రాష్ట్ర ప్రభుత్వ యోచన..న్యాయశాఖ పరిశీలనకు ఫైల్
సాక్షి, హైదరాబాద్: సమాజంలో తిరస్కారానికి, ఏహ్యభావానికిగురవుతున్న హిజ్రాలను బీసీ జాబితాలో చేర్చే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సంతకం చేశారు. న్యాయపరమైన అంశాలు, ఇతర అంశాల పరిశీలనకు న్యాయ శాఖకు ఈ ఫైల్‌ను పంపించినట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం హిజ్రాలను బీసీ జాబితాలో చేర్చి గుర్తింపు కార్డులు, ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. ఈ విషయంలో త మిళనాడు మోడల్‌ను అనుసరించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తమిళనాడులో హిజ్రాలను(తిరునంగై/ఆరావని) అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చుతూ ఆ రాష్ట్ర బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదించి, అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హిజ్రాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులుగా గుర్తించి విద్యాసంస్థల్లో ప్రవేశం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో అన్నిరకాల రిజర్వేషన్లను కల్పించాలని 2014 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుకు అనుగుణంగా బీసీ కమిషన్ ఇచ్చిన నివేదికపై తమిళనాడు ప్రభుత్వం హిజ్రాలను ఎంబీసీలుగా చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్, సైకాలజిస్ట్, సెక్సాలిజిస్ట్, పోలీసు అధికారి తదితరులతో కూడిన కమిటీకి హిజ్రాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీ పరిశీలనలో హిజ్రాలుగా తేలిన వారికి ఒక గుర్తింపుకార్డును జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా వారికి ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు, రేషన్ కార్డులను అందజేస్తున్నారు. తెలంగాణలో కూడా ఇటువంటి విధానాన్నే అనుసరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడి జీవోలు, బీసీ కమిషన్ నివేదిక, హిజ్రాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయిస్తోంది.
అనాథలకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు..
రాష్ట్రంలో అనాథలను బీసీల్లో చేర్చుతూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్నా.. అది ఆచరణలో సరిగ్గా ముందుకు సాగకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనాథలకు ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడంలో ఇబ్బందులు, దీనికి సంబంధించి విడిగా ఒక నమూనాను రూపొందించాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో సమస్యలు రాకుండా ఆ ప్రక్రియ సరళంగా పూర్తయ్యేలా చూడాలని భావిస్తోంది. అనాథ శరణాలయాలు, ఇతరత్రా గుర్తింపు పొందిన సంస్థలిచ్చే పత్రాలకు తగిన గుర్తింపునిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. తమిళనాడులో గతంలోనే అనాథలను బీసీ జాబితాలో చేర్చడంతో పాటు వారికి ఆయా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి విధానాన్ని అనుసరించే ఆలోచనలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనాథలు, హిజ్రాలకు సంబంధించి తమిళనాడు అనుసరిస్తున్న మోడల్‌ను ఇటీవల బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ చెన్నై వెళ్లి పరిశీలించి వచ్చారు.
బీసీ జాబితాలోకి ‘హిజ్రాలు’!
Published Thu, Dec 17 2015 12:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement