కేంద్రం నిధులు ఏమయ్యాయి..?
Published Wed, Sep 21 2016 9:42 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–కలెక్టర్ కాటంనేని భాస్కర్
ఏలూరు (మెట్రో): జిల్లాలో రైతులకు ఎరువులు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.100 కోట్లు ఏమయ్యాయని, ఎరువుల కంపెనీలు ఆ సొమ్ములు ఏం చేశాయని కలెక్టర్ కె.భాస్కర్ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక, పట్టు పరిశ్రమశాఖలు వంటి ప్రాధాన్యతా రంగాల పనుల ప్రగతిపై బుధవారం అధికారులతో సమీక్షించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు ఏడాదికి రూ.20 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఎరువుల కంపెనీలకు అందించిందన్నారు. అయితే ఎక్కడా ఐటీ అభివద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని దీనిపై సమగ్ర పరిశీలన చేస్తామని హెచ్చరించారు.
పేదలకు రుణాలివ్వరా..!
బెంజ్ కార్లు కొనుగోలు చేసుకునేందుకు సున్నా శాతం వడ్డీకి రుణాలిస్తారు గాని.. పేదలకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావడం లేదని, రైతులు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని కలెక్టర్ అన్నారు. అధికారులు వారానికి రెండు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీపీవో టి.సురేష్‌కుమార్, ప్లానింగ్ శాఖ డీడీ సాంబశివరావు, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, పట్టుపరిశ్రమశాఖ డీడీ సుబ్బరామయ్య, పశు సంవర్థక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వర్, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరి, మార్కెటింVŠ Sశాఖ డీడీ కె.చాయాదేవి, ఏపీఎంఐపీ పీడీ ఎస్.రామ్మోహన్ పాల్గొన్నారు.
ఆటోనగర్‌ను రద్దు చేయండి
ఆటోనగర్ అసోసియేషన్‌కు ఇచ్చిన సముదాయాలను తరలించలేని పరిస్థితుల్లో ఉన్నందున తక్షణమే వాటిని రద్దు చేయాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా వచ్చిన ఐదు, ప్రోత్సాహకాల మంజూరు కోసం వచ్చిన 20 ప్రతిపాదనలను అనుమతించామని చెప్పారు.
అంగన్‌వాడీ భవనాలు పూర్తి చేయాలి
జిల్లాలో నాబార్డు ఆధ్వర్యంలో ఆర్‌ఐడీఎఫ్ నిధుల ద్వారా 650 అంగన్‌వాడీ భవనాలకు ప్రతిపాదనలను తయారు చేసి సమర్పించాలని ఐసీడీఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మరో 650 అంగన్‌వాడీ భవనాలు ఐసీడీఎస్ నిధుల ద్వారా నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టే గోపాలమిత్ర భవనాల నిర్మాణం నెలాఖరులోపు, నరసాపురంలో రైతుల శిక్షణా కేంద్రం భవనాల నిర్మాణం వచ్చేనెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు.
‘జలసిరి’పై నిర్లక్ష్యం తగదు
ఎన్టీఆర్ జలసిరి పథకం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జలసిరి పథకం అమలు తీరుపై సమీక్షించారు. జలసిరి–2లో భాగంగా జిల్లాలో 4 వేల వ్యవసాయ బోర్లకు సోలార్ యంత్రాలు అందించాలనే లక్ష్యం కాగా ఇప్పటివరకు 685 మాత్రమే పూర్తిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement