సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన కులాల లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెలలో సుమారు 20 రోజుల పాటు విస్తృతంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. అవసరమైతే మరో పది రోజులు పొడిగించి అయినా సమగ్రంగా అధ్యయనం చేయాలని భావిస్తోంది. వెనుకబడిన కులాల రిజర్వేషన్ల మార్పు ప్రక్రియలో దీనితో మరో అడుగు ముందుకు పడుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
బీసీ కమిషన్ ఆధ్వర్యంలో..
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే బీసీ కమిషన్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కమిషన్ ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి బీసీల శాతంపై పరిశీలన పూర్తి చేసింది. మరోవైపు ప్రభుత్వం దీనిపై క్షేత్రస్థాయి పరిశీలనకు సన్నద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇంటింటి సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. సంక్రాంతి సెలవులు ఉండడంతో.. ఆ సమయంలో సర్వే నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశంతో ఉంది. ఈ మేరకు సర్వే ఫార్మాట్‌లను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. వరుసగా ఇరవై రోజుల పాటు సర్వే నిర్వహించాలని.. అవసరమైతే మరో 10 రోజులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కర్ణాటక తరహాలో: ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై సమగ్ర అధ్యయనం చేసింది. ఆ సర్వే మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. ఆ సర్వే నిర్వహణ తీరును రాష్ట్ర బీసీ కమిషన్ పరిశీలించింది. దాదాపు వారం రోజుల పాటు కర్ణాటక ప్రభుత్వం, ఆ రాష్ట్ర బీసీ కమిషన్‌తో చర్చించింది. అదే తరహాలో రాష్ట్రంలో అధ్యయనం నిర్వహించేలా పక్కా ప్రణాళికను రూపొందించింది. దీనిపై కార్యచరణను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సర్వే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఎంబీసీల లెక్కపై ప్రత్యేక దృష్టి
బీసీ కులాల సర్వేతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే కులాల జాబితా సైతం తేలనుంది. దీంతో ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.వెయ్యి కోట్ల నిధుల వినియోగంపై సర్కారుకు స్పష్టత వచ్చే అవకాశముంది. వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం యూనిట్‌గా తీసుకుని ఈ సర్వే నిర్వహించనున్నారు. దీనివల్ల కుటుంబాల స్థితి వివరాలూ వెల్లడవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక నకిలీలకు తావులేకుండా ఆధార్ నంబర్‌ను కూడా నమోదు చేస్తారు.
రెవెన్యూ యంత్రాంగమే కీలకం
బీసీ సర్వే నిర్వహణలో రెవెన్యూ యంత్రాంగానిదే కీలక పాత్ర కానుంది. వాస్తవానికి బీసీ కులాల సర్వేను రెండు నెలల క్రితమే నిర్వహించాలని సర్కారు భావించింది. కానీ భూప్రక్షాళన ప్రక్రియ నడుస్తుండడంతో తాత్కాలికంగా వాయిదా వేసింది. భూప్రక్షాళన ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ప్రభుత్వం వచ్చే నెలలో సర్వే నిర్వహణకు బీసీ కమిషన్‌కు అనుమతినిచ్చే అవకాశముంది.
రూ.150 కోట్లు ఖర్చు!
దాదాపు నెల రోజుల పాటు జరిగే బీసీ కులాల సర్వే ప్రక్రియలో రెవెన్యూ శాఖతోపాటు పలు ఇతర శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉండే ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తే సర్వే సులభతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే బడివేళల్లో ఉపాధ్యాయులను వినియోగించుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దీంతోసర్వే నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం కానుంది. ఇక సర్వే సమయంలో ఉద్యోగులకు టీఏ, డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. కర్ణాటకలో సర్వే కోసం రూ.170 కోట్లు ఖర్చు చేశారు. రాష్ట్రంలో జనాభా కొంత తక్కువగా ఉన్న నేపథ్యంలో.. రూ.150 కోట్ల వరకు నిధులు అవసరమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment