2 వేల ఎకరాలు మాజీ సీఎస్ రాయించుకున్నారన్నారు
ఇక్కడ రిజిస్టర్ అయ్యింది 133 ఎకరాలు మాత్రమే
వాటిలో మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయం ఉందని చెప్పలేం
20 ఏళ్లు దాటిన డి పట్టా భూముల్ని ఎవరైనా కొనొచ్చు
మీడియాతో రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఆర్‌పీ సిసోడియా
జిల్లాలో భూముల పరిశీలన.. అధికారులతో సమీక్ష
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో భూ అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు చేస్తున్న దు్రష్పచారానికి తెరపడినట్లే. భూ అక్రమాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా.. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్‌తో కలిసి శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూ అక్రమాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని చెప్పారు.
మాజీ సీఎస్ జవహర్‌రెడ్డి, ఆయన కుమారుడు దాదాపు 2 వేల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను బెదిరించి రాయించుకున్నారనే ప్రచారంపైనా పరిశీలించామని చెప్పారు. అయితే, జిల్లాలో 2,600 ఎకరాలు ప్రీహోల్డ్‌కు అవకాశం ఉండగా, వాటిలో 626 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేసి 22ఎ నుంచి తీసివేశారని తెలిపారు. ఇందులో 4 మండలాల పరిధిలోని 133 ఎకరాలు మాత్రమే కొత్త వారి పేరుతో రిజి్రస్టేషన్ జరిగిందని చెప్పారు. ఇందులో మాజీ సీఎస్‌కు ప్రమేయం ఉందని చెప్పలేమని స్పష్టం చేశారు.
చట్టం ప్రకారం 20 ఏళ్లు దాటిన డి పట్టా భూములను ఎవరైనా కొనొచ్చని తెలిపారు. జిల్లాలో అసైన్డ్, డి పట్టా భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజి్రస్టేషన్ వంటివి ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. త్వరలో జీవీఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నగరం విస్తరించడం, భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల విశాఖలో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఏడాది క్రితం వరకు లేఅవుట్లకు అనుమతి ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తెలిసేది కాదని, నూతన విధానం వల్ల ఆ సమస్య పరిష్కారమైందని చెప్పారు.
ఎర్రమట్టి దిబ్బల్లో అనుమతులివ్వలేదు
ఎర్రమట్టి దిబ్బల్లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులివ్వలేదని తెలిపారు. అక్కడ కొంత భూమిని చదును చేస్తుండగా, జిల్లా యంత్రాంగం నిలిపేసిందని తెలిపారు. దసపల్లా ఎస్టేట్ భూములపై కోర్టు కేసులున్నాయన్నారు. 60 ఎకరాల్లో 14.5 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఎ లో పెట్టారని, మిగతా భూమిని ఏ విధంగా పరిష్కరించాలో మార్గాలను వెదుకుతున్నామని అన్నారు.
ఎస్టేట్ భూములపై సెటిల్‌మెంట్ ఆఫీసర్ ల్యాండ్ రెంట్ పట్టా ఇవ్వడాన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ మ్యాప్ తయారుచేసి, ప్రభుత్వ, ప్రభుత్వేతర భూములను, రోడ్లు, పార్కులు వంటివి రంగులతో చూపుతామని, దీనివల్ల ఆక్రమణలకు ఆస్కారం ఉండదని తెలిపారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ కార్యాలయంలో భూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment