కేస్లాపూర్‌లో నాగోబా జాతర సందర్భంగా కిక్కిరిసిన జనాలు, జోగు రామన్నకు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల డిమాండ్‌పై ప్రభుత్వానికి స్పష్టత ఉందని అటవీ, పర్యావరణ, బీసీ సం క్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్‌లో రామన్న మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా హక్కులను అమలు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ, లంబాడీల మధ్య తలెత్తిన వివాదం సున్నితమైందని, ప్రభుత్వం తరఫున సీఎస్, డీజీపీలు ఇరువర్గాలతో చర్చించారని వివరించారు.
నాగోబా దర్బార్‌లో ఆదివాసీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ మేడారం జాతర తర్వాత మలి విడత చర్చలు జరిపి, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోందన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు తదితర అంశాలలో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ వి.శోభారాణి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే..
దర్బార్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆదివాసీల నుంచి అర్జీలు స్వీకరించింది. సాధారణంగా దర్బార్‌లో ఆదివాసీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేస్తారు. కానీ, ఈసారి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్‌తో అర్జీలు అందజేయడం గమనార్హం. దర్బార్ వేదికపై నుంచి ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఇదే డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు.
పోటెత్తిన కేస్లాపూర్
దర్బార్ సందర్భంగా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు తరలివచ్చిన ఆదివాసీలతో కేస్లాపూర్ పోటెత్తింది. పరిసరాల్లో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఈ నెల 16న ప్రారంభమైన నాగోబా జాతర శుక్రవారం దర్బార్‌తో అధికారికంగా ముగిసింది. మరో రెండు, మూడు రోజులపాటు ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment