ఆదిలాబాద్: దేశ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు అవసరమని, అందుకు ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ, బీసీ శాఖమంత్రి జోగురామన్న ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని పేర్కొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో ఇప్పటికి గ్రామాల్లో కరెంటు, తాగు, సాగునీరు అందకపోవడం శోచనీయమని తెలిపారు.
దేశంలో ఎన్నో జీవ నదులున్నా జాతీయ పార్టీలు అధికారంలో ఉండి సద్వినియోగం చేసుకోలేకపోయాయని, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని కేసీఆర్ చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమేనని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
సాగు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రవాణా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధించామని గుర్తు చేశారు. దేశ రాజకీయాలను సైతం మార్చగల శక్తి కేసీఆర్‌కు ఉందని, సీఎం ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కేసీఆర్ వెంట తాము ఎల్లవేళలా ఉంటామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment