆఫీసర్ స్థాయి, ఇతర అధికారుల సంఖ్యను పెంచడం జరిగిందని, కార్యాలయాల వసతి, పోస్టుల ఖాళీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అటవీశాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 3 కోట్ల 88 లక్షల మొక్కలను నాటామని, వీటిలో 90 శాతం వరకు మొక్కలను సంరక్షించుకున్నామని అన్నారు. వర్షాభావ పరిస్థితులున్న తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో 80 శాతం వరకు మొక్కలు సంరక్షించడం జరిగిందన్నారు. నర్సరీలలో మొక్కలు పెంచే ప్రణాళికలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో కోటీ 80 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందుకుగాను 2 కోట్ల మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. -
హైదరాబాద్‌లో సైన్స్ సిటీ
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా 5-డీ థియేటర్లు తదితరాల ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతికశాఖల మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు, పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, రాకెట్ మోడల్స్, పవన, జీవశక్తి, భూగోళశాస్త్ర వివరాలను పొందపరచనున్నట్లు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో సైన్స్ సెంటర్లు, ప్రజోపయోగకరమైన పరిశోధన, సైంటిస్టులు, అధ్యాపకులు, రిసెర్చీ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ శాస్త్ర, సాంకేతిక శాఖ వెబ్‌సెట్, లోగోను ఆవిష్కరించారు. ఈ శాఖ సభ్యకార్యదర్శి వై.నగేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.160 కోట్లు కాగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.66 కోట్లు, హెచ్ఎండీఏ రూ.40 కోట్ల వరకు భరించనుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్,పబ్లిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, పర్యాటక, సాంస్కృతిక శాఖల ద్వారా ఈ సైన్స్ సిటీ ఏర్పాటునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2014లో రంగారెడ్డి జిల్లాలోన బుద్వేల్ సమీపంలో సుమారు 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం తమ ప్రభుత్వం వచ్చాక వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సాంకేతికపరంగా చోటుచేసుకునే మార్పుచేర్పులకు సంబంధించిన అంశాలు, శాస్త్ర, సాంకేతిక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, వర్క్‌షాపు వివరాలు తదితర అంశాలను www.tscost.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలియజేశారు. కొత్త పరిశోధనలు.. ఈ శాఖ ద్వారా కొమరం భీమ్ జిల్లా కెరమెరి మండలం ఎగువప్రాంతాల్లో ఆపిల్, మల్బరీ సాగుకు గల అవకాశాలపై సీసీఎంబీ సహకారంతో పరిశీలన, ఆముదం పంటకు వచ్చే గ్రేమోల్డ్ రోగ నివారణ పద్ధతులను రూపొందించడంపై మహబూబ్‌నగర్ జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చీ ద్వారా వర్షపు నీటి వినియోగించి ఫ్లోరైడ్ సమస్యను తగ్గించేందుకు నల్లగొండ జిల్లాలో జేఎన్టీయూ, సెంటర్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పరిశోధనలు, రైతులు, వినియోగదారుల ప్రయోజనార్దం తృణ ధాన్యాల నిల్వ కాలాన్ని పెంపొందించడంపై ఓయూ, ఇక్రిశాట్ల సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు జోగురామన్న తెలిపారు. -
మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలి
కబ్జా భూములు తేల్చేందుకు కమిటీ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష ఆదిలాబాద్ అర్బన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఇందుకు అధికారులందరూ సహకరించాలని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కోరారు. రానున్న రెండున్నరేళ్లలో మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీశ అధ్యక్షతన ఆదిలాబాద్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోగల లీజ్ ల్యాండ్స్, కబ్జాకు గురైన స్థలాలు, భూములు, కోర్టు కేసులతో పెండింగ్‌లో భూముల వివరాలు సేకరించేందుకు ఒక కమిటీ వేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి జేసీ సుందర్ అబ్నార్‌తో చర్చించారు. ముందుగా కార్యాలయం రికార్డ్సు ఉన్నాయా.. రికార్డులో ఉన్నది.. క్షేత్రస్థాయిలో ఉందా లేదా.. అనేది పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం ల్యాండ్ ఉందా.. కబ్జాకు గురైందా.. ఎంత మేరకు ఉంది.. అనే వివరాలు అధికారుల వద్ద ఉంచుకోవాలన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాలు ఏవి.. ఎంత మేరకు చర్యలు తీసుకున్నారో మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌కు సంబంధించిన ఆస్తులు, ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు పన్ను చెల్లించడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పన్ను చెల్లించని కార్యాలయాలకు తాళాలు వేస్తే డబ్బులు అవే వస్తాయన్నారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్సీ కార్పొరేషన్, అటవీ శాఖ, రోడ్డు భవనాల శాఖ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ మున్సిపల్‌కు ఆదాయం గతేడాది రూ.9 కోట్లు కాగా, నెలకు రూ.65 లక్షల ఖర్చు ఉందని, ఇందులో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరాత్ర ఉన్నాయని వివరించారు. అధికారులు పనులపై దృష్టి పెడితే తప్పక ముందుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో జేసీ సుందర్‌అబ్నార్, మున్సిపల్ కమిషనర్ అలివేలు మంగతయారు, అధికారులు జగదీశ్వర్‌గౌడ్, అయాజ్, సాయికిరణ్, భాస్కర్‌రావు, సుమలత, అనురాధ, ప్రియాంక, శోభ, మమత, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. -
6 రోజుల్లో 5.5 కోట్ల మొక్కలు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమంగా సాగుతున్న హరితహారం - ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 71 లక్షల మొక్కలు నాటిన ప్రజలు - ఏరోజుకారోజు సమీక్షిస్తున్న సీఎస్... సీఎంకు నివేదిక సాక్షి, హైదరాబాద్ : ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమస్ఫూర్తితో సాగుతోంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపునకు స్పందించి స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, యాజమాన్యాలు, ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ నెల 8న కార్యక్రమం మొదలైనప్పటి నుంచి 12వ తేదీ (మంగళవారం) వరకు ప్రజలు 4.42 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారిక లెక్కలు విడుదలవగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా మొక్కలను నాటినట్లు అంచనా. అడవుల జిల్లాలోనే అత్యధికంగా... అటవీశాఖ మంత్రి జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి అత్యధికంగా 61.54 లక్షల మొక్కలను నాటారు. బుధవారం మరో పది లక్షల మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. అలాగే నిజామాబాద్ జిల్లాలో 50.84 లక్షల మొక్కలు రంగారెడ్డి జిల్లా పరిధిలో మంగళవారం నాటికి 2.65 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీలో 19.36 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో 2.55 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో హరితహారం లక్ష్యాల మేరకు సాగడం లేదు. కరీంనగర్, వరంగల్. ఖమ్మం జిల్లాల్లో గత మూడు రోజులుగా ఆశించిన స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ‘తెలంగాణకు హరితహారం’లో ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటి కొత్త రికార్డు సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాల్లో హరితహారం సాగుతున్న తీరుపై ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ ఏరోజుకారోజు కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని పర్యవేక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. -
మొక్క నాటితే రూ. 5 ప్రోత్సాహకం
- కనీసం 50 మొక్కలు, అంతకన్నా ఎక్కువ నాటిన వారికే ఇది వర్తింపు - వార్డులు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు సైతం ప్రోత్సాహకాలు - ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు 5 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 50 మొక్కలు, అంతక ంటే ఎక్కువ సంఖ్యలో నాటే వ్యక్తులు, సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. రెండో విడత హరితహారం కార్యక్రమం రేపటి (జూలై 8వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి జోగు రామన్న ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంలా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈసారి 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధిస్తామని చెప్పారు. ఇందులో భాగంగానే ప్రజలను, సంస్థలను భాగస్వాములను చేసేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు వివరించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి ప్రోత్సహించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజలందరినీ హరితహారంలో పాల్గొనేలా చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. మొక్కలు నాటే పౌరులతో పాటు యువజన, ప్రజా సంఘాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అవార్డుల ద్వారా మొక్కలు నాటే వారిని ప్రోత్సహించడమే గాకుండా, లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మునిసిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమంతో పాటు వాటి సంరక్షణకూ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలు సిద్ధం హరితహారం కోసం రాష్ట్రంలోని 4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. వీటిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 27.12 కోట్ల మొక్కలు, ఇతర శాఖల ద్వారా 19.17 కోట్ల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయన్నారు. వీటిలో అటవీ శాఖ ద్వారా 7.96 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో 33.88 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. మిగతా 5 కోట్లకు పైగా మొక్కలను అవసరమైన వారికి అందిస్తామన్నారు. నల్లగొండలో 8న సీఎంతో ప్రారంభం వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఈసారి హరితహారాన్ని ఉద్యమంగా చేపట్టనున్నట్లు మంత్రి రామన్న వివరించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభ మవుతుందన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా వీరు తీసుకోవాలన్నారు. -
అవకాశాలు కోల్పోతున్న రాష్ట్ర విద్యార్థులు
♦ కేంద్ర ఓబీసీ జాబితాలో 26 రాష్ట్ర బీసీ కులాలను చేర్చకపోవడంతో తీరని నష్టం ♦ ఇప్పటికే సిఫార్సులను కేంద్రానికి పంపామన్న బీసీ కమిషన్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం, జాతీయ బీసీ కమిషన్ నుంచి సత్వర ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో విలువైన అవకాశాలను కోల్పోతున్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 బీసీ కులాలను చేర్చకపోవడంతో ఈ వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు, ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ రంగాల పోటీ పరీక్షలకు హాజర య్యేందుకు, ఐఐటీ, ఇతర కోర్సుల్లో సీట్లు పొందడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలో బీసీలుగా ఉన్నా కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంతో జనరల్ కేటగిరిలోనే ఈ విద్యార్థులు పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ఆయా సంఘాలు, వ్యక్తుల నుంచి బీసీ కమిషన్ అభిప్రాయాలను, వినతిపత్రాలను స్వీకరించింది. అయితే ఏడాది దాటినా దానిపై ఏ నిర్ణయం వెలువడక పోవడంతో ఈ వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర జాబితాలో తెలంగాణ ఓబీసీలను చేర్చాలని, ఈ 26 కులాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని గత అక్టోబర్‌లోనే జాతీయ బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, మళ్లీ మరో లేఖ రాస్తామని ఇటీవలే బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న విలేకరులకు తెలిపారు. ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపాం ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధం గా రెండేళ్ల వరకు ఏపీ జాబితాలో పొందుపరిచి న ఓబీసీ తెలంగాణకూ వర్తిస్తుంది. యూపీఎస్సీ, ఇతర పరీక్షలన్నిం టికీ అర్హత ఉంటుంది. తెలంగాణ బీసీ కులాలకు సంబంధించి విడిగా ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపించాం. బీసీ కమిషన్ పరిశీలన మేరకు ఆయా అంశాల ప్రాతిపదికన ఏయే కులాలను కలపాలి, వేటిని తీసేయాలి అన్న దానిపై సిఫార్సులు చేశాం. అయితే వాటిని బయటపెట్టలేను. దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి.’’ - బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య -
పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న
దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.300 కోట్లతో 58,820 మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇతరత్రా సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరిచూడనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బీసీల కల్యాణలక్ష్మి వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్లో http://epasswebsite.cgg.gov వెబ్సైట్ ద్వారా ఆయాపత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత నెల 1వ(ఏప్రిల్) తేదీ తర్వాత వివాహం చేసుకున్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను తెలిపారు. రాష్ట్రానికి చెందిన 32 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గత అక్టోబర్‌లోనే బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, ఈ విషయమై మరోసారి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల లోగోను మంత్రి ఆవిష్కరించారు.