ఉద్యోగమంటే సంపాదనకు మార్గం కాదు
ఉద్యోగమంటే సంపాదనకు మార్గం కాదు
Published Fri, Jun 2 2017 2:08 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
ఏలూరు (మెట్రో) : ఉద్యోగమంటే సంపాదనకు మార్గమనుకుంటున్నారని, ఇది సమాజంలో నైతిక పతనానికి దారితీస్తుందని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అన్ని పాఠశాలల్లో మరమ్మతులు పనులు పూర్తిచేసి ప్రతి పాఠశాలలలోనూ వాకింగ్ ట్రాక్‌తో పాటు క్రీడామైదానాలు, కోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పదేపదే చెబుతున్నప్పటికీ కనీసం పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ ఏడాది 599 క్రీడామైదానాలు ప్రారంభించాలని ప్రత్యేకంగా నిధులు అందించినప్పటికీ కేవలం 21 పాఠశాలల్లో మాత్రమే పనులు ప్రారంభించడం దారుణమన్నారు. ప్రభుత్వ, జెడ్పీకి చెందిన 359 పాఠశాలల్లో డయాస్‌ల నిర్మాణానికి కేవలం 8 పాఠశాలల్లో మాత్రమే పనులు ప్రారంభం కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్నారు. పది శాతం కమీషన్ల కోసం కక్కుర్తిపడి అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభించేనాటికే ప్రతి విద్యార్థికీ పుస్తకాలు, యూనిఫారంలు సిద్ధం చేయాలని జనవరి నుంచి ఇప్పటివరకూ 25 సార్లు సమీక్షించినా విద్యాశాఖాధికారుల్లో చలనం లేదంటే ఈ వ్యవస్థే దండగన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లాకు 14.74 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకూ 9 లక్షల పుస్తకాలు మాత్రమే సరఫరా అయ్యాయని చెప్పారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్రింటింగ్ దశలో ఉన్నాయని, రాగానే పంపిణీ చేస్తామని కలెక్టర్‌కు చెప్పారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రింటింగ్ అవుతున్న విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు ప్రత్యేక సిబ్బందిని పంపించి యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించినప్పుడే జిల్లాలో విద్యాశాఖ పాస్ అయినట్టని కలెక్టర్ చెప్పారు.
అన్ని పాఠశాలలకు వంట గ్యాస్
జిల్లాలోని 3,236 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాల కూడా మధ్యాహ్న భోజనానికి కట్టెలపొయ్యి వినియోగించని రీతిలో ఉండాలన్నారు. ప్రతి పాఠశాలకూ నేరుగా ఆయా కంపెనీల ద్వారా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ చెప్పారు. తప్పనిసరిగా ప్రతి పాఠశాలలో కిచెన్‌షెడ్డు, కిచెన్ గార్డెన్లు, నిత్యావసర వస్తువులు కచ్చితంగా ఉండాలన్నారు. ఇకపై బియ్యం, ఇతర పప్పుదినుసులు, నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం తయారీ దారులకు సంబంధించి వేతనం మాత్రమే చెల్లించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవానీ, సర్వశిక్షాభియాన్ పీవో బ్రహ్మానందరెడ్డి, జిల్లాలోని ఉపవిద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement