
సాక్షి, హైదరాబాద్: బీసీల ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ నెల 15న అమల్లోకి రానున్న ప్రత్యేక రాయితీ పథకం ప్రారంభానికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది లబ్ధిదారులకు రాయితీ పథకం లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేశామన్నారు. నిధులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాతాలో జమ చేసినట్లు తెలి పారు. రుణాల కోసం దళారులను ఆశ్రయించవద్దని ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ, డీఆర్‌డీవో పీడీలు సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్‌గా ఉన్న కమిటీ ద్వారా ఎంపిక చేస్తుందని చెప్పారు.