మొక్క నాటితే రూ. 5 ప్రోత్సాహకం
- కనీసం 50 మొక్కలు, అంతకన్నా ఎక్కువ నాటిన వారికే ఇది వర్తింపు
- వార్డులు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు సైతం ప్రోత్సాహకాలు
- ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు 5 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 50 మొక్కలు, అంతక ంటే ఎక్కువ సంఖ్యలో నాటే వ్యక్తులు, సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సహకారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. రెండో విడత హరితహారం కార్యక్రమం రేపటి (జూలై 8వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి జోగు రామన్న ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంలా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈసారి 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధిస్తామని చెప్పారు.
ఇందులో భాగంగానే ప్రజలను, సంస్థలను భాగస్వాములను చేసేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు వివరించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటే గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేకంగా నిధులను కేటాయించి ప్రోత్సహించాలని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజలందరినీ హరితహారంలో పాల్గొనేలా చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన వివరించారు. మొక్కలు నాటే పౌరులతో పాటు యువజన, ప్రజా సంఘాలకు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. అవార్డుల ద్వారా మొక్కలు నాటే వారిని ప్రోత్సహించడమే గాకుండా, లక్ష్యాన్ని మించి మొక్కలు నాటే పంచాయతీలు, వార్డులు, మునిసిపాలిటీలకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. గ్రామ హరిత రక్షణ కమిటీల ద్వారా మొక్కలను నాటే కార్యక్రమంతో పాటు వాటి సంరక్షణకూ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలు సిద్ధం
హరితహారం కోసం రాష్ట్రంలోని 4,213 నర్సరీల్లో 46.30 కోట్ల మొక్కలను సిద్ధం చేసినట్లు మంత్రి జోగు రామన్న వివరించారు. వీటిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 27.12 కోట్ల మొక్కలు, ఇతర శాఖల ద్వారా 19.17 కోట్ల మొక్కలు నర్సరీల్లో ఉన్నాయన్నారు. వీటిలో అటవీ శాఖ ద్వారా 7.96 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో 33.88 కోట్ల మొక్కలు నాటనున్నట్లు చెప్పారు. మిగతా 5 కోట్లకు పైగా మొక్కలను అవసరమైన వారికి అందిస్తామన్నారు.
నల్లగొండలో 8న సీఎంతో ప్రారంభం
వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఈసారి హరితహారాన్ని ఉద్యమంగా చేపట్టనున్నట్లు మంత్రి రామన్న వివరించారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నల్లగొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభ మవుతుందన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా వీరు తీసుకోవాలన్నారు.