హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా 5-డీ థియేటర్లు తదితరాల ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతికశాఖల మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు, పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, రాకెట్ మోడల్స్, పవన, జీవశక్తి, భూగోళశాస్త్ర వివరాలను పొందపరచనున్నట్లు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో సైన్స్ సెంటర్లు, ప్రజోపయోగకరమైన పరిశోధన, సైంటిస్టులు, అధ్యాపకులు, రిసెర్చీ స్కాలర్‌లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ శాస్త్ర, సాంకేతిక శాఖ వెబ్‌సెట్, లోగోను ఆవిష్కరించారు. ఈ శాఖ సభ్యకార్యదర్శి వై.నగేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.160 కోట్లు కాగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.66 కోట్లు, హెచ్‌ఎండీఏ రూ.40 కోట్ల వరకు భరించనుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్,పబ్లిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, పర్యాటక, సాంస్కృతిక శాఖల ద్వారా ఈ సైన్స్ సిటీ ఏర్పాటునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2014లో రంగారెడ్డి జిల్లాలోన బుద్వేల్ సమీపంలో సుమారు 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం తమ ప్రభుత్వం వచ్చాక వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సాంకేతికపరంగా చోటుచేసుకునే మార్పుచేర్పులకు సంబంధించిన అంశాలు, శాస్త్ర, సాంకేతిక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, వర్క్‌షాపు వివరాలు తదితర అంశాలను www.tscost.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలియజేశారు.
కొత్త పరిశోధనలు..
ఈ శాఖ ద్వారా కొమరం భీమ్ జిల్లా కెరమెరి మండలం ఎగువప్రాంతాల్లో ఆపిల్, మల్బరీ సాగుకు గల అవకాశాలపై సీసీఎంబీ సహకారంతో పరిశీలన, ఆముదం పంటకు వచ్చే గ్రేమోల్డ్ రోగ నివారణ పద్ధతులను రూపొందించడంపై మహబూబ్‌నగర్ జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చీ ద్వారా వర్షపు నీటి వినియోగించి ఫ్లోరైడ్ సమస్యను తగ్గించేందుకు నల్లగొండ జిల్లాలో జేఎన్‌టీయూ, సెంటర్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పరిశోధనలు, రైతులు, వినియోగదారుల ప్రయోజనార్దం తృణ ధాన్యాల నిల్వ కాలాన్ని పెంపొందించడంపై ఓయూ, ఇక్రిశాట్‌ల సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు జోగురామన్న తెలిపారు.
హైదరాబాద్‌లో సైన్స్ సిటీ
Published Thu, Oct 20 2016 6:26 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement