అవకాశాలు కోల్పోతున్న రాష్ట్ర విద్యార్థులు
♦ కేంద్ర ఓబీసీ జాబితాలో 26 రాష్ట్ర బీసీ కులాలను చేర్చకపోవడంతో తీరని నష్టం
♦ ఇప్పటికే సిఫార్సులను కేంద్రానికి పంపామన్న బీసీ కమిషన్ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం, జాతీయ బీసీ కమిషన్ నుంచి సత్వర ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో విలువైన అవకాశాలను కోల్పోతున్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 బీసీ కులాలను చేర్చకపోవడంతో ఈ వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు, ఎల్‌ఐసీ, ఇతర ప్రభుత్వ రంగాల పోటీ పరీక్షలకు హాజర య్యేందుకు, ఐఐటీ, ఇతర కోర్సుల్లో సీట్లు పొందడానికి ఇది అడ్డంకిగా మారుతోంది.
రాష్ట్రంలో బీసీలుగా ఉన్నా కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంతో జనరల్ కేటగిరిలోనే ఈ విద్యార్థులు పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ఆయా సంఘాలు, వ్యక్తుల నుంచి బీసీ కమిషన్ అభిప్రాయాలను, వినతిపత్రాలను స్వీకరించింది. అయితే ఏడాది దాటినా దానిపై ఏ నిర్ణయం వెలువడక పోవడంతో ఈ వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర జాబితాలో తెలంగాణ ఓబీసీలను చేర్చాలని, ఈ 26 కులాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని గత అక్టోబర్‌లోనే జాతీయ బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, మళ్లీ మరో లేఖ రాస్తామని ఇటీవలే బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న విలేకరులకు తెలిపారు.
ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపాం
‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధం గా రెండేళ్ల వరకు ఏపీ జాబితాలో పొందుపరిచి న ఓబీసీ తెలంగాణకూ వర్తిస్తుంది. యూపీఎస్‌సీ, ఇతర పరీక్షలన్నిం టికీ అర్హత ఉంటుంది. తెలంగాణ బీసీ కులాలకు సంబంధించి విడిగా ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపించాం. బీసీ కమిషన్ పరిశీలన మేరకు ఆయా అంశాల ప్రాతిపదికన ఏయే కులాలను కలపాలి, వేటిని తీసేయాలి అన్న దానిపై సిఫార్సులు చేశాం. అయితే వాటిని బయటపెట్టలేను. దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి.’’
- బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య