బీఎస్ రాములు అధ్యక్షతన బీసీ కమిషన్
సభ్యులుగా వకుళాభరణం, ఆంజనేయగౌడ్, గౌరీశంకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లో వెనుకబడిన వర్గాల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై అధ్యయనం కోసం ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములు చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయగౌడ్, ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్ ఇందులో సభ్యులు. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ సభ్యకార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కమిషన్ పదవీ కాలా న్ని మూడేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం అనంతరం బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో అత్యవసరంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయా ల్సిన పరిస్థితులుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
కమిషన్ విధులివి: బీసీల జాబితాలో కొత్త కులాలు, వర్గాలు చేర్పుల అభ్యర్థనలు, తొల గింపులపై ఫిర్యాదులను కమిషన్ పరిశీలించి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. బీసీలకు సంబంధించి ఇతర అంశంపై పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.
అధికారాలివి..: సివిల్ కోర్టుకు ఉండే పలు ప్రత్యేకాధికారాలు బీసీ కమిషన్‌కు ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా వ్యక్తుల హాజ రును కోరుతూ సమన్ల జారీకి, ఏదైన డాక్యుమెంట్‌ను కోరడానికి, అఫిడవిట్ల రూపంలో సాక్ష్యాల స్వీకరణకు, ఏదైన కోర్టు నుంచి పబ్లిక్ రికార్డుకు సంబంధించినకాపీని కోరడానికి, సాక్షుల, డాక్యుమెంట్లు పరిశీలించే అధికారాలు కమిషన్‌కు ఉంటాయని తెలిపింది.
ఇప్పుడెందుకు..?: నిబంధన ప్రకారం మూడేళ్లకోసారి బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పదేళ్లకోసారి బీసీల జాబితాపై సమీక్ష జరపాలి. చివరిసారిగా, ఉమ్మడి రాష్ట్రంలో సుబ్రమణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బీసీ కమిషన్ గడువు 2011 సెప్టెంబర్‌తో ముగిసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 26 బీసీ కులాలు ఇక్కడి రాష్ట్రంలో లేవని బీసీ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించడంపై వివాదం రేకెత్తించింది. వీటిని మళ్లీ జాబితాలో చేర్చడం, ఇతర కొత్త డిమాండ్లపై పరి శీలన కోసం ఈ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. బీసీ-ఈ కేటగిరీలో ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచే అంశంపై కమిషన్ సిఫారసులు కీలకం కానున్నాయి.
బీసీ కమిషన్ వద్దు: బీసీ సంక్షేమ సంఘం
సాక్షి, హైదరాబాద్: బీసీ కమిషన్‌పై టీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నరేందర్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ న్యాయమూర్తితో ఏర్పాటు చేయాల్సిన కమీషన్‌ను సామాజిక ఉద్యమకారులతో ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులకు గతంలోనే విన్నవించినా పట్టించుకోలేదన్నారు.
బీఎస్ రాములు, చైర్మన్: ప్రసిద్ధ రచయిత, బహుగ్రంథ కర్త. ప్రస్తుతం జగిత్యాల జిల్లావాసి. పద్మశాలి సామాజికవర్గం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు.
డాక్టర్ వి.కృష్ణమోహన్‌రావు, సభ్యులు: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌వాస్తవ్యులు. దాసరి సామాజికవర్గం. ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు 2004-09 వరకు బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు. ఓయూ నుంచి ఎంఏ(తెలుగు) పీహెచ్‌డీ చేశారు.
డాక్టర్ ఈడిగ ఆంజనేయగౌడ్, సభ్యులు: జోగుళాంబ గద్వాల జిల్లా వాసి. విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. ఓయూ నుంచి న్యాయ శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు.