ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల (బీసీ-ఈ కింద) కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదిగా చేరడానికి దరఖాస్తు చేసేందుకు మంత్రి జోగు రామన్న అంగీకరించారు.
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల (బీసీ-ఈ కింద) కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదిగా చేరడానికి దరఖాస్తు చేసేందుకు మంత్రి జోగు రామన్న అంగీకరించారు. రాష్ర్టం తరఫున ఈ కేసును వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ కె.పరాశరన్‌ను నియమించేందుకు మంత్రి అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్నతో బీసీ రిజర్వేషన్ల సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా. పీఎస్ కృష్ణన్ భేటీ అయ్యారు. బుధవారం మంత్రిని అధికార నివాసంలో కలుసుకున్న సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ముస్లింలకు బీసీ-ఈ కేటగిరీ కింద 4 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై మంత్రితో ఆయన చర్చించారు. అందుకు ఢిల్లీ కేంద్రంగా విధులను నిర్వహిస్తున్న కృష్ణన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మంత్రిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ఇన్‌చార్జ్ డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ పాల్గొన్నారు.