ముస్లిం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం లేదు
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన ముస్లిం కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచితే బీసీ సామాజిక వర్గాల రిజర్వేషన్లలో ఎలాంటి ఇబ్బందులుండవని రాష్ట్రబీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ వల్ల బీసీ సామాజిక వర్గాలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ల శాతంలో ఎలాంటి మార్పులుండవని తెలిపారు. వెనుకబడిన ముస్లిం కులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల పెంపుపై బీసీ కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, జి.సుధీర్ నేతృత్వంలోని అధ్యయన కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు పంపిందని, ఈమేరకు తగు సిఫార్సులు చేయాలని ప్రభుత్వం సూచించి నందున ప్రజాభిప్రాయ నిమిత్తం బహిరంగ విచారణ చేపట్టినట్లు చెప్పారు.
విచారణ ఈ నెల 17 వరకు కొనసాగుతందని, 18, 19 తేదీల్లో న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, విశ్వ విద్యాలయ ఆచార్యులు, ప్రముఖులను ఆహ్వానించి మరింత సమాచారాన్ని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 12 సంఘాలకు చెందిన ప్రతినిధులు కమిషన్ ఎదుట హాజరై ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమద్ ఇఫ్తకా రుద్ధీన్ అహ్మద్.. రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించారు. బహిరంగ విచారణ 15, 16, 17 తేదీల్లో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుందని కమిషన్ తెలిపింది. ఈనెల 19 లోపు లిఖిత పూర్వక పత్రాలు, ఆన్‌లైన్, పోస్టు ద్వారా వాదనలు తెలియ జేయవచ్చని సూచించింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయులు గౌడ్, జూలూరు గౌరీశంకర్, సభ్య కార్యదర్శి జీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు.