
సాక్షి, హైదరాబాద్: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది.
విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని భావించిన అధికారులు ఈమేరకు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించిన యంత్రాంగం 360 మందిని అర్హులుగా గుర్తించింది. ఈ విద్యార్థులను సీఓఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు.
ఒకటి రెండురోజుల్లో తరగతులు ప్రారంభం
సీఓఈని ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన అధికారులు, ఒకట్రెండు రోజుల్లో అక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. 360 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా... ఇందులో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు చెందిన 180 మంది, సెకండియర్ చదువుతున్న 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగంమంది బాలికలున్నారు.
విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నిర్వహించే తరగతులతో పాటు అదనపు శిక్షణ కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అ«ధ్యాపకులను సైతం నియమించారు. ఈ కేంద్రాన్ని రెండ్రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. వారాంతంలోగా తరగతులు ప్రారంభించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment