
సాక్షి, అమరావతి: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన బడి నాడు – నేడు తొలి దశ పనులు పూర్తైన పాఠశాలల్లో మరమ్మతులు, నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లకు పాఠశాల విద్య (మౌలిక సదుపాయాలు) కమిషనర్ కె.భాస్కర్ సూచించారు. నాడు–నేడు తొలి దశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన జారీ చేశారు.
మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలన్నారు. ఈమేరకు ఈ నెల 21వ తేదీలోగా సమగ్ర నిర్వహణ, మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలు, బాలురుకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు.
తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్లదేనని పేర్కొన్నారు. గ్రీన్ చాక్ బోర్డులు, ఐఎఫ్‌పీలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు. టాయిలెట్లలో అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్‌మెంట్ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో తలుపులు, కిటికీలు, సీలింగ్, అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు.
తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ, పంపులు, వాటర్ పైపుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట ఫిల్టర్లను రీప్లేస్‌మెంట్ చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. స్కూళ్ల ఆవరణలో పెయింటింగ్ సరిగా లేకుంటే ఆయా సంస్థలకు తెలియచేసి రంగులు వేయించాలన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.