parasharan
-
యువ న్యాయవాదులకు ఆదర్శం పరాశరన్ - ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : అపారమైన జ్ఞానం, క్రమశిక్షణ, కఠోర శ్రమ, నైతిక విలువలను కలిగిన వ్యక్తే మాజీ అటార్నీ జనరల్ కే.పరాశరన్ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏజ్ కేర్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పరాశరన్ నేడు సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా గౌరవం అందుకుంటున్నారంటే కారణం ఆయనకున్న విలువలు, వృత్తిపట్ల నిబద్ధతే కారణమన్నారు. ఏజ్ కేర్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో కే.పరాశరన్‌కు 'మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డు'ను ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. పరాశరన్‌ను భారత న్యాయవాదుల సంఘానికి పితామహుడిగా, సూపర్ అటార్నీ జనరల్‌గా పిలుచుకోవడం ఆయనకు భారత సమాజం ఇచ్చే గౌరవమన్నారు. ధర్మంతో పాటు న్యాయాన్ని పాటించడం వల్లే పరాశరన్ నేటికీ యువ న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. -
రాముడి వారసులున్నారా?
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరం–బాబ్రీమసీదు భూ వివాదం కేసు రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శ్రీరాముడి సంతతికి చెందిన రఘువంశం వారు అయోధ్యలో ఎవరైనా ఉన్నారా? అని రామ్‌లల్లా విరాజ్మాన్ తరఫు న్యాయవాది పరాశరన్‌ను ప్రశ్నించింది. శ్రీరాముడికి, ఆయన జన్మస్థలానికి చట్టబద్ధత ఉందనీ, కాబట్టి ఆయన పేరుపై ఆస్తులు ఉండొచ్చనీ, పిటిషన్లు దాఖలు చేయొచ్చని పరాశరన్ వాదించారు. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం స్పందిస్తూ..‘మేం ఉత్సుకతతోనే అడుగుతున్నాం. రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇంకా అయోధ్యలోనే నివాసం ఉంటున్నారా?’ అని అడిగింది. దీంతో పరాశరన్ స్పందిస్తూ..‘దీనికి సంబంధించి నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే వివరాలను మీ ముందు ఉంచుతాం’ అని జవాబిచ్చారు. జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్నవ్యక్తిగా ఎలా పరిగణిస్తారని కోర్టు ప్రశ్నించడంతో..‘ కేదర్నాథ్ ఆలయాన్నే తీసుకుంటే, అక్కడ ఎలాంటి విగ్రహం లేకపోయినా ప్రజలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ కేసులో జన్మస్థలాన్ని చట్టబద్ధత ఉన్న వ్యక్తిగా పరిగణించవచ్చు’ అని పరాశరన్ తెలిపారు. రోజువారీ విచారణ సాగుతుంది అయోధ్య భూ వివాదం కేసులో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు రోజువారీ విచారణ చేపట్టడంపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఇతర ముస్లిం పిటిషనర్ల తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ వ్యతిరేకించారు. ఇంతవేగంగా విచారణ జరపడం వల్ల సంబంధిత పత్రాలను అధ్యయనం చేసి విచారణకు సిద్ధం కావడం కష్టంగా ఉందని కోర్టుకు విన్నవించారు. -
ముస్లిం రిజర్వేషన్ల కేసులో ప్రతివాదిగా ఓకే
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల (బీసీ-ఈ కింద) కేసులో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదిగా చేరడానికి దరఖాస్తు చేసేందుకు మంత్రి జోగు రామన్న అంగీకరించారు. రాష్ర్టం తరఫున ఈ కేసును వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ కె.పరాశరన్‌ను నియమించేందుకు మంత్రి అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ర్ట బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్నతో బీసీ రిజర్వేషన్ల సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా. పీఎస్ కృష్ణన్ భేటీ అయ్యారు. బుధవారం మంత్రిని అధికార నివాసంలో కలుసుకున్న సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ముస్లింలకు బీసీ-ఈ కేటగిరీ కింద 4 శాతం రిజర్వేషన్లు అమలు విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన అంశాలపై మంత్రితో ఆయన చర్చించారు. అందుకు ఢిల్లీ కేంద్రంగా విధులను నిర్వహిస్తున్న కృష్ణన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా మంత్రిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ఇన్చార్జ్ డెరైక్టర్ కె.ఆలోక్‌కుమార్ పాల్గొన్నారు.