కుంభమేళా.. పనులెలా..!
•పుష్కరాలకు అరకొర నిధులే..
•మిగిలింది నాలుగు నెలలే..
•సకాలంలో పనులు పూర్తయ్యేదెలా..!
•ఇప్పటికీ విడుదల కాని నిధులు
•ప్రతిపాదనలకే పరిమితం
మరో నాలుగు నెలల సమయం.. చేయాల్సిన పనులెన్నో.. చేసింది ఏమీ లేదు.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఇదీ జిల్లాలో గోదావరి పుష్కరాల పరిస్థితి. 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కరాలకు సమయం దగ్గరపడుతున్నా ఎక్కడా ఏర్పాట్లు కానరావడం లేదు. ఈసారి స్వరాష్ట్రంలో కుంభమేళా తరహాలో ఘనంగా పుష్కరాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా ఇంతవరకు నిధుల విడుదలే లేదు. ఇంకా నిధులపై తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం తరఫున కొద్దోగొప్పో నిధులు మంజూరు చేసినా.. కేంద్రం నిధుల కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి పనులు పూర్తయ్యేనా..!
భక్తులకు ఈసారీ ఇబ్బందులు తప్పవా..!
భైంసా : ఈ ఏడాది జూలై 15 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. గడువు సమీపిస్తున్నా ఏర్పాట్లు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో జరగబోయే పనులపై తీవ్ర ప్రభా వం చూపే అవకాశం ఉంది. నాలుగు నెలల గడువులో ప్రతిపాదనల ఆమోదం, నిధుల విడుదలపై స్పష్టమైన ఆదేశాలు వెలువడడంలేదు. తీవ్ర జాప్యం చేస్తూ అటుతర్వాత నిధులు విడుదల చేసినా గడువులోగా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. గోదావరి నదితీరానా పుష్కర ప్రాంతాల వద్ద తాగునీరు, రహాదారులు, స్నానఘట్టాల నిర్మాణం, షెడ్ల నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటికీ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.
నాలుగు నెలలు గడిచింది..
గోదావరి పుష్కరాల విజయవంతానికి తొలి అడుగు వేస్తూ చదువుల తల్లి కొలువైన బాసరలో 2014 సెప్టెంబర్ 16న పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి జోగు రామన్న అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం జరిగి నాలుగు నెలల 22 రోజులు గడిచిపోయింది. నాటి సమీక్షలో కలెక్టర్ జగన్‌మోహన్‌తోపాటు ఆయా శాఖల అధికారులు జిల్లాలో పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల నిధులతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దేవాదాయ, రహదారులు, భవనాలు, పోలీసు, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్టీసీ, రెవెన్యూ, పర్యాటక, ఇరిగేషన్ శాఖల అధికారులు వేర్వేరుగా ప్రతిపాదనలు పంపించారు. రహదారుల అభివృద్ధికి రూ.150 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. భారీ ప్రతిపాదనలు సిద్ధ ంచేసిన అధికారులు పనులు చేపట్టే విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు.
బాసరకు రూ.2 కోట్లు...
ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడం దేవాదాయ శాఖ అల్లోలకే కేటాయించడం జరిగింది. ఐకే రెడ్డి హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులు సహచర మంత్రులతో పుష్కర ఏర్పాట్లపై సమావేశం నిర్వహిం చారు. పుష్కరాలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్ర బడ్జెట్‌లో పుష్కర మహోత్సవానికి రూ.100 కో ట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. పుష్కరాల విజయవంతానికి రూ.200 కోట్లు అవసరమని జిల్లా అధికారులు ప్రతిపాదించారు.
బాసర క్షేత్రానికి రూ.100 కోట్లు అవసరమని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణలో బాసరలోనే అత్యధికంగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. జిల్లాలో గోదావరి పరివాహాక ప్రాంతాల్లోని ఎనిమిది చోట్ల దేవాలయాల అభివృద్ధికి రూ.4.28 కోట్లు అవసరమవుతాయని ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి బాసరకు రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ప్రకటించారు.
రెండు నెలల వరకు కేంద్రం నిధులు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. మిగిలిన రెండు నెలల్లో పుష్కర పనులు పూర్తవుతాయన్న సందేహాలు వెల్లడవుతున్నాయి. దీనిపై బాసర ఆలయ ఈవో ముత్యాలరావు స్పందిస్తూ.. త్వరలోనే పుష్కర ఏర్పాట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. అత్యవసర పనులను గుర్తించి టెండర్లు నిర్వహిస్తామన్నారు.
ఇవి నిర్మించాలి..
దేశంలోనే రెండో సరస్వతీ అమ్మవారు కొలువుదీరిన క్షేత్రంగా బాసరకు పేరుంది. పక్కనే గోదావరి నది ప్రవహిస్తోంది. పుష్కరాల్లో ప్రధానంగా ఇక్కడికే భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడి స్నానఘట్టాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. రెండు చోట్ల స్నానఘట్టాలు ఉన్నా.. గోదావరి ఎండిపోవడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీళ్లులేవు.
•స్నానఘట్టాల ఆధునికీకరణ పనలపై అధికారులు దృష్టిపెట్టాలి.
•గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయాన్ని ఆనుకుని షెడ్లను నిర్మించాలి.
•భక్తులు దుస్తువులు మార్చుకునేందుకు ప్రత్యేక గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలి.
•నిర్మల్ మండలం సోన్ గోదావరి పుష్కరఘాట్‌కు వెళ్లే రహదారి.. బ్రహ్మేశ్వర ఆలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది.
•గూడెం గోదావరి వద్ద స్నానఘట్టాలు నిర్మించాలి.
•సోన్‌లో స్నానఘట్టాల వద్ద అంతగా సౌకర్యాలు లేవు.
•జిల్లాలో ఎనిమిదిప్రాంతాల్లో జరగబోయే పు ష్కరాల కోసం గోదావరి నది వద్ద భారీకేడ్లు, స్నానపుగదులు, మరుగుదొడ్లు అత్యవసరం.
•పుష్కరాల్లో పిండప్రదాన మండపాలు, కేశఖండనశాలలు నిర్మించాలి.
•భక్తుల కోసం అక్కడే తాగునీటి సౌకర్యం కల్పించాలి.
•వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అనువుగా నదిలో జారిపోకుండా దిగేందుకు, ఎక్కేందు కు సౌకర్యంగా ఉండేలా ఇంజనీయర్ల సూచనలతో మెట్లు నిర్మించాలి.
•విద్యుత్ సౌకర్యం కల్పించాలి. తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలి.
•భక్తులకు వసతి, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలి.