తేడాలొస్తే.. సంగతి చూస్తా
తేడాలొస్తే.. సంగతి చూస్తా
Published Fri, Dec 23 2016 11:02 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
డయల్ యువర్ కలెక్టర్‌లో కాటంనేని భాస్కర్
గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పథకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :
మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తే.. అలాంటి వారి సంగతి తేలుస్తామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. బోగస్ లెక్కలు చూపించి సొమ్ములు డ్రా చేస్తే సంబంధిత అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్మానం, ఉపాధి హామీ పథకాలపై శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ అంశాలపై ప్రజలతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన వారి సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు.
టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామానికి చెందిన జి.పాండురంగారావు ఫోన్ చేసి.. మరుగుదొడ్ల నిర్మాణంలో 40 శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకపోయినా కట్టినట్టు చూపించి కొన్నిచోట్ల.. ఒక మరుగుదొడ్డిపై మూడేసి బిల్లులు చొప్పున మరికొన్ని చోట్ల డ్రా చేశారని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో పెద్దఎత్తున యూనిట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు కట్టకుండా కట్టినట్టు లెక్కల్లో చూపి సొమ్ము డ్రా చేస్తే విచారణ జరిపిస్తామన్నారు. సంబంధిత అధికారుల నుండి సొమ్ము రికవరీ చేస్తామని చెప్పారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లోగా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీ ఎం. వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు.
తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన కూనపాముల రాజేష్ కలెక్టర్‌కు ఫోన్ చేసి.. తమ గ్రామంలో 2004లో నిర్మించిన మరుగుదొడ్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, కొత్తగా నిర్మించుకున్న వారికి డబ్బు ఇవ్వకపోవడంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ కార్యదర్శి పనిచేసే చోట నివాసం ఉండటం లేదని, గ్రామానికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. తక్షణమే విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు.
ఏలూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇటీవల పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ జరిగిందని, ఆ గ్రౌండ్ రాళ్ళు, రప్పలతో ఉండటతో సరిగ్గా పరిగెత్తలేకపోయామని చెప్పింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మైదానాన్ని వాకర్లకు అనువుగా రాళ్లు రప్పలు లేకుండా తీర్చిదిద్దాలని కోరింది. దీనిపై ఎస్పీతో చర్చించి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.
పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి గ్రామానికి చెందిన పరువు శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఇంటి పన్నును పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా అద్దెకున్న వారి పేరుతో గుమాస్తా మార్పు చేశాడని ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపితే పెద్ద కుంభకోణం బయటపడుతుందని చెప్పగా.. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పాలకొల్లు ఈఓపీఆర్‌డీకి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సీహెచ్ అమరేశ్వరరావు, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, డీపీవో కె.సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement